మనసు పుస్తకం;-- యామిజాల జగదీశ్
నేను
నా మనసు పుస్తకాన్ని
చివరి పేజీ వరకూ
నన్ను తెలిసిన వారికి
పూర్తిగా చదివే అవకాశం ఇవ్వను

ఇలా ఇవ్వకపోవడానికి
కారణం
నా పుస్తకం రహస్యమయమని
అర్థం కాదు
అవి ఇతరులకంతగా 
చెప్పుకోవలసిన అవసరం లేదని
నేననుకుని ఉండొచ్చు

ఎందుకంటే
నేను ఏదన్నా చెప్పడం
మొదలుపెట్టడంతోనే
నీ కథ ఎవరికి కావాలి
నా కథ నాకూ ఉందని
మొహంమీద 
అసహనాన్ని చూపించేస్తారు

అయినా 
ప్రతి విషయమూ
ఆసక్తిగా చెప్పలేకపోవడంవల్ల కూడా
నా కథ
నిస్సారమైందని
మొదటి రెండు మాటల్లోనే
గ్రహించే వారిని
నేనెరుగుదును

అప్పుడనిపిస్తుంది
ఎవరికి ఉండవు కథలు
మనిషి పుట్టుకే ఓ కథ
అంతులేని కథ
ఆ కథలలో నేనొక ఆవగింజను
కనుక
నా మనసు పుస్తకం
ఎప్పటికీ 
అసంపూర్ణమే నన్నెరిగిన వారికి
------------------------------
- యామిజాల జగదీశ్
26. 12  2021
ఉదయం ఏడు దాటింది

కామెంట్‌లు