కోవై సరళ ముచ్చట్లు;-- జగదీశ్ యామిజాల
 "కామెడీ ఇళవరసి" నటి కోవై సరళ తమిళ, తెలుగు సినిమాలలో నటించి తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఇప్పటికీ ఆమె నటించిన సన్నివేశాలను చూస్తున్నప్పుడు నవ్వు రాక మానదు. 
నగైచ్చువై ఇళవరసి (ఇళవరసి అంటే యువరాణి అని అర్థం) అని కోలీవుడ్ లోకంలో నిండు అభిమానంతో కోవై సరళను పిల్చుకుంటారు. ఆమె అసలు పేరు సరళాకుమారి.
ఆమె జన్మస్థలం కోవై (తమిళనాడు) కావడంతో కోవై సరళగా ప్రసిద్ధి చెందారు. అదే ఆమె అసలు పేరులా మారిపోయింది.
ఆమె తండ్రి ఓ సైనికాధికారి. ఆరుగురి బిడ్డలలో ఆమె ఆఖరి అమ్మాయిగా జన్మించారు. ఆమెకు నలుగురు అక్కయ్యలు, ఒక సోదరుడు ఉన్నారు.
అయిదో ఏటనే ఆమెకు సినిమా అంటే ఇష్టమని తల్లిదండ్రులతో చెప్పి అందులో తనను చేర్పించమని పట్టుబట్టారు.
ఆమెకు పురట్చి తలైవర్ ఎంజిఆర్ అంటే మహా ఇష్టం. ఎంజిఆర్ నటించిన సినిమాలు చూసి తాను కూడా సినిమాలలో నటించాలనే ఆసక్తి పెంచుకున్నారు.
చదువుమీద అంత శ్రద్ధ చూపలేదు. దాంతో స్థానికంగానే చిన్న చిన్న నాటకాలలో నటిస్తూ వచ్చారు.
 
ఎంజిఆర్ తమ పార్టీ కార్యక్రమాల నిమిత్తం కోవైకి వచ్చినప్పుడల్లా ఆమె ఆయన ఎక్కడ మాట్లాడితే అక్కడికి వెళ్ళి ఆయన ప్రసంగాలు వినడం మొదలుపెట్టారు. ఆమె వేదికలెక్కి ఎంజిఆర్ మాటలకు చప్పట్లు చరిచేవారు. ఆమెను గమనిస్తూ వచ్చిన ఎంజిఆర్ ఓమారు కోవైకి వచ్చినప్పుడు కోవై సరళను దగ్గరకు పిలిచి "ఇలా వేదికలెక్కకూడదని, ముందు చదువుకో...చదువు పూర్తయ్యాక నన్నొచ్చి కలుసుకో" అని సూచించారు.
ఆరుగురు బిడ్డలతో ఆమె తల్లిదండ్రులు ఆర్థిక కష్టాలకు లోనైనప్పుడు ఆ విషయం తెలిసిన ఎంజిఆర్ ఆమె కుటుంబానికి చదువుసంధ్యలకోసు ఆర్థికసాయం అందించారు.
ఎంజిఆర్ అందిన ఆర్థికసాయంతో చదువుకున్న కోవై సరళ తాను కూడా ప్రజలకు తన శక్తి మేరకు చేయూతనందించాలనుకున్నారు.
తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడే ఆమె కొన్ని నాటకాలలో నటించారు. ఆ సమయులోనే ఆమెకు "వెల్లి రథం" ( వెండి రథం) అనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది.
అనంతరం తమ బంధువైన దర్శకుడు కె. భాగ్యరాజ్ దర్శకత్వం వహించి నటించిన ముందానై ముడిచ్చి సినిమాలో కోవై సరళ నటించారు.
కోవై సరళ పదో తరగతి చదువుతున్న రోజులవి. ముందానై ముడిచ్చి సినిమాలో ఆమె ముప్పై రెండేళ్ళ గర్భిణి పాత్రలో నటించి అందరి మెప్పూ పొందారు.
పన్నెండో తరగతి చదివిన తర్వాత తల్లిదండ్రులతో కలిసి చెన్నైకి వచ్చేసారు. ఆళ్వార్ పేటలో మూడు వందల రూపాయలకు ఓ ఇంట్లో అద్దెకు దిగారు. సినిమాలో అవకాశాలకోసం కోవై సరళ అన్వేషించసాగారు.
చెన్నైకి రావడంతోనే ఆమెకు అవకాశాలు రాలేదు. కనుక మళ్ళీ కె. భాగ్యరాజ్ ను కలిసి నటించే అవకాశం ఇవ్వమని కోరారు. అప్పుడు భాగ్యరాజ్ తాను దర్శకత్వం వహించి నటిస్తున్న "చిన్న వీడు" సినిమాలో అరవై అయిదేళ్ళ తల్లి వేషంలో నటించే అవకాశం ఇచ్చారు ఆమెకు. అప్పుడు కోవై సరళ వయస్సు పద్దెనిమిదేళ్ళు. తల్లి వేషంలో నటించడం ఇష్టం లేకున్నా ఆమె నటించి అందరి మెప్పూ పొందారు. ఈ సినిమా ఆమె నటజీవితంలో ఓ పెద్ద మలుపు అనే చెప్పుకోవాలి.
ఈ సినిమా అనంతరం తంబిక్కు ఎంద ఊరు, వైదేహి కాత్తిరుందాళ్ వంటి అనేక సినిమాలలో నటించిన కోవై సరళ బిజీ ఆర్టిస్టుగా మారారు. 
హాస్యనటులు సెందిల్, గౌండమణిలతో కలిసి నటించిన కరకాట్టక్కారన్ సినిమాతో ఆమె దశ తిరిగింది. అంతేకాదు ఆమెను కామెడీ ఇళవరసిగా మార్చేసింది. 
మనోరమ తర్వాత తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్న కోవై సరళ ఏడు వందల యాభైకిపైగా చిత్రాలలో నటించడమే కాక ఒకటి రెండు పాటలుకూడా పాడటం గమనార్హం.కామెంట్‌లు