శ్రీ శారదా దేవి ముచ్చట్లు;-- యామిజాల జగదీశ్
 భారతీయ ఆధ్యాత్మికతతోపాటు  సంస్కృతికీ, అనుబంధానికీ శ్రీ శారదా దేవి ఓ గొప్ప ఉదాహరణ. ఇతరుల కష్టాలూ కన్నీళ్ళకూ ఆమె హృదయం కరిగి బరువెక్కేది. ఆమె మాటలు ఒక్కరోజూ వృధా కాలేదన్న విషయాన్ని ఆమె జీవిత చరిత్ర చదవడం ద్వారా తెలుసుకోవచ్చు. 
శారదా దేవి భక్తులలో ఒకరు ధ్రువచరిత్ర అనే నాటకం రాశారు. ఆ భక్తుడు దానిని శారదా మాతకు పంపారు. ఒకరు దానిని చదువుతుండగా శారదాదేవితోపాటు మరికొందరూ వినసాగారు. నాటకం మధ్యలో ఓ శోక ఘట్టం వచ్చింది. తండ్రి ఒడిలో ధ్రువుడు కూర్చోవాలనుకుంటాడు. అప్పుడు అక్కడే ఉన్న ఒకరు ధ్రువుడిని అనరాని మాటలతో తిడతారు. ధ్రువుడు ఏడుస్తూ తన తల్లి వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్తాడు. తల్లీకొడుకులిద్దరూ ఏడుస్తారు. ఇది విన్న శారదా మాత కూడా కంట తడిపెట్టారు. దీంతో నాటకం చదివి వినిపిస్తున్నతను ఆగిపోతాడు. కాస్సేపు తర్వాత మళ్ళీ చదవడం మొదలుపెడతాడు. చిన్నవాడైన ధ్రువుడు తపస్సు చేయడానికి అడవికి బయలుదేరుతాడు. అంతట తల్లి అడ్డుపడి "నువ్వు అడవికి వెళ్ళిపోతే నేను అనాథనైపోతానురా" అని ఏడుస్తుంది. ఈ మాట వినడుతోనే శారదామాత మళ్ళీ ఏడుస్తారు. ఆమె హృదయం ఎంతటి సున్నితమైందో ఈ సంఘటన చెప్తుంది. అంతటి జాలి గుండె కలిగిన ఆమె ఎందరో శిష్యులకు ఆధ్యాత్మిక మార్గంలో దారి చూపించారు. శ్రీ శారదా దేవి జన్మదినం డిసెంబర్ 22. ఆమెకు సంబంధించి కొన్ని సంగతులు.....
పశ్చిమ బెంగాల్లోని జయరాంబాటి అనే పల్లెలో (1853) లో జన్మించారు శ్రీ శారదా దేవి. ఆమె తండ్రి ఆలయ పూజారి. ఆమె స్కూలుకి వెళ్ళి చదువుకున్నది లేదు.  చిన్నతనం నుంచీ ఆమె నడకా నడతా ప్రత్యేకంగా ఉండేవి.
ఆవులకు పచ్చగడ్డి కోసి పెట్టి దగ్గరుండి తినిపించేవారు. పంటపొలాలలో పనిచేసేవారికి అన్నం తీసుకువెళ్ళి ఇచ్చేవారు. పత్తి తోటలో తల్లితో కలిసి పత్తి సేకరించేవారు. 
ఓమారు తీవ్ర అనావృష్టి నెలకొంది. తండ్రి నిల్వ చేసి ఉంచిన బియ్యంతో అన్నం వండి పేదలకు దగ్గరుండి వడ్డించి వారి ఆకలి తీర్చారు.
ఇంట్లో వాతావరణం భక్తిమయం కావడంతో,  ప్రకృతితో మమేకమైన జీవితాన్ని, ఆధ్యాత్మికతను నేర్చుకున్నారు. 
ఆధ్యాత్మిక ప్రసంగాలు, పౌరాణిక కథలు విని ఎదిగారు. తర్వాతి కాలంలో కాస్తంత చదవడం, రాయడం నేర్చుకున్నారు.
పూర్వం రోజుల్లోని ఆచార వ్యవహారాల కనుగుణంగా శారదాదేవికి శ్రీరామకృష్ణ పరమహంసతో బాల్య వివాహం చేశారు. ఇద్దరి మధ్య పద్దెనిమిదేళ్ళ వ్యత్యాసముం డేది.
ఆధ్యాత్మిక అన్వేషణలో తాదాత్మ్యం చెందిన పరమహంస గురించి తెలియనివారు, "పాపం ఈ అమాయకురాలు. మానసికస్థితి సరిగ్గాలేని వ్యక్తితో ఆమెకు పెళ్ళి చేస్తున్నా రు. ఆమె జీవితం ఎలా ఉంటుందో" అని బాధపడ్డారు.
అయితే ఆమె ప్రత్యక్షంగా పరమహంసను చూసాక పల్లెవాసులు చెప్పుకుంటున్నదంతా సరికాదని ఓ నిర్ణయానికొచ్చారు.
భర్త భగవంతుడి రూపమని గ్రహించి ఆయనను గురువుగా భావించారు. తానూ సన్న్యాసజీవితం గడపాలనుకుని ఆ దిశలోనే అడుగులు వేశారు. ఆమెను జగన్మాత అయిన అంబికగా భావించి పూజించారు పరమహంస.
ఓ సాధారణ పల్లె యువతిగా భర్తను వెతుక్కుంటూ వచ్చిన ఆమె "శ్రీ శారదా మాత"గా మారారు.
శిష్యులు, భక్తులకు తానే వంట వండి వడ్డించేవారు. 
వారు భోంచేస్తున్నప్పుడు పక్కనే కూర్చుని విసిరేవారు. శిష్యులకు దీక్ష ప్రసాదించేటప్పుడు ఆచార నియమాలకన్నా స్వచ్ఛమైన పవిత్రమైన మనసు భక్తికి ప్రధానమని వివరించేవారు శ్రీ శారదా దేవి.
గొంతు క్యాన్సర్ తో రామకృష్ణ పరమహంస బాధపడుతున్నప్పుడు ఆమె చెంతనే ఉండి కంటికిరెప్పలా చూసుకున్నారు.
పరమహంస పరమపదించిన తర్వాత అయోమయంలో పడిన శిష్యులలో ఆమె ధైర్యం నింపారు.
ఓమారు గయకు వెళ్ళిన ఆమె అక్కడున్న మఠాలలో సాధువులకు ఉన్న వసతులను, రామకృష్ణ పరమహంస శిష్యుల దీనావస్థను పోల్చుకుని ఎంతో బాధపడ్డారు.
"నా బిడ్డలకు మంచి ఆహారం, వస్త్రాలు, ఉండేందుకు చోటు ముఖ్యం. వారి కష్టాలు చూడలేకపోతున్నాను" అని పరమహంసకు మానసికంగా చెప్పుకున్నారు. ఇదే రామకృష్ణ మఠం ఉద్భవించడానికి పునాదైంది.
శ్రీ శారదాదేవి ఆశీస్సులతో గంగానది తీరాన ఉన్న బేలూరులో రామకృష్ణమఠం 1898లో ప్రారంభమైంది. "సంఘ జనని" అని ఈమెను కీర్తించారు స్వామి వివేకానంద.
మానసిక ప్రశాంతత కావాలంటే ఇతరులలో లోపాలెంచకండి. మీలోని తప్పులను చూడండి. ప్రపంచం యావత్తుని మీ సొంతమని భావించండి. మెలగండి. ఎవరూ అపరిచితులు కారు. అందరూ నా బిడ్డలే. ప్రపంచం మీ సొంతం" అని ఉపదేశించారు. 
ప్రేమ, కరుణ, అహింస ప్రాధాన్యతలను ఉపదేశిస్తూ అందరినీ ఆశీర్వదించిన శ్రీ శారదామాత 67 వ ఏట (1920) లో తనువు చాలించారు.








కామెంట్‌లు