టిఎమ్మెస్ విశేషాలు - యామిజాల జగదీశ్
 62. టిఎమ్మెస్ ని ఎంజిఆర్ "సౌందర్" అనీ, శివాజీ  "వాంగ టీఎమ్మెస్" అనీ పిలిచేవారు. టిఎమ్మెస్ లేనప్పుడు "ఏంటీ భాగవతార్ పాట పాడి వెళ్ళిపోయేరా?" అని శివాజీ అనేవారు. ఆయనను త్యాగరాజ భాగవతార్ తో సమానంగా చెప్పడం కోసం అలా సంబోధించే వారు శివాజీ. అంతేతప్ప ఆటపట్టించడానికి కాదు. రజనీకాంత్ "సార్" అని మర్యాదపూర్వకంగా పలకరించేవారు. 
 కె.వి. మహదేవన్ "మాప్లే (అల్లుడా) అని, వాంగ హీరో అని బి. ఆర్. పంతులు పిలిచేవారు.
63. జేసుదాస్ పాడిన వాటిలో "దైవం తంద వీడు...", పి. బి. శ్రీనివాస్ పాడిన పాటలలో "నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబం" అనే పాట తనకెంతో ఇష్టమని టిఎమ్మెస్ అంటుండేవారు.
64. తొలి రోజుల్లో టిఎమ్మెస్ ఇంట వయోలిన్ విద్వాంసుడు కున్నైక్కుడి వైద్యనాథన్ అద్దెకుండేవారు. ఆయనను పలు దేశాలకు తనతోపాటు తీసుకుపోయి పలు కచ్చేరీలలో వయోలిన్ వాయించే అవకాశం కల్పించారు టిఎమ్మెస్. 
65. టిఎమ్మెస్ కొడుకులలో ఒకడు పద్నాలుగో ఏట అనారోగ్యంతో చనిపోయాడు. ఈ సంఘటన ఆయనను ఎంతగానో కలచివేసింది. మరణించడానికి కొన్ని నిముషాల ముందు ఆ అబ్బాయి సుబ్రహ్మణ్యస్వామిమీద ఓ భక్తి పాట పాడమని అడిగాడు. సరేనని టిఎమ్మెస్ పాట పాడుతుండగా అది వింటూ కన్నుమూశాడా కొడుకు.
66. టిఎమ్మెస్ కచ్చేరీలలో ఇళయరాజా కీబోర్డు వాయించగా గంగై అమరన్ గిటార్ వాయించిన సందర్భాలున్నాయి. 
67. "నీరారుం కడలుడుత్త...." అనే తమిళ తల్లి పాటనూ, జాతీయ గీతం జనగణమన" పాటను పాడటానికి ఓమారూ ఎవరూ ముందుకు రానప్పుడు టిఎమ్మెస్, పి. సుశీల కలసి పాడారు. తమ గాత్రమాధుర్యంతో వారు అందరి హర్షధ్వానాలందుకున్నారు
68. టిఎమ్మెస్ ఎంతో గొప్పగా హార్మోనియం వాయించేవారు. 
69. తనతో ఎవరైనా మాట్లాడితే వెంటనే వారిలా మాట్లాడి మిమిక్రీ చేస్తుండేవారు టిఎమ్మెస్. 
70. టిఎమ్మెస్ ను హిందీ సినిమాలలో పాడమని హిందీ సంగీతదర్శకుడు నౌషాద్ ఎన్నోసార్లు కోరారు. కానీ టిఎమ్మెస్ పాడలేదు. తమిళపాటలే చాలండి అనేవారు.
71. మోడర్న్ థియేటర్స్ వారు నిర్మించిన డాక్టర్ అనే సింహళ భాషా చిత్రంలో ఓ పాట పాడారు టిఎమ్మెస్. 
72. నళదమయంతి అనే బుల్లితెర నాటకంలో టిఎమ్మెస్ నటించారు. 1992లో మణికంఠన్ దర్శకత్వంలో దూరదర్శన్ లో వచ్చిన ఈ నాటకంలో రాజగురువు పాత్రలో ఆయన నటించారు.
73. టిఎమ్మెస్ కు నచ్చని మాట...."వయస్సైపోయింది". సోమరితనం గిట్టేది కాదు.రోజూ ఆయన యోగా చేసేవారు. ఆల్ఫా మెడిటేషన్ చేసేవారు. శారీరక వ్యాయామమూ చేసేవారు.
74  బామావిజయం అనే సినిమాలో వరవు ఎట్టణా సెలవు పత్తణా పాటలో బాలయ్య, మేజర్ సుందరరాజన్, ముత్తురామన్‌ నాగేష్ నలుగురికీ గొంతు మార్చి పాడారాయన.
75. ఎంజీఆర్, శివాజీ వంటి అగ్రనటులకు పాడిన టిఎమ్మెస్ తనకు కూడా పాడితే బాగుంటుందనుకుని ఆశపడ్డ రజనీకాంత్ కోసం భైరవి సినిమాలో పాడారు. ఈ పాట రికార్డింగ్ అప్పుడు రజనీకాంత్ అక్కడే చివరిదాకా ఉండి టిఎమ్మెస్ గానమాధుర్యాన్ని ఆస్వాదించారు.
76. కోయంబత్తూరులో జరిగిన తమిళ ప్రాచీన భాషా సదస్సు కోసం ఎ.ఆర్. రహ్మాన్ ఓ ఆల్బంను విడుదల తయారు చేసారు. ఇందులో టిఎమ్మెస్ తోనూ పాడించారు రహ్మాన్. 
77. సఫారీ సూట్ అంటే ఎంతో ఇష్టంగా వేసుకునే టిఎమ్మెస్ కొన్నిరోజుల తర్వాత పైజామా, లాల్చీ మాత్రమే ధరించారు. 
78. ఓమారు ఎంజిఆర్ కానుకగా ఇచ్చిన బంగారు చైన్ ని ఎంతో కాలం చాలా ఇష్టంగా వేసుకున్నారు. తర్వాత పక్కన పెట్టేశారు.
79. అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, జర్మనీ, కెనడా, మలేసియా, సింగపూర్, శ్రీలంక తదితర దేశాలలో పర్యటించిన
టిఎమ్మెస్ అనేక కచ్చేరీలు చేశారు.
80. మందైవెళిలో ఆయన ఉంటున్న ఇంటి వాకిట్లో ఓ కుర్రాడు నిలబడ్డాడు. బిక్కుబిక్కుమంటూ అటూఇటూ చూస్తున్నా డు. అతనిని చూసిన టిఎమ్మెస్ దగ్గరకు రమ్మని పిలిచారు. అప్పుడా కుర్రాడు తన దగ్గరున్న ఓ చీటీ టిఎమ్మెస్ కి అందించాడు. "అయ్యా! నేను మీ అభిమానిని! నేనొక క్యాసెట్ తీసుకొచ్చాను. అందులో నాకిష్టమైన మీ పాటలు రికార్డు చేసిస్తారా?" అని అడిగాడు ఆ కుర్రాడు. వెంటనే టిఎమ్మెస్ ఆ కుర్రాడిని మేడమీద తన గదిలోకి తీసుకువెళ్ళి అతనికిష్టమైన పాటలను రికార్డు చేసిచ్చారు. ఇంతకూ ఆ కుర్రాడెవరో కాదు....ము. క. అళగిరి! ( కరుణానిధి కుమారుడు).
81. తిరువల్లూరులో ఓ కచ్చేరీ. టిఎమ్మెస్ కార్యక్రమమది. తనకు కీ బోర్డు వాయించడానికి ఓ బుల్లి కుర్రాడొచ్చాడు. అతనిని చూసిన టిఎమ్మెస్ "ఏమిటీ, ఈ చిన్నోడిని తీసుకొచ్చారు? ఇతను సరిగ్గా వాయిస్తాడా?" అని అడిగారు. "బాగా వాయిస్తాడండి. మన శేఖర్ వాళ్ళబ్బాయి వీడు" అంటూ సంగీతదర్శకుడు టి. ఆర్. పాపా ఆ కుర్రాడిని పరిచయం చేశారు. "ఉలగం పిరందదు ఎనక్కాగ ...." అంటూ టిఎమ్మెస్ పాడటం మొదలుపెట్టగానే ఆ కుర్రాడు కీబోర్డు వాయించసాగాడు. ఆ నాదానికి ఆశ్చర్యపోయిన టిఎమ్మెస్ ఆ కుర్రాడిని దగ్గరకు పిలిచి అతని తలమీద ప్రేమతో ఓ చిన్న మొట్టికాయ వేసి "ఉంగరం వేలితో మొట్టికాయ వేశాను. నువ్వు పెద్దవాడివై పేరుప్రతిష్ఠలు గడిస్తావు" అని దీవించారు. ఇంతకూ ఆ కుర్రాడెవరో చెప్పలేదు కదూ....అతనే ఎ.ఆర్. రహ్మాన్. 
82. టిఎమ్మెస్ సౌరాష్ట్రకు చెందినవారు. కన్నడ అయ్యంగార్, తెలుగు వైష్ణవులలాగా టిఎమ్మెస్ సౌరాష్ట్రా అయ్యంగార్. 
83. ముక్తా శ్రీనివాసన్ సమర్పించిన "బలపరీట్చయ్" అనే సినిమాకు టిఎమ్మెస్ సంగీతదర్శకత్వం వహించారు. ఆయన సంగీతం సమకూర్చిన ఏకైక చిత్రమిది. మంచి సంగీతం అందించిన టిఎమ్మెస్ ని తమ తదుపరి చిత్రానికికూడా సంగీతం సమకూర్చమని ముక్తా శ్రీనివాస్ అడిగారు. కానీ తనిక సంగీతదర్శకత్వం వహించ దలచుకోలేదు" అని సున్నితంగా ఆ అవకాశాన్ని తిరస్కరించారు. తాను గాయకుడిగానే ఉండిపోతానని వినమ్రతతో చెప్పారు టిఎమ్మెస్.
- సమాప్తం - కామెంట్‌లు