తట్టెడుమట్టి! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఒక జమీందారు తండ్రి  తను చనిపోయేముందు  తమ ఇంట్లో తరతరాలుగా  పనిచేసిన వారికి  బంజరుభూమిలో గుడిసెవేసుకుని ఉండేలా అనుమతించాడు. కానీ తండ్రి చనిపోయిన తర్వాత  జమీందారు కళ్ళు నెత్తికెక్కి  జల్సాలకి అలవాటు పడ్డాడు.పైగా వందిమాగధులు బాగా మద్యం అలవాటు చేసి తమ చేతిలో కీలుబొమ్మగా  అతన్ని ఆడించసాగారు."అయ్యా!బంజరుభూమిని మీతండ్రిగారు    అందరికీ  ఉచితంగా  గుడిసెలు వేసుకోవటానికి అనుమతించారు. ఇప్పుడు మీభూమికి ధర బాగా పెరిగింది. అందులో ఉన్న వారినందరినీ వెళ్ళగొట్టి మంచి ధరకు అమ్ముకోండి.లేదా  ఇళ్లు గుడి కట్టిస్తే నెలతిరిగే సరికి అద్దెలు కుప్పలుగా వస్తాయి. హుండీకూడా నిండుతుంది "అని దుర్భోధ చేశారు.  దయ జాలిలేని  ఆజమీందారు ఒక అవ్వగుడిసెను నాశనం చేసి వెళ్ళగొట్టాడు.ఒక రోజు గడిచాక  ఆఅవ్వ చేతిలో చిన్న తట్టతో వచ్చి "అయ్యా!నాగుడిసె ఉన్న ప్రాంతంలోని  మట్టిని తీసుకుని వెళ్లి పొయ్యి గోడలు అలుకుతాను."అని ఆమట్టిని తట్టలో నింపుకుంది. "బాబూ!ఈతట్టని నానెత్తిన పెట్టవూ?"అని అక్కడ ఉన్న వారిని అడిగింది. ఆశ్చర్యం!ఎవరూకూడా దాన్ని లేపలేకపోయారు.జమీందారు కూడా విఫలుడైనాడు."అయ్యా!మానిరుపేదలను  వెళ్ళగొట్టి  ఈమట్టితో మీరు  ఏమి కట్టించినా  అది కుప్పకూలిపోతుంది. ఈప్రాంతం లో అణువణువునా  మాచెమటచుక్కలు ఇంకిపోయిఉన్నాయి బాబూ!మారక్తం ధారపోసి మీకు బండచాకిరీ చేశాము.మాఉసురు తగులుతుంది బాబూ!"అని అవ్వ ఏడుపు మొదలు పెట్టింది. అంతే మొండి జమీందారు బండగుండె కరిగిపోయింది. అందరికీ తిరిగి ఆభూమిని ఇచ్చాడు. కొద్ది రోజుల కే అవ్వ కన్నుమూసింది. కానీ ఆఅవ్వ మాత్రం శాశ్వతంగా అందరిగుండెలో నిలిచిపోయింది.

కామెంట్‌లు