స్వామి వివేకానంద ముచ్చట్లు;-- యామిజాల జగదీశ్
 స్వామి వివేకానంద (12 జనవరి 1863 - 4 జూలై 1902) ఆధ్యాత్మికవేత్త రామకృష్ణ పరమహంస శిష్యులలో ముఖ్యలు. పాశ్చాత్య ప్రపంచానికి యోగా, హిందూ మత ఔన్నత్యాన్ని చాటిచెప్పడంతోపాటు మతాంతర అవగాహనను పెంపొందించిన ఘనత స్వామీజీది. రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్‌ స్థాపకులు. 
చికాగోలో 1893లో సోదర సోదరీమణులారా అంటూ ఆయన విశ్వమత సదస్సులో మొదలుపెట్టిన ప్రసంగం అన్ని వర్గాలవారిని  కట్టిపడేసింది. స్వామీజీ జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా పాటిస్తారు. 
ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు. నరేంద్రనాథ్. నరేన్ అని ఎక్కువ మంది పిలిచేవారు. ఆ కాలంలో మద్రాసువాసులకు ఆయన పహిల్వాన్ సామి.
చిన్నతనంలో జట్కావాలాగా ఉండాలనుకున్నారు.
తండ్రి విశ్వనాద దత్తేమో తన బిడ్డను న్యాయవాదిగా చూడాలనుకున్నారు. 
తమ కుమార్తెను పెళ్ళి చేసుకుంటే ఐసిఎస్ చేయిస్తానని ఓ అమ్మాయి తండ్రి చెప్పారు.
నాతో ఉండిపో అని రామకృష్ణ పరమహంస ఆహ్వానించారు.
చివరికి గురుదేవులు వారి ఆశే ఫలించింది.
"పుస్తకాలలో ఉంది..... ఇతరులు చెప్పారు అని ఏ తత్వాన్నీ స్వీకరించకండి. మీకు మీరే పరీక్షించుకోవాలి. పరిశోధించాలి. అప్పుడే దేన్నయినా స్వీకరించండి" అన్నదే స్వామీజీ మాట.
వివేకానందులవారికి జ్ఞానమాతగ అమ్మ భువనేశ్వరి. "నాకేదైనా జ్ఞానమంటూ ఉందంటే అందుకు మా అమ్మకే నేను రుణపడి ఉంటాను" అని చెప్పారు వివేకానందులవారు.
మల్లయుద్ధం, ఈత, కర్రసాము, పడవ నడపడం వంటివాటిలో యుక్త వయస్సులోనే తర్ఫీదు పొందారు. 
దేహం ధృడంగా ఉంటేనే హృదయం బలంగా ఉంటుందన్నది ఆయన అభిప్రాయం.
"భగవంతుడుని చూసేరా?" అని ఎవరిని చూసినా ఆయన అడిగిన ఏకైక ప్రశ్న. 
"చూశాను.....నీకూ చూపిస్తాను" అని ఆయనకు చెప్పినవారు రామకృష్ణ పరమహంస మాత్రమే.
 
బుద్ధుడికి జ్ఞానోదయమైన బోధి వృక్షం కింద ధ్యానం చేయాలని ఆశించి తన మిత్రులతో కలిసి వెళ్ళారు. బుద్ధగయాలో ధ్యానం చేసి తిరిగొచ్చారు.
వివేకానందులవారు అనేక పాటలు, కవితలు రాశారు. అలాగే అనుకున్నదే తడవుగా పొల్లుపోకుండా చెప్పగలిగే శక్తీ ఆయనకుండేది.
వివేకానంద, సచ్చిదానంద అనే రెండు పేర్లతోనే భారతీయ నగరాలకు పరిచయమయ్యారు.
అమెరికా ప్రయాణానికి ఏర్పాట్లు జరిగినప్పుడే ఖేత్రి రాజు "వివేకానంద" అనే పేరు పెట్టారు.
రామకృష్ణపరమహంస పరమపదం పొందిన తర్వాత దక్షిణేశ్వరానికి, కలకత్తాకు మధ్య ఓ ప్రదేశంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉండేవారు.
కొన్ని రోజులకే ఆ ఇంటిని ఖాళీ చేసేసారు. శాశ్వతంగా ఉండిపోతే ఆ ప్రదేశంమీద ఇష్టం ఏర్పడిపోతుంది. మూడు రోజులకు మించి ఓచోట ఉండకూడదు" అని అనుకున్నారు.
కొంచెం బియ్యం, కాస్త ఆక్కూర, చిటికెడు ఉప్పు - ఇదే ఆయన ఆహారం. అదీ మితంగానే. 
ఒకవేళ రాజుల ఆస్థానంలో ఉండవలసి వచ్చినా ఆహార విషయంలో అతి మితంగానే ఉండేవారు.
అయిదేళ్ళ కాలంలో భారతదేశమంతటా పర్యటించారు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా బయలుదేరారు. ఎవరు డబ్బులిచ్చినా తీసుకునేవారు కాదు.
మైసూరు మహారాజా మొత్తం ఖర్చు తానే  భరిస్తానని చెప్పినప్పుడు "త్రిచూరుకి టిక్కెట్ కొనిస్తే చాలన్నారు.
తాజ్ మహల్ ఆయనను ఆకట్టుకున్న ప్రదేశం. దాని గురించి  పరిపూర్ణంగా తెలుసుకుని ఆస్వాదించడానికి ఆరు నెలలు కావాలన్నారు.
పెద్ద పెద్ద లౌకిక కోరికలన్నింటినీ త్యజించిన తర్వాత చిన్న చిన్న విషయాలున్నా లేకున్నా ఒక్కటే అన్నారు
పుస్తకాలను ఆయనంత వేగంగా ఎవరూ చదవలేరు. ఒక్కొక్క పంక్తిగా నేను చదవను....వాక్యాలకు వాక్యాలుగా, పేరాలకు పేరాలుగా చదువుతాను అని చెప్పేవారు.
అమెరికా వెళ్ళే ముందర కన్యాకుమారి వచ్చి అక్కడి తీరాన నిల్చుని చూసినప్పుడు కనిపించిన రాతి వరకూ ఈది చేరుకుని అక్కడ ధ్యానం చేశారు. అదే వివేకానంద రాక్ గా ప్రసిద్ధి చెందింది.
అమెరికా నుంచి తిరిగొచ్చినప్పుడు చెన్నైలో బస చేసి సముద్రతీర రహదారిన ఉన్న నివాసమే వివేకానంద హౌస్. 
తమిళనాడుకి మూడు సార్లు వెళ్ళారు వివేకాందులవారు. మొదటిసారి వచ్చినప్పుడు మూడు నెలలు, రెండవ సారి ఇరవై రోజులు నివసించారు. మూడవసారి వచ్చినప్పుడు ఆయనను నౌక నుంచి దిగనివ్వలేదు. కలకత్తాలో ప్లేగ్ వ్యాధి వ్యాపించిన కాలమది. దాంతో ఈయనను నౌక నుంచి కిందకు దిగనివ్వలేదు.
"మీరు చాలా బహిరంగంగా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడితే ఎవరైనా విషం ఇచ్చి హతమారుస్తారు" అని మైసూరు మహారాజు చెప్పినప్పుడు "మీరు తప్పుగా అనుకుంటారని అసత్యపు మాటలను నేనెలా మాట్లాడతాను. అది నావల్ల జరగని పని" అని బదులిచ్చారు వివేకానందులవారు.
బ్రిటీష్ వారు భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళాక చైనా వల్ల మన దేశానికి పెనుప్రమాదం జరుగుతుంది అని వందేళ్ళ క్రితమే చెప్పారాయన. ఆయనదెంత దూరదృష్టో చూడండి.
బానిసలా చూసిన ఆంగ్లేయుల ప్రభుత్వ వైఖరిని కఠినంగా వ్యతిరేకించారు. బ్రిటీష్ ప్రభుత్వం నన్ను ఖైదు చేసి కాల్చి చంపనీ" అని బహిరంగంగా వెల్లడించారు.
వివేకానందులవారికీ, చెన్నైకీ దగ్గర సంబంధాలున్నాయి. చెన్నై యువకుల నుంచి ఎక్కువ ఆశిస్తున్నాను. ఆధ్యాత్మిక ఆలలు చెన్నై నుంచే పుట్టుకురావాలి అనే మాటలతో ఆయనకు చెన్నైమీదున్న పాశాన్ని అర్థం చేసుకోవచ్చు.
కాలిఫోర్నియాలో ఈయన నడుచుకుంటూ పోతున్నప్పుడు ఓచోట తుపాకీ శిక్షణ జరుగుతోంది. తర్ఫీదు పొందుతున్న ఒకతని గురి తప్పింది. అది చూసిన ఈయన ఆ తుపాకీ తీసుకుని ఆరు గుడ్లను గురి పెట్టి లక్ష్యం తప్పక కాల్చారు. అనంతరం ఆయన "తుపాకీని ఈరోజే మొదటిసారిగా పట్టుకున్నాను. ఇందుకు శిక్షణ అవసరం లేదు. మానసికంగా ఏకాగ్రత అవసరం" అని చెప్పి ముందుకు అడుగులు వేశారు.
"ఒక విధవరాలి కన్నీటిని తుడవలేని, ఒక అనాధ ఆకలి తీర్చలేని భగవంతుని దగ్గరో, మతంమీదో నాకు కొంచెంకూడా నమ్మకం లేదు" అని చెప్పిన ఈయన మాటలు సంఘసంస్కరణకు నడుంబిగించిన వారినీ ఈయనకేసి చూడనిచ్చాయి.
వివేకానందులవారి సారాంశం ఇదే...
"మొదటగా మీరు చేయవలసిందల్లా మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఆ తర్వాత భగవంతుడిని నమ్మండి.అనుభూతికి హృదయమూ, ఆలోచనకు ధృడమైన శరీరమూ మనకుండాలి. హృదయానికీ, జ్ఞానానికీ పోరాటం జరిగితే హృదయాన్ని అనుసరించి నడవండి" 

కామెంట్‌లు