మా పెళ్లిరోజు;-అన్యం పద్మజ రెడ్డి;-కలం స్నేహం
ముడతలు పడ్డ మనసులో ఆనంద కెరటాలు
తెల్లబడ్డ మీసాల కింద చిలిపి నవ్వులు
నలభైయ్యేళ్ళ దాంపత్యపు గురుతులు
ఒలికిన ఓరచూపులు 
అది చూసిన గాజుకళ్ళలో మిసమిసలాడిన  సిగ్గు దొంతరలు

వయసు వరస తప్పినా తగ్గని వలపు తయారీలు
అనురాగం పంచిన సన్నజాజి పానుపులు
కౌగిలి కవాటాలు తెరవాలని ఉబలాటాలు
ఎన్ని జన్మలైనా తనివి తీరని సుధా మాధుర్యాలు

మాంగల్యంతో పెనవేసిన వల్లమాలిన అభిమానాలు
కష్టసుఖాల వంతెనలెన్నో దాటిన
తోడునీడలు
చేయి చేయి కలిపి సాధించిన విజయాలు
కరువుతీరా నెమరేసుకునే మధుర జ్ఞాపకాలు

ఒకరికొకరుగా బతికిన ఆనవాళ్లు
ఒకరి ఒడిలో ఒకరు కనుమూయాలని ఆరాటాలు
ఎన్నో మలుపులు చూసిన జీవన వాసంతాలు
అర్ధనారీశ్వర తత్వానికి వారసులు
ఒకటయ్యే నవదంపతులకు ఆదర్శాలు
ప్రేమే జీవితమైన ఆలుమగలు


కామెంట్‌లు