కీర్తి రథాలు...స్ఫూర్తి పథాలు;-వేణు గోపాల్--కలం స్నేహం
వరాలన్నీ వర్షమై కుండపోతగా కురిసినట్లుగా
తారాలోకం నేలను నింగిగ చేసి మెరిసినట్లుగా
సురలోకం నుండి నరలోకానికి విసిరినట్లుగా
ఉర్విలోని సుమములు భళ్ళున విరిసినట్లుగా
ధరణిజనులను మురిపించే శిశువుల తీరు
స్వర్గ దేవతా సమూహం కొలువుదీరిన తేరు

కొండలనే నివ్వెరపరుస్తూ కండలతో నిలిచి
కొండచిలువలను కంఠ హారాలుగా మలిచి
అనకొండలైన దగాకోరులను తొడగొట్టి పిలిచి
పండుటాకులైన పెద్దల హృదయాలను గెలిచి
మింటి చుక్కలను పుడమికి దింపే యువత
గుంట నక్కలను వెంటాడి వేటాడే చిరుత

ముద్ద దిగడం అదో...కురుక్షేత్ర యుద్ధంగా 
బుద్ధిహీనుల మధ్య బ్రతుకుటయే వ్యర్థంగా
సర్దుబాటు..సహనాలే శేషజీవన పరమార్థంగా
అద్దెకొంపను వీడి సద్దుమణుగుటకు సిద్ధంగా
వృద్ధుల జీవితాలు దారుణ నరక కూపాలు
ఊదకుండానే ఆరిపోయే అవసాన దీపాలు

అంతంలేని సమరానికై నిర్దేశించిన రథాలై
చైతన్యాశ్వపు పరుగుల మెరుపువేగ పదాలై
గతులు మారినా గమ్యం మరువని నదీనదాలై 
కీర్తిసౌరభాలను నిత్యం వెదజల్లే స్ఫూర్తిపథాలై
మృత్యుదేవత ఒడిలో నిద్రపోయే ప్రాణులు 
మృత్తికామాత గుడిలో భద్రత పొందే జ్ఞానులు
*************


కామెంట్‌లు