గీతాంజలి ; రచయిత, చిత్రకారుడు : జింకా రామారావు

 14. నిత్య సమాయత్తం
అంతులేని ఆశలభారంతో దీనాతిదీనంగా నేను వేదన పడుతున్నాను. లెక్కలేనన్ని ఆశలు తీర్చకుండా నిరాకరిస్తూ నువ్వు నన్ను రక్షిస్తున్నావు. నీ కరుణే నా జీవన ప్రగాఢబంధమై వుంది. నేను కోరకపోయినా నీ దయ మాత్రం నామీద వర్షిస్తూనే వుంది. ఈ రూపం, వెలుగు, తనువు, జీవితం, మనసు, మమత నాకు నువ్వనుగ్రహించిన అపురూప కానుకలు. వీటికి నన్ను అర్హుణ్ణి చేసి అత్యాశలవల్ల కలిగే ఆపదలనుండి నన్ను నేను కాపాడుకోగలిగిన శక్తిని యిచ్చావు.
నా జీవితంలో సోమరితనంతో వృధా చేసుకున్న రోజులూ, మెళకువతో పరమార్ధ అన్వేషణ చేసిన రోజులూ ఉన్నాయి. అయితే దయలేనివాడిలా నువ్వు నాకు ప్రత్యక్షంగా కనిపించకపోయినా నా జీవన నాటకతెర వెనుక నువ్వుంటావు.
అయోమయంగా స్పష్టత లేని కోరికలు, వాటిని తీర్చుకోలేని చేతగానితనం బారి నుంచి నన్ను కాపాడటం కోసమే - నన్ను నిరాకరిస్తూనే నన్ను నీ అక్కున చేర్చుకునేందుకు నిత్య సమాయత్త కార్యక్రమాన్ని నువ్వు చేస్తున్నట్లు నాకు స్పష్టమౌతుంది.

కామెంట్‌లు