ఆశ్రమ వాసి;-కాకరపర్తి పద్మజా;- కలం స్నేహం
కలల రెక్కలిప్పిన పడుచుదనం
ఆశల సొగసు మడుగులో ప్రేమ నయనం
అభిరుచుల అందలంతో ఒకటైన వేళ
మూడుముళ్ళ బంధం కలిపిన శుభవేళ

అనుబంధాల తోటలో ఆలుమగలు
అనురాగాల అత్యాశతో సంతాన జననం
అపురూపంగా సాగిన వయసు పయనం

పెంపకాల అంపకాలతో పిల్లల విదేశీ యానం
ఏకాకిగా మారిన జీవిత వైనం
ఇద్దురున్నా …ఒక్కరికి మిగలని మాటల కాసులు
మౌనపు దివ్వె వెలుగులోశలభాల వలే పరిభ్రమణం

అవసరానికి పలుకుల మేళం మోగిస్తూ
కారణానికి రణం లేని క్షణాల వేటలో
మనసెరిగిన మనిషి జాడ మరిచిన పతి
అక్షరాల తోడుతో ఆరితేరి…
కీర్తి కిరీటాన్ని మోసే ప్రతిభావంతుడు

కనపడని శ్రీమతి రాసిన అక్షర లేఖ
తన తప్పుల వలయంలో గొప్పలు లేని
విషయాల కలబోతలో….నిజాల బట్టబయలు…
ప్రాముఖ్యత లేని తాను…ఇంట అవసరం లేదంటూ
ఆశ్రమ వాసిగా ఆమె జీవితం…
కన్నీటి దుప్పటితో బ్రతుకు చలిని దాచుకుంటూ
మరో ప్రపంచ వాకిట సేద తీరుతూ….!!

కామెంట్‌లు
Popular posts