నా పాఠశాల;-ముద్దు వెంకటలక్ష్మి-కలం స్నేహం
"అధ్యాపకులు జాతి నిర్మాతలు"
నరనరాల్లో జీర్ణించుకున్న
- డాక్టర్ రాధాకృష్ణ గారి సూక్తిని
అక్షరాలా ఆచరించే ఆశయంతో
 అధ్యాపకురాలినై నడయాడిన పాఠశాల ;

 దేశ రాజధాని ఢిల్లీలో
తెలుగు భాషా సంస్కృతుల
పరిరక్షణ కోసం, విద్యావ్యాప్తి కోసం
నడుంకట్టిన నారీమణి,
అకుంఠిత దేశభక్తురాలు
డాక్టర్ దుర్గాబాయి దేశ్ ముఖ్
డెబ్బదిరెండేండ్ల క్రితం స్థాపించిన
ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ
దిన దిన ప్రవర్ధమానమై
దశదిశలా నెలకొల్పిన
ఆంధ్రా పాఠశాలల్లో
ఒకటి నా పాఠశాల ;

తెలుగు భాషా సంపత్తికి
నిలువెత్తుటద్దం,
భారతీయ సాంప్రదాయాలకు
నిలబెట్టిన ధ్వజస్వరూపం ;

తెలుగు, తెలుగేతర విద్యార్థులకు
త్రిభాషా సూత్రాన్ని త్రికరణశుద్ధిగా
అమలుపరుస్తున్న
విద్యానిలయం ;

స్థానిక పాఠశాలలకు
విజ్ఞానకేంద్రంగా విలసిల్లుతున్న
ఆదర్శ పాఠశాల ;

ఉత్తర దక్షిణ భారత
సంస్కృతులకు వారధియై
జాతీయ సమైక్యతకు
ప్రతీకగా నిలిచిన విద్యామందిరం ;

జాతీయ అంతర్జాతీయ వేదికలపై తమ పాఠశాలకు
ప్రాతినిధ్యం వహిస్తూ
విజయఢంకా మోగిస్తున్న 
విద్యార్థులకూ, అధ్యాపకులకూ
పేరు పొందిన విద్యాలయం ;

నా వ్యక్తిత్వానికొక అస్తిత్వాన్ని ప్రసాదించిన 
నా పాఠశాల
నాకు నిత్యస్మరణీయం.


కామెంట్‌లు