వాలి ముచ్చట్లు....;-- యామిజాల జగదీశ్
 (తరువాయి భాగం)
--------------------------
సినీ కవి వాలి గురించి మరికొన్ని ముచ్చట్లు...
26. పాటలు రాసే అవకాశం వాలికి అంత సులువుగా దక్కలేదు. కె. వి. మహదేవన్ వద్దకు పాట రాసే అవకాశం కోసం వెళ్ళగా ఆయన తిట్టి పంపించారు. ఎం.ఎస్. విశ్వనాథన్ అయితే వాలికి పాటలు రాయడం రాదు...రేడియోలో పని చేసుకోమని చెప్పండి అంటూ ఆయన మిత్రుడితో చెప్పి పంపారు ఎంఎస్వీ!
27. ఎంజిఆర్ తో వాలికి ఇరవై అయిదేళ్ళ అనుబంధముంది. ఎంజిఆర్ ని అన్నా అనే పిలిచేవారు వాలి.
28. ఆయనకు ఒకింత రోషమెక్కువే. భారతవిలాస్ సినిమాలో వాలి రాసిన "ఇందియా ఎన్బదు ఎన్ వీడు..." అనే పాటకు జాతీయ స్థాయిలో అవార్డు ఇవ్వబోతున్నట్టు భారత ప్రభుత్వ ప్రతినిధి ఆయనను బయోడేటా పంపమని అడిగారు. అయితే వాలి ఇవ్వలేదు. ఆ పాటకు జాతీయ పురస్కారం ఇచ్చే అర్హత ఉందనుకున్నప్పుడు ఎవరు రాసారనేది చూడకుండా అవార్డు ఇవ్వాలి. అలాకాకుండా నన్నే నా వివరాలు పంపమంటారా...అలా అడిగి తెలుసుకునే పక్షంలో తనకెలాంటి అవార్డూ అక్కర్లేదన్నారు.
29. వాలినీ‌, మాటనూ వేరు చేసి చూడలేం. అలాగే ఆయనకున్న మరొక అలవాటు తాంబూలం వేసుకోవడం. యాభై ఏళ్ళకుపైగానే ఆయన తాంబూలం వేసుకున్నారు. మాటలు కుదరకుంటే కవి తాంబూలం వేసుకునేవారని ఆయన సన్నిహితులు అంటుండేవారు. తాంబూలం వేసుకుంటే ఆయనలో చురుకుతనం కనిపించేది.
30. పాటలలో సంబంధించిన వారి ప్రస్తావన తీసుకురావడంలో ఆయనకాయనే సాటి. ఇళయరాజా తల్లిపేరు చిన్నత్తాయి. దళపతి సినిమాలో కథాపరంగా శ్రీవిద్య చిన్న వయస్సులోనే రజనీని కంటారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన "చిన్నత్తాయ్ అవళ్ అంటూ ఓ పాట రాశారు.
31. వాలి నాటకాలవైపు దృష్టి మళ్ళించడానికి కారకులు కరుణానిధి. మరుదనాట్టు ఇళవరసి సినిమాలో కరుణానిధి రాసిన సంభాషణలు విని తానూ ఆ స్థాయిలో నాటకాలు రాయలనుకున్నారు వాలి. 
32. కొత్త కొత్త పదప్రయోగాలతో పాటలల్లడంలో ఆయన దిట్ట. మారుగో మారుగో .....ముక్కాలా ముకాబులా ....డాలాక్కు డోల్ డబ్బిమా వంటివి కొన్ని ఉదాహరణలు.
33. ఎంజిఆర్ తో సన్నిహిత సంబంధాలున్నప్పటికీ అటు ఎంజీఆర్ సినిమాలోనైనాసరే ఇటు శివాజీ సినిమాలోనైనాసరే ఎం.ఆర్. రాధా ఉండాల్సిందే అని వాలి చెప్పినప్పుడు ఎంజిఆర్ అభిమానులు వాలిపై ఘాటు విమర్శలు చేశారు.
34. ఓ సంగీతదర్శకుడు వద్దని తిప్పి పంపిన పాటలను మరొక సంగీత దర్శకత్వంలో వాటిని వినియోగించగా అవి సూపర్ హిట్టయిన సందర్భాలు వాలి సాహితీయాత్రలో నమోదయ్యాయి.
35. వాలి మొత్తం 17 సినిమాలకు మాటలు రాశారు. వాటిలో ఒకటి భాగ్యరాజ్ సినిమా అయిన "సాట్టయ్ ఇల్లాద బంబరం" (తాడు లేని బొంగరం) ఒకటి.
36. నాన్ ఆనయిట్టాల్ పాటను వాలి "నాన్ అరసన్ ఎండ్రాల్ ఎన్ ఆట్చి ఎండ్రాల్ అనే తొలుత రాశారు. ( "నేను రాజు అంటే నా పాలన అంటే....అనే ధోరణిలో రాశారు) అయితే ఈ మాటలు మరీ అతిగా ఉన్నాయని ఎంజిఆర్ అనడంతోనే వాలి "నాన్ ఆనయిట్టాల్ " అని మార్చి రాశారు. అంటే అర్థం....నేనాజ్ఞిపిస్తే.....అని భావం. ఎంగల్ వీట్టు పిళ్ళై అనే సినిమా కోసం రాసిన పాట ఇది. ఇదే తెలుగులో రాముడు భీముడు పేరుతో వచ్చిన సినిమా.
37. పాటలు రాయడానికి కణ్ణదాసన్ మొదలుకుని పలువురికి  అసిస్టెంటులు ఉండేవారు. కవి చెప్తుంటే వాళ్ళు రాసేవారు. లేదా ఒక్కొక్కప్పుడు కొన్ని మాటలు సూచించేవారు. కానీ వాలికి చివరిరోజువరకూ కూడా అసిస్టెంట్లంటూ ఎవరూ లేరు. ఆయనే రాసుకునేవారు. అలాగే కంప్యూటర్ కూడా ఉపయోగించేవారు కాదు.
38. వందల సినిమాలకు మాటలు రాసిన ఆరూర్ దాస్ అనే రచయిత వాలిని తెండ్రలే (అంటే గాలి అని అర్థం) అని సంబోధించేవారు. నేను పాందిన పురస్కారాలన్నింటిలో ఈ సంబోధన ఎనలేనిదని వాలి అంటుండేవారు.
39. ఎదిర్ నీచ్చల్ (ఎదురీత) అనే సినిమాను అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు చూసిన అణ్ణాదురై అందులో "వెంట్రి వేండుమా పోట్టుపారడా ఎదిర్ నీచ్చల్" అనే పల్లవి విని ఈ పాట రాసిందెవరో దర్శకుడు కె. బాలచందర్ ని అడిగి తెలుసుకుని ఈ పాట చాలా అద్భుతంగా ఉందని చెప్పమని వాలిని ప్రశంసించారు. 
40. వాలికి ఇష్టమైన రచయితలలో జయకాంతన్ ఒకరు.
41. శివాజీగణేశన్ వాలిని వాద్దియార్ (అంటే మాష్టారు అని అర్థం) అని పిలిచేవారు. అప్పట్లో నాటకాలకు మాటలు రాసేవారిని మాష్టారు అని పిలిచేవారు.
42. ఆధ్యాత్మికవేత్త అయిన వాలి నిరాడంబరుడే. ఆయన పెళ్ళికి ఆహ్వానపత్రికో ఫోటోలో వంటివేవీ లేవు. ఆయన కవిగా ఉచ్చస్థితిలో ఉన్న రోజులవి. 
43. ఎ.వి. మెయ్యప్ప చెట్టియార్ మాటగా మోడ్రన్ థియేటర్స్ కు చెందిన టి.ఆర్. సుందరానికి ఓ పాట రాశారు. అయితే అప్పుడు మరీ తక్కువ డబ్బులు ఇవ్వడంతో అది చాలదని మరింత ఇవ్వాలని అడిగి తీసుకున్నారు వాలి.
44. పాటలు రాసే అవకాశం రాకపోవడంతో ఇక మద్రాసులో ఉండటం అనవసరమనుకుని మదురైకి వెళ్ళి అక్కడ టివిఎస్ సంస్థలో ఏదైనా ఉద్యోగం చేసుకుంటే మేలనుకుని బయలుదేరుతున్న వేళ వాలిని  గాయకుడు పి. బి. శ్రీనివాస్ కలిసారు. అప్పుడు వాలి ఈరోజు ఏం పాట పాడారని శ్రీనివాస్ ని అడిగారు. పి.బి. శ్రీనివాస్ కణ్ణదాసన్ రాసిన పాటను పాడానంటూ "ఆ పాట వివరాలు చెప్పారు. మయక్కమా కలక్కమా....వాయ్ విలే కుయప్పమా అనే ఆ పాటను శ్రీనివాస్ పాడి వినిపించారు. ఆ పాట విన్న మరుక్షణమే వాలిలో కొత్త ఉత్సాహం వచ్చింది. ఆశలు చిగురించాయి. ఆత్మవిశ్వాసాన్ని నింపింది. మదురైకి వెళ్ళాలనే ఆలోచనకు స్వస్తి చెప్పారు. అవకాశాలను వెతుక్కున్నారు. నిలదొక్కుకున్నారు వాలి. 
45. వాలి పాటలు రాయడంకోసం మద్రాసుకు రావడానికి కారణమైన పాట...పాశవలై అనే సినిమాలో పట్టుకోట్టయ్ కళ్యాణసుందరం రాసిన పాటే. ఆ పాట విని తానుకూడా పాటలు రాయాలనుకుని మద్రాస్ వచ్చారు వాలి.
46. వాలి మొదట్లో బొమ్మలు గీసేవారు. చిత్రకళ అంటే ఆయనకిష్టం. కానీ ఆయన తండ్రికి అది ఇష్టముండేది కాదు. ఓమారు వారి ఇంటికి తంగమ్మాళ్ అనే ఆమె వచ్చారు. ఆమె వాలి గీసిన ఓ చిత్రాన్ని చూసి ఇందులో మా తండ్రిగారిని ప్రత్యక్షంగా చూస్తున్నట్లుందని కంటతడిపెట్టారు. ఆ చిత్రం మరెవరిదో కాదు. వాలి గీసిన ఆ చిత్రం మహాకవి భారతియార్ ది.  తంగమ్మాళ్ భారతియార్ కుమార్తె. ఈ సంఘటన తర్వాత వాలిని ఆయన తండ్రి చెన్నై స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో చేర్పించి చదివించడం విశేషం.
47. పాటను పలుసార్లు మార్చి రాసివ్వమని ఎవరైనా అడిగితే ఆయనకు కోపమొచ్చేది. కమలహాసన్ ఓమారు ఓ పాటకు సంబంధించి రాయిస్తూ మరింత ఫీల్ కనిపించాలంటూ నాలుగుసార్లు మార్పులు చేయించుకున్నఫ్పుడు "నేనింత కన్నా ఫీలవలేను" అంటూ రైటింగ్ ప్యాడ్ ని విసిరేశారు. అనంతరం ఆయన నాలుగోసారి రాసిందే అపూర్వ సగోదరర్గళ్ సినిమాలో వాడుకున్నారు.  (ఉన్నై నినైచ్చేన్ పాట్టు పడిచ్చేన్ తంగమే జ్ఞాన తంగమే...అనే పాట). 
48. వాలి ఎన్నడూ విదేశాలకు వెళ్ళలేదు. అందువల్ల ఆయనను పాస్ పోర్ట్ లేని కవి అనేవారు. "నేను విదేశాలకు వెళ్ళలేదు కానీ నాలోకి పలు విదేశాలు పోయాయి" అంటూ తాను తాగిన రకరకాల బ్రాండెడ్ మధుపానీయాల పేర్లను సరదాగా చెప్పేవారు.
49. సుబ్రమణ్యస్వామి భక్తుడు వాలి. అలాగే అమ్మవారన్నా భక్తి అధికమే. అవకాశమొచ్చినప్పుడల్లా సుబ్రహ్మణ్యస్వామిపై పాటలు రాసేసేవారు. 
50. భార్య రమణతిలకం మరణం వాలిని తీవ్రాతి తీవ్రంగా కలచివేసింది. చాలా బాధపడ్డారు. ఈ బాధ నుంచి కోలుకోవడానికి ఆయనకు చాలా కాలమే పట్టింది. ఆమె గురించి రాస్తూ "నన్ను బయట మోసిన గర్భకోశానివి" అని చెప్పుకున్నారు.
51. ఆయన 1964 నుంచీ ఆదాయపన్ను కడుతూ వచ్చారు.
52. సంగీత దర్శకుడు ఎం.ఎస్. విశ్వనాథన్ ఓమారు వాలికి సవాల్ విసిరారు. నన్ను కట్టిపడేసేలా పల్లవి రాస్తే నేను వేసుకున్న బంగారు గొలుసు, రోలక్స్ వాచీ నీకే అంటూ వాటిని తీసి హార్మోనియం మీద పెట్టారు. వెంటనే వాలి పల్లవి చెప్పారు. ఆ పల్లవి ...."కాట్రు వాంగ పోనేన్....ఒరు కవిదై వాంగి వందేన్..." (అంటే గాలి కోసం వెళ్ళాను....ఓ కవిత తీసుకొచ్చాను అనే అర్థంలో సాగే పాట. సినిమా పేరు కళంగరైవిలక్కం). ఈ పల్లవి తెగ నచ్చేయడంతోనే అన్న మాట ప్రకారం విశ్వనాథన్ తన బంగారు గొలుసు, వాచీ వాలికి కానుకగా ఇచ్చేసారు.
53. వాలి దగ్గర అసిస్టెంటుగా చేరడానికి ముగ్గురొచ్చారు. ఒకరేమో ఓ గ్రామస్తుడు. మరొకరు ఓ మెడికల్ షాప్ నడుపుతున్న వ్యక్తి. ఇంకొకరు నాటకాలు రాస్తున్న మనిషి. 
అఫ్ కోర్స్ ఆయన ఎవరినీ అసిస్టెంట్లుగా పెట్టుకోలేదు. ఇంతకూ ఈ ముగ్గురూ ఎవరంటే తర్వాతికాలంలో ప్రముఖులైన గంగై అమరన్, రామ నారాయణన్, ఆర్. సి. శక్తి. ముగ్గురూ సినిమా లోకంలో తమకంటూ ప్రత్యేక స్థానాలు సంపాదించిన వారే.
54. అందరినీ పొగుడుతారనే విమర్శ ఆయన మీదుండేది. అయితే ఆయన అంటుండేవారు "పొగడటం తప్పేమీ కాదు. తక్కువ చేసి మాట్లాడటమే తప్పు" అని. 
55. ప్రముఖ చిత్రకారుడు వాలి (తమిళం)లా తానూ గొప్ప చిత్రకారుడు కావాలనుకునే రంగరాజన్ అనే పేరుని వాలిగా మార్చుకున్నారాయన. 
56. ఎవరైనాసరే మీ పాట బాగులేదు అని అంటే వాలికి కోపమొచ్చేది. ఓమారు ఎంజిఆర్ ఫలానా పాట బాగులేదని చెప్పగా "బాగులేదనకండి. మీకది అర్థం కాలేదనండి" అని కోపగించుకున్నారు వాలి.
57. వాలి రాసి పత్రికలో అచ్చయిన మొదటి కథ - బ్రాందీ. ఇది కళైమగల్ అనే పత్రికలో కి. వా. జగన్నాథన్ సంపాదకత్వంలో అచ్చయింది.
58. వాలికి బైపాస్ సర్జరీ చేయాల్సి వచ్చినప్పుడు అందుకైన మొత్తం ఖర్చునీ భరించింది కరుణానిధి. అంతేకాదు, వాలి నా మనిషి... జాగర్తగా చూసుకోవాలని డాక్టర్లకు సూచించారు. అందుకే వాలి "నాకు పునర్జన్మ ఇచ్చింది కరుణానిధి" అని అంటుండేవారు. 
59. 1958లో అణ్ణాదురై కథ, మాటలు రాసిన సినిమా నల్లవన్ వాయ్ వాన్. ఈ సినిమాకు దర్శకుడు పా. నీలకంఠన్. ఎంజిఆర్ కథానాయకుడు. ఈ సినిమాకు పాటలు రాసినప్పుడు ఆయనకు ఇచ్చిన వేతనం 250  రూపాయలు.
60. పాటలు రాసే అవకాశాలకోసం తిరుగుతున్న రోజులలో వాలిని తన అసిస్టెంటుగా ఉంటే నెలకు మూడు వందలు ఇస్తానని కణ్ణదాసన్ అన్నారు. అయితే వాలి "మీ సమకాలికుడిగా పాటలు రాయడానికి వచ్చినవాడిని" అంటూ కణ్ణదాసన్ వద్ద అసిస్టెంటుగా చేరేందుకు నిరాకరించారు.


కామెంట్‌లు