గాలిమేడలు;-సంధ్యా కుమరి ఎరుసు-కలం స్నేహం
యవ్వనపు తొలి పొంగులు
అన్ని నాకే తెలుసనుకునే రోజులు-

అంతటా నేనే అనుకుంటూ 
ఈ నేల,ఆ నింగితోనే 
సయ్యాటలాడాలని
తహతహలాడే తుంటరి వయసు,

మనసంతా తుళ్ళింతే
వలచినవన్నీ కావాలనే ఊహల్లో 
ఉర్రూతలూగుతా
గాలిమేడలు కట్టేస్తూ నిదురించే
తలగడలో ఎన్ని ఊసులు 
పండించేస్తామో!

రంగు రంగుల ప్రపంచంలో
ఒక్కొక్క హంగూ చేజారుతుంటే
ఊహల్లో కట్టిన ఆ గాలి మేడల
పరదాలు ఒక్కొక్కటిగా 
తొలుగుతుంటే కాని కానరాలేదు

ఉవ్విళ్ళూరే కొంటె వయసుకు 
కోరికలే గుర్రాలై,ఊహలకే రెక్కలు 
మొలిపించే కాలంలో కట్టిన 
గాలి మేడలు, ఆ అద్దాలసౌధం
చిన్న వానకే కుప్పకూలిపోవడం-
ఎందరికో గుణపాఠంగా 
మిగిలిపోవడం 
ఇదొక నగ్న సత్యం

గాలి మేడలతో,పేకమేడలతో
అద్దాల సౌధాలు నిర్మించుకుంటే 
కుప్పకూలక మానవు;
ఇకనైనా ప్రగతి పధంలో నడుద్దాం
సమాజానికి దేశానికి వన్నెతెచ్చే
దారుల్లో నడుద్దాం


కామెంట్‌లు