ఒక అడవి లో చిన్న పెద్ద రకాల జంతువులు ప్రశాంతంగా జీవించేవి.స్వేచ్ఛగా కమ్మని పళ్లు పచ్చిగడ్డి కొలనులోని నీటితో కుక్షి నింపుకుంటూ మంచి గాలి పీలుస్తూ ఐకమత్యం తో స్నేహితులు గా ఉండేవి. ఒక రోజు ఒక రాక్షసుడు వచ్చి కొలనుదగ్గరున్న చెట్టు తొర్రలో దాక్కున్నాడు. నీరు తాగటానికి వచ్చే ఒంటరిగా ఉన్న వాటిని గుటకాయస్వాహా చేస్తున్నాడు."ఏంటీ!రోజు రోజు కీ మనసంఖ్య తగ్గిపోతోంది?
మన మిత్రులు అంతా చెప్పా పెట్టకుండా ఎక్కడకి పోతున్నారు?నీరు తాగటానికి వెళ్లినవారు తిరిగివచ్చిన జాడలేదు!"అని ఖంగారు పడసాగాయి. ఒకసారి వేరే ప్రాంతం నుంచి ఒక కోతుల గుంపు ఈఅడవివైపు వస్తూ దాహం వేసి ఆకొలనుదగ్గర ఆగాయి."జాగ్రత్త!మనం తొలి సారి ఈకొలను దగ్గరకు వచ్చాము.ఇక్కడ రకరకాల జంతువుల పాదముద్రలు ఉన్నాయి. ఆప్రాణులు మళ్లీ కొలను బైటికి వచ్చిన జాడలులేవు.అందుకే ఆచితూచి స్పందించాలి.లేకుంటే ప్రాణాలు హరీ అంటాయి."అని హెచ్చరించింది కోతుల రాజు."అబ్బబ్బ!దాహంవేస్తోంది.ఎండచురచుర అంటోంది. మాప్రాణం పోయేలా ఉంది "అని కోతులు గొడవ ప్రారంభించాయి."సరే!ఓఉపాయం చెప్తాను. అక్కడ సన్నగా పొడుగ్గా గొట్టాల లాగా ఉన్న ఆగడ్డి ని తీసుకుని వస్తాను.వాటిని నోటిలో పెట్టుకొని నీటిని పీలుస్తూ తాగండి చెట్టు కొమ్ముపై కూచోండి.కిందకి దిగవద్దు"అని కోతి రాజు ఆపొడవాటిగడ్డి కాడలు కోసుకొచ్చి తలా ఒకటి ఇచ్చాడు.కోతులు ఆపొడవాటిగడ్డి కొసని నోటిలో పెట్టి వేరే కొన కొలనులోముంచి గటగటా తాగసాగాయి.మనం స్ట్రా వేసి తాగినట్లుగా!దూరంగా తొర్రలోనుంచి రాక్షసుడి తల కనపడింది. నెమ్మదిగా వాడు కొలనుదగ్గరకు పాకసాగాడు.కోతిరాజు హెచ్చరిక అరుపుతో కోతిమూక చెట్లపైకిపాకి కొమ్మలపై ఎగిరి దూకుతూ వచ్చిన తోవనే తిరిగివెళ్లాయి.అలా ఉపాయం తో అపాయం తప్పించుకోవచ్చు.
ఉపాయం! అచ్యుతుని రాజ్యశ్రీ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి