- మానవత్వం;-సావిత్రి కోవూరి;-కలంస్నేహం
 నడివీధిలో రక్తమోడుతు కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడు మానవులకు, 
ఒక్కొక్క క్షణం ఎంత అమూల్యమో తెలిసి కూడ, 
ఆరిపోయే ప్రాణదీపాలకు సాయమనే అరచేతులు అడ్డుపెట్టి, 
ఒక వ్యక్తిని కాపాడగలిగే శక్తి ఉండి కూడా, నిర్లక్ష్యంతో ఆదుకోక, 
సెల్లు లతో ఫోటోలు, వీడియోలు తీసే కఠినాత్ములు ఉన్న ఈ లోకంలో, 
రక్త సంబంధీకులకయినా సాయమవసరం అయినప్పుడు, 
రాతి ఎదల చాటున బంధుత్వాలను బంధీ చేసి, భద్రంగా దాచుకొనే చుట్టరికాలు ఉన్న ఈ కాలంలో, 
అడుగు ముందుకేసి అండగా నిలిస్తే, ఏ చిక్కులొవస్తాయో అను భయంతో, 
మనకెందుకులేయని, దులుపుకొని వెళ్ళిపోయే ప్రబుద్ధులున్న ఈ లోకంలో, 
పడిపోయిన వారు, తమ వారేనని కల్లలు చెప్పి 
రక్కసుల్లా పక్కన చేరి,
నగానట్రా ఒలుచుకుని, పారిపోవు చోరాగ్రేసరులున్న ఈ లోకంలో, 
ఫోను చేసి సాయం చేసే అవకాశం ఉండి కూడా 
కదలి పోయే ప్రాణాలను కఠినంగా కదలక వింతలుగ చూసే రాతిగుండెలున్న ఈ లోకంలో, 
కడలాంతర్భాగాన రత్నాల వలె ఏ మహాత్ముల దయార్థ హృదయాంతరాలలోనో 
దాగిన రత్నం లాంటి దయ భయల్పడి, నింగిలోని తారల్లా చమక్కున మెరసి,  
రక్త సంబంధం లేకున్నా, మానవ సంబంధమను మహత్తర గుణంతో, 
త్వరిత నిర్ణయాలుతో ప్రాణాలు కాపాడే కొందరైనా మానవులు ఉన్న ఈ లోకంలో, 
మానవత్వం ఇంకా మరణించలేదనే నమ్మకం వమ్ము కాకుండా కాపాడుతుంది.

కామెంట్‌లు