సీతాకోకచిలుక అందాలు;-డా.టి.రాధాకృష్ణమాచార్యులు9849305871.
ఒక్క చినుకుతో
ఆకుపచ్చ కోక కట్టింది మనసు 
రంగుల రమణీయ దారాలలో
సొగసు నేసిన రంగవల్లుల ధాత్రి

ఒక్క మెరుపులో
కోక అందాలన్నీ చుట్టకున్న ఆమని     
 తలపు తంగేడు పువ్వంచు చీరలో 
 అవని ఊగింది సన్నాయి పాటలా

ఒక్క ఉరుముతో
చిలుక పాడింది మట్టిలో గీతనే
స్వరమే తానై జగమంత తిరిగే
రసరాగ రంగుల వలపుటంగీలతో

ఒక్క అక్షరంతో
నింగి తెరపై నీలి మేఘ జవ్వని ఆట  
మనసు చిలికింది తేనియ ప్రాణమై
సీతాకోకచిలుక ఎగిరే తోటలో రాణై 

అందాలన్నీ ఒక్క చోటే కుప్ప పోసిన 
ప్రకృతి సొగసు జగమైంది నిజమే
అందానికి నిర్వచనం సృష్టి దీప్తి
 మనసు చూసిన కళలే సోయగం


కామెంట్‌లు