చెంత చేరిన చెలికాడా
వలపు వన్నెల ప్రియుడా
నా రూప కాంతి వెన్నెలనే చిన్నబుచ్చుతుందని
నా లావణ్యం రంబా ఊర్వశి మేనక తిల్లోత్తమలను అధిగమించిందని
అంటూ కన్నుగీటితే
రవివర్మ చిత్రమై పరవశించాను...!
గగనాన్ని తాకే అద్దాల మేడలో సేదదీర్చి
ఇంద్రధనుస్సు ఊయలలో ఊపి
మేఘాల మేనాలో ఊరేగించి
నక్షత్రాలతో పూల జడనే అల్లి
నింగి నుండి ముత్యాల తలంబ్రాల వాననే కురిపించి
ఎర్రటి ఇనబింబాన్ని
నుదుటన బొట్టుగా
దిద్దుతానంటె
పికాసో చిత్రానుభూతిని పొందాను...!
నా కౌగిలిలో ఒదిగిపోయి
హిమాలయాల చల్లదనం
నెలవంకను మించిన అందం
ఉదయ సంధ్యా వర్ణాన్ని మించిన నా దేహమంటు
పొగుడుతుంటె
నాలో ఆనందం నాట్యం చేస్తూ
మబ్బుల్లో దాగిన చంద్రుడిని తాకిన సంతోషంలో తేలిపోయాను...!
మన అనురాగం ముందు రాధామాధవుల ప్రణయం
అత్యల్పం
సీతారాముల కన్నా ఆదర్శభరిత శోభితమంటూ
నీ పదాల లాలసలో
పడి
మాయలో కొట్టుకుపోయి
చివరికి
అతిశయోక్తిని ప్రయోగించినావని
తెలుసుకుని వగచితినే...!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి