భారతియార్ ముచ్చట్లు;-- యామిజాల జగదీశ్
 తమిళ నేలపై సాహిత్య నీరు పారించి వీరత్వాన్ని విత్తిన ధీరోదాత్తుడు, జాతీయ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతియార్ ప్రజల హృదయంలో ఇప్పటికీ ఎప్పటికీ నిత్యనూతనమై ఉంటారన్నది అతిశయోక్తికాదు. ఆయన గురించి కొన్ని ముచ్చట్లు.....
ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు సుబ్రమణ్యన్. సుబ్బయ్య అనేది ముద్దు పేరు. ఆయన ప్రతిభాపాటవాలు భారతి అనే బిరుదుని సంపాదించిపెట్టాయి. అలాగే మహాకవి, మురుక్కు మీసైకారన్, ముండాసు కవి (తలపాగా కవి), పాట్టుకొరు పులవన్ (పాటకో పండితుడు), సింధుకు తందై (సింధూకి తండ్రి) ఇలా మరెన్నో పిలుపులకు ఆయన సొంతదారు.
ఆయన జన్మస్థలం ఎట్టయపురం. బతికిన ఊరు చెన్నై. 13 ఏళ్ళపాటు తల దాచుకున్న ఊరు పుదుచ్చేరి (పాండిచ్చేరి). ఈ మూడు ప్రాంతాలలోనూ ఆయన స్మృత్యర్థం మూడు ఇళ్ళు ఏర్పాటయ్యాయి.
సుదేశమిత్రన్ (స్వదేశమిత్రన్), చక్రవర్థిని, ఇందియా, విజయా, సూర్యోదయం, కర్మయోగి, ధర్మం వంటి తమిళ పత్రికలలోనూ, బాలభారతా అనే ఇంగ్లీష్ మ్యాగజైన్లోనూ పని చేశారు. జీవితాంతమూ పాత్రికేయుడిగా బతికారు. 
పత్రికా రంగంలోకి రాకముందర మదురై సేతుపతి పాఠశాలలో తమిళ మాష్టారుగా రెండు నెలలు పని చేశారు. అప్పట్లో ఆయన నెల జీతం పదిహేడు రూపాయలు. ఇప్పటికీ ఆ స్కూలుని భారతియార్ పని చేసిన స్కూలుగా చెప్పుకుంటూ ఉంటారు.
ఆయనకు ఏడేళ్ళకే పాటలు రాయాలనే ఆసక్తి కలిగింది. పదకొండో ఏట ఓ పోటీలో పాల్గొని అందులో విజయం సాధించినందుకు భారతి అనే బిరుదు పొందారు. భారతి అంటే సరస్వతి!
ఇళసై సుబ్రమణ్యం అని తొలిరోజుల్లో రాయడం మొదలుపెట్టిన ఈయన వేదాంతి, నిత్య ధీరర్, ఉత్తమ దేశాభిమాని, షెల్లీ దాస్, రామదాసన్, కాళిదాసన్, శక్తి దాసన్, సావిత్రి వంటి కలం పేర్లతో అనేక రచనలు చేశారు.
పద్నాలుగున్నరేళ్ళకు ఆయన ఏడేళ్ళ చెల్లమ్మాళ్ ను వివాహమాడారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. వారి పేర్లు - తంగమ్మాళ్, శకుంతల.
తమిళ పత్రికా రంగంలో కాలమిస్టుగా వ్యాసాలు రాసిన తొలి పాత్రికేయుడితను. ప్రపంచ వినోదాలు, పట్టణ వార్తలు, రసవాదం, తరాసు తదితర శీర్షికలతో అనేక రచనలు చేశారు.
మొట్టమొదటగా రాజకీయ కార్టూన్లతో పేరుగడించింది ఈయనే. చిత్రావళి అనే పేరుతో కార్టూన్ పత్రిక నడపాలన్న ఆయన ప్రయత్నం నెరవేరలేదు.
భారతియార్ కి పాత్రికేయ గురువు "ది హిందూ" జి. సుబ్రమణ్య అయ్యర్. రాజకీయ గురువు - బాలగంగాధర్ తిలక్. ఆధ్యాత్మిక మార్గదర్శి అరవిందులవారు. సిస్టర్ నివేదితా నుంచి కూడా ఎన్నో విషయాలు నేర్చుకున్నారు.
ఆయన పాడిన తొలి పాట - "తనిమైయిరక్కం...."  అలాగే ఆయన పాడిన చివరి పాట "భారత సముదాయం వాయ్గవే".
ఆయన పేరిట అచ్చయిన మొదటి పుస్తకం - స్వదేశ గీతంగళ్.
మణియాచ్చి జంక్షన్లో కలెక్టర్ ఆష్ హత్యోదంతంలో ఈయన మీద సందేహాలు తలెత్తాయి. ఈ వ్యవహారంలో ఈయననూ ప్రశ్నించారు.
భారతియార్, భారతిదాసన్ కలిసి ఓరోజు కుంపటి అంటించారు. కానీ ఎంత సేపటికీ కుంపటి అంటుకోలేదు. వంట చేయడానికి స్త్రీలు ఎంతగా శ్రమపడుతున్నారోనని గ్రహించి ఆరోజు భారతియార్ మహిళలు వర్థిల్లాలి అంటూ ఓ పాట రాశారు. ఆరోజు నుంచీ స్త్రీలను తిట్టడమూ మానేశారు. 
ఆరోజుల్లో ఆచారాలకు ఏవైతే విరుద్ధమో అవన్నీ చేశారు భారతియార్. 
లక్ష్మీ, సరస్వతి, కృష్ణుడు దేవుళ్ళ ఫోటోలు ఆయన దగ్గరుండేవి. కృష్ణుడికి నమస్కరించుకున్న తర్వాతే పనులు మొదలుపెట్టేవారు.
కనకలింగం, నాగలింగం అనే ఇద్దరికీ గాయత్రీ మంత్రం చెప్పి ఉపనయనం చేశారు. ఆయన జంధ్యం వేసుకునేవారు కాదు. జంధ్యాన్ని తీసేసారని పోలీస్ వారి ప్రకటన అప్పట్లో అందరి దృష్టినీ ఆకట్టుకుంది.
నల్లకోటు, తలపాగా ఆయన గుర్తులు. పంచ కట్టుకునేవారు. చొక్కా మరికిగా ఉన్నా పట్టించుకునేవారు కాదు. అలాగే చొక్కా చిరిగి ఉన్నా వేసుకుని వెళ్ళిపోయేవారు. కానీ చొక్కాలో అందరికీ కనిపించేటట్లు ఓ గులాబీ పువ్వు లేదా మల్లెపువ్వు పెట్టుకునేవారు.
"మిస్టర్ గాంధీ! రేపు సముద్రతీరాన ప్రసంగించబోతున్నాను. మీరు అధ్యక్షత వహించాలి" అని ఆయన చెప్పినప్పుడు "సభ మరుసటిరోజుకి వాయిదా వేయడానికవుతుందా?" అని గాంధీజీ అడిగారు.
"అది కుదరని పని. కానీ మీరు ప్రారంభించబోయే ఉద్యమానికి నా శుభాకాంక్షలు" అని చెప్పి వెనక్కొచ్చేసిన భారతియార్ వంకే చూస్తూ ఉండిపోయిన గాంధీజీ "ఈయనను జాగర్తగా చూసుకోవాలి. కాపాడుకోవాలి" అని పక్కనే ఉన్నవారితో చెప్పుకున్నారట.
ఆయన తన రచనలను నలభై సంపుటాలుగా ముద్రించాలనుకున్నారు. ఒక్కొక్కరూ వంద రూపాయల చొప్పున ఇచ్చి సహకరించాలని కోరారు. కానీ ఆయన అనుకున్న వారెవరూ డబ్బులు పంపలేదు.
భార్య చెల్లమ్మాళ్ భుజంమీద చేయి వేసుకునే వీధిలో వెళ్ళేవారు భారతియార్. "పిచ్చోడు షికారుకి పోతున్నాడు" అని చూసినవారు ఎగతాళిగా మాటలనేవారు. ఆ మాటలు విన్న భారతియార్ అప్పటికప్పుడు ఓ పాట రాశారు. "నిమిర్నద నన్నడై....నేర్కొండ పార్వై" అనేదే ఆ పాట.
తమిళం, ఆంగ్లం, సంస్కృతం, ఫ్రెంచ్, తెలుగు తదితర భాషలు తెలుసు. 
పోలీసులు ఓ ఉదంతంలో ప్రశ్నించినప్పుడు "మీరు లండన్లో చదువుకున్నారా? పద ఉచ్చారణ అంత స్పష్టంగా ఉందే" అని ఆశ్చర్యపోయారట విచారణాధికారి.
తమిళం‌, తమిళనాడు విశిష్టతల గురించి పాట రాయాలని మదురై తమిళ సంఘం కోరినప్పుడు ఆయన రాసిన కవిత - "సెందమియ్ నాట్టెనుం బోదినిలే...". ఈ కవితకు ఆయనకు దక్కిన పారితోషికం వంద రూపాయలు.
స్వామి వివేకానందులవారి శిష్యురాలైన నివేదితా దేవి భారతియార్ కి ఓ రావి ఆకు ఇచ్చారు.ఆ ఆకు హిమాలయాల నుంచి తీసుకొచ్చారట నివేదితా దేవి. తన తుదిశ్వాస వరకూ భారతియార్ ఆ ఆకుని పదిలంగా దాచుకున్నారు.
తిరువల్లిక్కేణి (ట్రిప్లికేన్, చెన్నై) లోని పార్థసారథి ఆలయ ఏనుగుకి బెల్లం ఇవ్వడానికి వెళ్ళిన భారతియార్ ని ఆ ఏనుగు తన తొండంతో ఎత్తి కిందపడేసింది. అప్పుడు ఆయన తలకూ రొమ్ముకూ తీవ్రగాయాలయ్యాయి. ఆ గాయాల నుంచి కోలుకున్నాక "కోయిల్ యానై (ఆలయ ఏనుగు) అనే వ్యాసం రాశారు భారతియార్.
ఆఫ్ఘన్ చక్రవర్తి అమానుల్లా ఖాన్ గురించి రేపు ఉదయం ఓ వ్యాసం రాసి తీసుకువెళ్ళాలి అని పడుకున్న ఆయన నిద్దట్లోనే ప్రాణాలు కోల్పోయారు. ఆయన భౌతికకాయానికి చెన్నై కృష్ణమాపేట శ్మశానంలో అంత్యక్రియలు జరిగినప్పుడు ఇరవై మందిలోపే హాజరయ్యారు.
 

కామెంట్‌లు