*గువ్వలచెన్న శతకము* - పద్యం (౦౫౮ - 058)
 కందం:
*ధనమైనంతట భూముల*
*తనఖాలును విక్రయములు తరువాతసతీ*
*మణిభూషణాంబరంబులు*
*గొనుటయు విటలక్షణములు గువ్వలచెన్నా!*
తా.: ..  
 వేశ్యల చుట్టూ తిరిగేవారు, చేతిలో ఉన్న డబ్బు పోగొట్టుకుని, తరువాత ఉన్న భూములను తనఖా పెట్టి అప్పు తెచ్చి ఖర్చు చేస్తారు. ఆ అప్పు తీర్చలేక, భూములు అమ్మేస్తారు. ఇక మిగిలింది, కట్టుకున్న భార్యకు వున్న నగలు, పట్టు చీరలు అన్నీ తీసుకు వెళ్ళి, వేశ్యలకు చేరవేస్తారు.....అని శతక కారుడు *"పట్టాభిరామ కవి - గువ్వలచెన్నుని "* వాక్కు.
*భావం:*
*ఇక్కడ పట్టాభిరామ కవి, మనిషి చెడు, దురలవాట్లకు బానిస అయినప్పుడు అతని కుటుంబానికి, అతనికి జరిగే నష్టాన్ని వివరించారు. చెడు అలవాటు ఏదైనా ఫలితం మాత్రం ఒక్కటే.  ఇల్లు, ఒళ్ళు గుల్ల అవడం.  సంఘంలో మనల్ని మనం చులకన చేసుకోవడం. వంశ మర్యాద దూరం చేసుకోవడం.  ఈ క్రమంలో మనం వెచ్చించే సమయంలో సగమైనా మనల్ని మనం తెలుసుకోవడానికి, పరమాత్ముని వైపు ప్రయాణం చేయడానికి ఖర్చు చేస్తే ఇహమ పరమూ కూడా మనవౌతాయి.*
*పరమశివుని ధ్యానంలో, ఆతని లీలలు వినడంలో, గానం చేయడంలో మనం మన మనస్సును లగ్నం చేస్తే కలిగే ఆనందం అవధులు లేనిది. అటువంటి, ఆహ్లాదకరమైన పరిస్థితి మనకు అంబికానాధుడు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ .....*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు