వాలి ముచ్చట్లు;- జగదీశ్ యామిజాల
 తమిళ సినీ కవిగా  ప్రసిద్ధికెక్కిన వాలి అసలు పేరు టి.ఎస్. రంగరాజన్  1931లో జన్మించారు. 2013లో అస్తమించారు. ఆయన రాసిన పాండవర్ భూమి, కృష్ణవిజయం వంటి కవితా సంపుటాలు విశేష ఆదరణ పొందాయి. ఆనందవిగటన్ వారపత్రికలో ఆయన రాసిన జ్ఞాపకాలు చిరస్మరణీయం. సినిమాలలో పదిహేను వేలకుపైగా పాటలు రాసిన వాలి కొన్ని సినిమాలలో నటించారుకూడా. 2007లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో. వాలిని సమ్మానించింది. ఆయన గురించి కొన్ని ముచ్చట్లు..... 
1. పాటలు రాయడానికి కొందరు మూడ్ రావాలంటారు. కానీ వాలికి అలా కాదు. ఏ పరిస్థితిలోనైనా రాయగలరు. పాట రాసేటప్పుడు మాటలు సరిగ్గా పడకుంటే మూడ్ సరిగ్గా లేదని ఆయన సరదాగా అంటుండేవారు.
2. కొత్త సంగీత దర్శకుడైతే నాలుగైదు సినిమాలకు చేయండి. అనంతరం అవి చూశాక మీ సంగీతంలో పాటలు రాస్తానని సున్నితంగా చెప్పి పంపించేసేవారు. జెంటిల్మాన్ సినిమాకోసం రహ్మాన్ తోనూ అలాగే చెప్పారు. అయితే నేను శేఖర్ కొడుకునండి అని రహ్మాన్ చెప్పినప్పుడు ఆశ్చర్యపోయిన వాలి పాటలు రాయడానికి సమ్మతించారు. ఆ పాటే జెంటిల్మన్ సినిమాలోని "చికు బుకు రైలే....పాట!!
3. యువ కవుల పాటలలో పంక్తులు బాగుంటే వారిని ప్రశసించడానికి ఏమాత్రం ఆలోచించేవారు కాదు. "నా ముత్తుకుమార్" రాసిన ఓ పాట విని ఎంజిఆర్ గానీ ఉండి ఉంటే ఈ పల్లవికే నీకొక ఇల్లు కానుకగా ఇచ్చేవారని మెచ్చుకున్నారు.
4. వాలి రాసిన కొన్ని పాటలకు తీవ్ర అభ్యంతరాలొచ్చాయి. ముఖ్యంగా సకలకళా వల్లవన్ సినిమాలో వచ్చే నేత్తు రాత్తిరా యమ్మా....ఇలా మరికొన్ని పాటలకు ఘాటైన విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది ఆయన.
5. వాలీ, హాస్యనటుడు నాగేష్ రారా పోరాఅని అనుకునేంత  సన్నిహిత మిత్రులు అవకాశాలకోసం వెతుకుతున్న కాలంలో ఈ ఇద్దరూ టి. నగర్ కాఫీ హౌసులో ఒకే గదిలో ఉండేవారు. వాలికి కాగితాలు కొనిచ్చి ఏదో ఒకటి రాయమని ప్రోత్సహిస్తుండేవారు నాగేష్. 
6. ఇళయరాజా సంగీతదర్శకత్వంలో వాలి రాసిన తొలి పాట భద్రకాళి అనే సినిమా కోసమే.
7. తిరుచ్చి ఆలిండియా రేడియో కేంద్రంలో పని చేస్తున్న రోజుల్లో వాలి రాసిన నాటకాలలో హాస్యనటి మనోరమ నటిస్తుండేవారు.
8. వాలి తండ్రి శ్రీనివాస అయ్యంగార్. తల్లి పొన్నమ్మాళ్. వాలికి ఓ అన్నయ్య, ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. 
9. శ్రమించడం పట్ల నమ్మకమున్నవారు వాలి.  నిరంతర కృషి, కఠోర శ్రమతోనే తానీ స్థాయికి ఎదిగానని చెప్పుకునేవారు వాలి. మీరెంత శ్రమ పడితే అదంత ఉన్నతస్థాయికి తీసుకుపోతుందని ఆయన గట్టి మాట.
10. బాల్యంలోనే రాయడం పట్ల ఆసక్తి పెంచుకున్న వాలి కవితలల్లడం, బామ్మలు గీయడం అలవరచుకున్నారు. శ్రీరంగంలో ఉన్నప్పుడే నేతాజీ అనే పత్రికను నడిపారు. దాని తొలి ప్రతిని ఆవిష్కరించిన వారు ప్రముఖ రచయిత కల్కి.
11. బాయిస్ అనే సినిమాకు అర్థం పర్థం లేకుండా ఓ పాట రాయవలసిందిగా దర్శకుడు శంకర్ కోరినప్పుడు అర్థరహిత పాటలు రాయనని చెప్పారు వాలి. అప్పుడు తనకు తోచినట్టు వాలి ఓ పాట రాయగా ఆ ఒక్క పాటకు మాత్రం ఓ లక్ష రూపాయలు పాందినట్టు వినికిడి.
12. వాలి అసలు పేరు రంగరాజన్. ఆయనను ఆయన తల్లి రంగప్పా అని పిలిచేవారు.
13. కణ్ణదాసన్ అంటే ఎంతో గౌరవం. రాయడం చదవడం తెలియని వారిలో యముడుకూడా ఒకడు. కణ్ణదాసన్ మరణించినప్పుడు వాలి "అందమైన కవితల పుస్తకాన్ని  చించేశాడు యముడు" అని తమ సంతాపాన్ని ప్రకటించారు.
14.  చెన్నైకి పాటలు రాయడానికి వచ్చిన తొలి రోజుల్లో వాలి తిరువల్లిక్కేణిలోని సుందరమూర్తి వినాయకర్ వీధిలో మిత్రులతో కలిసి నివసించారు. అప్పట్లో అద్దె అయిదు రూపాయలు.
15. ఎవరైనా సాయం చేస్తే మరచిపోకుండా జీవితాంతం గుర్తుంచుకునేవారు. సంగీత దర్శకుడు ఎం.ఎస్. విశ్వనాథన్ ని కలిసిన తర్వాతే తనకీ గొప్ప జీవితం లభించిందని అన్ని వేదికలపైనా చెప్పుకున్నారు వాలి. ఎం.ఎస్. విశ్వనాథన్ ని కలవకముందు అన్నానికి చాలా ఇబ్బందిపడేవాడిని. కానీ ఆయనను కలిసాక అన్నం తినడానికి టైముండేది కాదనేవారు వాలి.
16. తోటి కవులను ఉన్నట్టుండి ప్రశంసిస్తూ అప్పటికప్పుడు వారిపై ఓ కవిత అల్లేవారు. 
17. కణ్ణదాసన్ తో చిన్నపాటి మనస్తాపం కలిగినప్పుడే వాలితో పాట రాయించారు ఎంజిఆర్. అప్పుడు రాసిన పాటే..."ఇచ్చిందల్లా ఇచ్చాడు...." అనే అర్థంతో సాగే పాట. ఆ పాట విన్నాక ఎంజిఆర్ ఆరోజు రాత్రి జరిగిన ఓ సభలో తన సినిమాలకు ఇక వాలి పాటలు రాస్తారని ప్రకటించారు.
18. ఎవిఎంవారి కోసం వాలి రాసిన తొలి పాట....ఆమెకేమిటీ....అందమైన మోము!
అనే అర్థంతో సాగే ఈ పాట సర్వర్ సుందరం సినిమా కోసం రాసారు. 
19. వాలి కెమేరామాన్ మారుతీరావుతో కలిసి వడమాలై అనే సినిమాకు దర్శకత్వం వహించారు.
20. వాలికి సెంటిమెంట్ల పట్ల నమ్మకమున్నవారు.
21. కరుణానిధి గారి ఎంగల్ తంగం సినిమాలో వాలి ఓ పాట రాసారు. నాన్ ఆళవోడు రసిప్పవన్ అనే పల్లవితో సాగే పాటది. ఈ పాట రెండో పంక్తికోసం వాలి ఆలోచిస్తుండగా ఏదైనా అంతు లేకుండా ఇచ్చేవాడనే అర్థంలో కరుణానిధి చెప్పి రాయించారు.
22. వాలి భార్య పేరు రమణతిలకం. తన లవ్ లెటర్ నాటకంలో కథానాయికగా నటించడానికి వచ్చిన ఆమెను ఎవరికీ చెప్పకుండా పెళ్ళి చేసుకున్నారు వాలి.
23. ఆయన పార్తాలే పరవశం, హేరాం తదితర చిత్రాలలో నటించారు.
24. ఎంజిఆర్ తనకత్యంత సన్నిహితులనూ ఆత్మీయులనూ ఆండవనే అని పిలవడం అలవాటు. వాలినికూడా ఆయన అట్టాగే సంబోధించేవారు.
25. ఆయనకు కోపం అధికమే. కమలహాసన్ మాట్లాడుతూ కోపం అనగానే తనకు గుర్తుకొచ్చేది వాలియే అని అన్నారు. రజనీకాంత్ కూడా ఇలానే చెప్పారు.
(ఇంకా ఉన్నాయి)

కామెంట్‌లు