బ్రతుకుబాట ..!! > కళ్లుతెరిచిన శవం .కోరాడ నరసింహరావు >విశాఖపట్నం.

 మన ఆశలు, ఆశయాలు నెర వేరక... పూర్వజన్మ కర్మ ఫలాలను వెంటబెట్టుకుని... 
ప్రస్తుత దేహంలోకి ప్రవేశించటమే... ఈ జీవితం !
ఇది వేదాంతo కాదు .... 
వాస్తవం.... !!
నే నెన్నిజన్మల్లో ఎలాంటి పాపాలు చేసానో గానీ... నాబాల్యమంతా నాకు శాపగ్రస్తమే అయిపోయింది !
పుట్టటమే తండ్రిగండంతో పుట్టానట... మా అమ్మ అంటుండేది !!
నాపుట్టుక... కేవలం శారీరక శ్రమతో జీవనం గడిపే ఓ కూలీ కుటుంబంలో... !
నేను పుట్టిన నాటి నుండే నాతో మూడునెలలు...నాకన్నవాళ్ళు  
పడ్డ పాట్లు... మా అమ్మ  
చెప్పింది విన్నప్పుడు... నేనెంత నష్ట జాతకుడనో... నాకు బోధపడింది !
మనం జాతకాలను మూఢ నమ్మకాలని కొట్టి పారేస్తాం గానీ 
ఆ పొరపాటు శాస్త్రానిది కాదు..దాన్ని సరిగ్గా అధ్యయనం చెయ్యని వ్యక్తులది మాత్రమే !
ఆరోజు నాజన్మ నక్షత్రాన్ని పరిశీలించిన ఆ పురోహితుడు చెప్పినది చెప్పినట్టే జరిగిందని మా అమ్మ తన అనుభవాన్ని 
మా అమ్మ సోదాహరణంగా చెప్పినది....... 
నన్ను మా అమ్మ,నాన్నలు మా అమ్మగారి చెల్లి పెళ్లికని నన్నుకూడాపార్వతీపురం నుండి...  విజయనగరం తీసుకు వెళ్లారట !
అప్పటికే ఎంతో డబ్బు ఖర్చుపెట్టి ఎన్నో హాస్పిటల్స్ కి తిప్పారట... ఆపెళ్ళిలో నేనెక్కడ చనిపోతానో ఆపెళ్ళి ఆగిపోతుందో నని అందరూ భయపడ్డారట... !
ఆపెళ్ళిలోనే ఎవరో చెప్పారట 
నాకు జబ్బేదీ లేదని...అది బాలగ్రహల ప్రభావమని...  అక్కడికి దగ్గరలోఉన్న* రేగ *
అనేగ్రామంలో దీనికి మంచి"రక్ష" కడతారని... వెళ్ళమంటే...నిరాసక్తతగానే 
చిన్న ఆశతో వెళ్ళటం అక్కడ 
ఒక స్త్రీమూర్తి... "బేడాపరక"
అంటే... కేవలం పదిహేను పైసలు ! తీసుకుని రక్ష కట్టారట 
ఆదేవుని దయవలన పెళ్లి నిర్విఘ్నం గా జరిగి పోవటం 
నన్ను తీసుకుని మావాళ్లంతా 
మాతాతగారింటికి బొబ్బిలి వెలిపొటానికి విజయనగరం రైల్వే స్టేషన్ కురావటం... !
అక్కడ చలనంలేని నన్నుచూసి  
ప్రాణం పోయిన బిడ్డని ట్రైన్ లో ఎలా తీసుకు వెళ్ళగలం !?
ఇక్కడే ఈకంకర దిబ్బల మీదే 
వదిలేద్దామని అనుకుంటుంటే 
మా బంధువులలో ఓ పెద్దావిడ 
అనాధ శవంలా... ఇక్కడొదిలేయడ మేంటి... 
నక్కలు - కుక్కలు పీక్కు తింటాయ్ ! మనబొబ్బిలిలో ఖననం చేద్దాం... పూర్తిగా కప్పి 
ఒడిలో ఉంచుకుంటే బిడ్డ పడుకున్నాడనుకుంటారు ఇబ్బందేమీ లేదు పట్టుకు పదండి... అనటంతో... 
నన్ను తీసుకుని అక్కడినుండి బయలుదేరారట... !
అంతవరకూ చలనం లేని నేను 
బొబ్బిలి సమీపిస్తుండగా... 
కదిలానట !
అది చూసి... అందరూ... 
వీడు సామాన్యుడు కాడు... 
నక్కలా నోట్లో బెడ్డలు కొట్టాడని 
అందరూ పొంగిపోయారట... !
.......సశేషం !!
----------------------------------------------------------------
పరిచయం :
శ్రీ కోరాడ నరసింహారావు గారు ,విశాఖపట్నం
వాస్తవ్యులు. రంగస్థల కళాకారులు .మంచి రచయిత 
కవి (వచన కవిత్వం,నానీలు,చిత్ర కవితలు,లలిత
గీతాలు,పేరడీలు,వగైరా)
--------------------------------------------------------------------

కామెంట్‌లు