తలపుల వర్ణం;-కాకరపర్తి పద్మజకలం స్నేహం
తలపుల వర్ణం పూసిన వసంత ఛాయలు
నునులేత యవ్వన ప్రాయాన్ని సిగ్గుల పూతతో అలరించగ

కాల విభజనలో  పరువాల పల్లకినెక్కిన వయసుకు
తాకిన సొగసుల విరి జల్లులతో ఆరంభయ్యే ప్రేమ పరిమళాలు

రెప్పల కౌగిలిలో నలిగిన నయనపు కలలు
ఆశల మందహాసాన్ని…చిరు చిరు నగవులుగ
అధరాల సింహాసనంపై రాజ మర్యాదలందుకుంటూ

ఏకాంత వేళ కొంటె మందారాలై క్షణాల బుగ్గలు గిల్లగ
విరహపు విరజాజుల చూపుల సెగకు…
అగ్గి బరాటాగా …నా మనసుకు శివతాండవమే..

కలవరింతల గమకాలు….పలవరింతల సరిగమలతో 
సరి కొత్త రాగం ఆలపించే ప్రణయపు భావ వీచికలు
నీ నా అనురాగపు ఊపిరికి తాళమేస్తుంటే

అదృశ్యమైన నీ రూపం …తాకిన అనుభూతుల
ఒరవడిలో నేను సేదతీరుతానే ఉన్నాను
నవోదయపు వెన్నెల సిరులు కాసిన
ఆనందాల పరిచయాలతో…
మన ఉనికిని భద్రపరుస్తూనే ఉన్నాను…!!

కామెంట్‌లు