అది ఒక పల్లె. ఆ పల్లెలో ఓ పుంజుకోడి ఉంది. తాను మంచి రంగుతో, తలపై ఎర్ర తలపాగాతో అందంగా ఉంటానని దానికి గర్వం.ఆ కోడిపుంజు తల పైకెత్తుకొని ఠీవిగా దారివెంట నడుస్తోంది. ఒక కోతి దానికి ఎదురుగా వచ్చింది. కోతిని చూసి పుంజు హేళనగా నవ్వింది.
ఎందుకు నవ్వుతున్నావని కోతి అడిగింది.
"నీముఖం చూసి నవ్వాను. అద్దంలో గానీ, నీటిలో గాని నిన్ను ఎప్పుడైనా చూసుకున్నావా? అదిగో అక్కడున్న కాకి,పిచ్చుక,కుక్క,గాడిద,గేదె,దున్నలనుచూసి రోజూ నవ్వుతుంటా. నాకంటే అందమైన, నాలా కూతగల పక్షికానీ, జంతువుకానీ ఎక్కడా లేదు" అంటూ పుంజు గర్వంతో తల ఎగరేసింది.
"నువ్వు ఈపల్లెలో ఉండి ఇదే ప్రపంచమనుకుంటున్నావు.ఒకసారి నావెంటరా!అందమైన అడవిని చూపిస్తాను.రకరకాల పక్షులను, జంతువులను చూపిస్తాను. పగలబడి నవ్వుదువుగానీ"అంది కోతి. ఆమాటలకు కోతివెంట అడవికి బయలుదేరింది పుంజు. రెండూ అడవిలోపలకు చేరుకున్నాయి. 'ఈఅడవి ఎంత అందంగా ఉందో'' అనుకుంది పుంజు.
"ఇక్కడికి దగ్గరలో నీటికొలను ఉంది. కాబట్టి ఈదారివెంట చాలా జంతువులు పోతుంటాయి.మనం ఈచెట్టుమీద కూర్చుందాము"అంటూ చెట్టు ఎక్కింది కోతి. శక్తినంతా ఉపయోగించి చెట్టుపైకి ఎగిరి కోతి పక్కన కూర్చుంది పుంజు.
కోతి ఆదారి వెంట వెళ్తున్న సింహాన్ని చూపిస్తూ,'ఈజంతువు పేరు సింహం' అంది.కోడిపుంజు కళ్లింతచేసుకుని చూస్తూ,"మెడచుట్టూ వెంట్రుకలచక్రంతో ఎంతబాగుందో!ఆనడక ఎంత ఠీవిగా ఉందో!"అంటూ ఆశ్చర్యపోయింది. ఆదారివెంట పోతున్న మరో జంతువును చూపుతూ "ఈజంతువు పేరు పులి" అంది కోతి.పుంజు ఆశ్చర్యంగా చూస్తూ "అబ్బో చారలకోటు వేసుకుని చాలా బాగుంది. ఆనడక చూడాలనిపించేలా ఉంది"అంది.
అటుగా వస్తున్న మరో జంతువును చూపి "దీనిపేరు చిరుతపులి" అంది కోతి. పుంజు కళ్లింతచేసుకుని చూస్తూ "చిరుత చుక్కలచీరలో ఎంత అందంగా ఉంది" అంది ."ఈజంతువులు మీపల్లెలోని దున్నను కూడా చంపి, ఈడ్చుకెళ్లగలవు" అంది కోతి.
"అబ్బో!వీటికి అంత బలమా!" అని నోరెళ్లబెట్టింది పుంజు. అటుగా వెళ్తున్న మరో జంతువును చూపి "దీనిపేరు ఎలుగుబంటి"అంది కోతి.
"ఆహా!బొచ్చుకోటు తొడుక్కుని ఎలుగు బంటు ఎంతబాగుందో!" అంది పుంజు.మరొక జంతువును చూపిస్తూ "ఇది కుందేలు"అంది కోతి.
"తెల్లగామెరిసిపోతూ ఎంత ముద్దుగా ఉందో!"అంది పుంజు.
అటుగా వస్తున్న ఒకపక్షిని చూపిస్తూ "దీనిపేరు నెమలి" అంది కోతి.
"నెమలి ఈకల తోక తళుకు తళుకుమని ఎంత మెరిసిపోతోందో! ఏమందం ఏమందం" అంది పుంజు.
"నెమలి ఈకల తోకను పింఛం అంటాము. నెమలి నాట్యం చేస్తే చూడటానికి రెండుకళ్ళూ చాలవు" అంది కోతి. "ఆహా...అలాగా!"అంది పుంజు.
"అదిగో ఆ చిలుక చూడు. పచ్చని చీరతో ఎంత అందంగా ఎగురుతూ ఉందో! ఆ సీతాకోక చిలుకలను చూడు. రంగురంగుల దుస్తులతో ఎంత అందంగా ఉన్నాయో!"అంది కోతి.
ఇంతలో ఓకోయిల కమ్మగా కూసింది.
"ఇంత తియ్యని కూత ఎవరిదీ?" అంది పుంజు.
"ఆతియ్యని గొంతు కోకిలది" అంది కోతి. "ఆకమ్మని కూతముందు నాకూత ఏపాటిది" అంటూ ఆశ్చర్యపోయింది పుంజు.
ఇంతలో చెట్టుమీద పాము కదలిక, బుస గమనించి తలతిప్పి చూసింది కోతి. ఒకపాము కోతి వైపు వస్తూ కనిపించింది. "ఇక్కడ పాము ఉంది. నావెంటరా!" అంటూ వేగంగా చెెంగునఎగిరి పక్కనున్న మరో చెట్టుమీదకు దూకింది కోతి. పుంజుకోడి తటపటాయిస్తూ శక్తినంత రెక్కల్లోకి తెచ్చుకుని ఎగిరి కోతిపక్కకు చేరింది. "కోతిమిత్రమా!నన్ను క్షమించు. నీలా ప్రమాదాన్ని పసిగట్టగల నేర్పు, నీలాగా దూకగల శక్తి, నైపుణ్యం నాకెక్కడున్నాయి. ఆజంతువుల అందం, శక్తి, ఠీవి ఆపక్షుల అందం.గాలిలో ఎగరగల శక్తి, కోకిలలాంటి గొంతు నాకెక్కడుంది? ఇతరుల ప్రతిభను తెలుసుకోకుండా తెలిసీతెలియని తనంతో నాఅంతవారు లేరనే గర్వం తలకెక్కించుకుని హేళనచేస్తూ తిరిగాను.మాపల్లెలోని ప్రతి జంతువుకు కూడా ఏదో ఒక ప్రతిభ ఉంటుందని తెలుసుకున్నాను. నాకళ్ళు తెరిపించావు. పల్లెకు వెళ్తాను. అప్పుడప్పుడూ వస్తూ ఉండు" అంది పుంజు.
"నిన్ను ఒంటరిగా ఎలా వెళ్లనిస్తాను. నేను తోడుగావచ్చి అడవి దాటిస్తాను. పదా!" అంది కోతి.
కనువిప్పు కల్గిన పుంజుకోడి కోతి సాయంతో క్షేమంగా అడవి దాటి పల్లెకు చేరుకుంది.
కోతి--కోడిపుంజు;-డి.కె.చదువులబాబు.ప్రొద్దుటూరు.కడపజిల్లా.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి