పూర్వము ఫ్రెడరిక్ రాజు సైన్యంలో, ఉపసేనాని హోదాలో ఒకడు ఉండేవాడు. ఒకపుడు యుద్ధాలు లేకపోవడం చేత, సైనికులు చేయవలసింది ఏమీ లేకుండా పోయింది. ఇంతమందిని వట్టినే కూర్చోబెట్టి
మేపడం ఎందుకని ఫ్రెడరిక్ రాజు
కొంత సైన్యాన్ని, సైనికాధికారుల్ని పనుల నుండి తొలగించివేశాడు. అట్ల తొలగింపబడిన వాళ్లలో ఉప సేనాని కూడా ఉన్నాడు. ఉద్యోగం ఊడిపోయిన తరువాత అతడు మాటి మాటికి ఫెడరిక్ దగ్గరకు వెళ్లి తిరిగి ఉద్యోగం యిమ్మని, సైన్యంలో చేర్చుకోమని వేధించుకు తినేవాడు. అతని బాధ పడలేక ఏదో ఒక సామాన్య మైన ఉద్యోగం యిస్తానన్నాడు ఫ్రెడరిక్. అయితే
అతను మట్టకు వప్పుకునేవాడుకాదు. నాకు మరల నాపనే ఉపసేనానీ నా నాయకత్వ పదవే కావాలని మంకు పట్టుపట్టి కూర్చునేవాడు. ఫ్రెడరిక్ ఎన్నోసార్లు నెమ్మదిగా “మిత్రమా! ప్రస్తుతం, ఖాళీలు లేవు, వచ్చినప్పుడు తప్పక యిస్తాను” అని
నచ్చచెప్ప చూచాడు. కాని అతను ససేమిరా వప్పుకొనేవాడు కాదు. మాటిమాటికి వచ్చి అట్లా అడుగుతుండే వాడు. ఫెడరిక్ సహజంగా శాంత స్వభావుడు. ఇతరుల మనస్సు కష్ట పెట్టేవాడు కాదు. అయినా, ప్రతి దానికి ఒక హద్దు అంటూ ఉంటుంది గదా! చివరికి విసుగొచ్చి “ఇక యిక్కడకు ఎన్నడూ రాకు, వచ్చావంటే కఠినశిక్ష పొందుతావు” అని హెచ్చరించాడు కూడా.
ఇది జరిగిన కొంత కాలానికి ఎవరో, ఫ్రెడరిక్ రాజును దూషిస్తూ ఒక పెద్ద కవితను అల్లి ప్రకటించాడు. దాన్ని రాజు కూడా చూశాడు. సహజంగా శాంత స్వభావం గలవాడైనా, తన అవమానాన్ని భరించలేక పోయాడు. చాల కోపంవచ్చింది. వెంటనే ఈ కవిత్వం వ్రాసిన కవిని పట్టకొని నాకు నప్పగించిన వానికి ఏభై బంగారు మొహర్లు బహుమానం యిస్తా"నని చాటింపు వేయించాడు. చాటింపు వేయించిన మర్నాడే ఉపసేనాని ఫ్రెడరిక్ ముందుకొచ్చి నిలబడ్డాడు. అతడ్ని చూచేటప్పటికి రాజుకు
కోపం, ఆశ్చర్యంకూడా కలిగాయి.
"మళ్లా యిక్కడకు ఎందకు వచ్చావు?' అని గర్జించాడు ఫ్రెడరిక్. అతడు వినయంగా నమస్కరించి, విన్నవించడం మొదలు పెట్టాడు.
"ప్రభూ, మిమ్ములను దూషిస్తూ
పద్యాలు వ్రాసిన కవిని పట్టిస్తే ఏభై బంగారు నాణాలు బహుమానం యిస్తానని, మీరు ప్రకటించారు గదా?”
“అవును ప్రకటించాము, అయితే దానికి నీవు యిక్కడకు రావడమెందుకు?"
"ప్రభూ, ఆ బహుమానాన్ని మీరు నాకు యివ్వకుండా తప్పించుకోలేరు"
“ఎందుకని?"
“ఎందుకంటే, ఆ పద్యాలు వ్రాసింది, ఏలినవారి దాసుడనైన నేనే. మీరు ప్రభువులు, కావాలనుకొంటే మీ చిత్తమొచ్చిన
కఠినశిక్షను నాకు విధించండి. కానీ ఆకలితో అలమటిస్తున్న నా భార్యా పిల్లలకు మీరు యిస్తామన్న బహుమానం మాత్రం దయ చెయ్యండి. ఇంతకంటే తమర్ని ఎక్కువ ప్రార్థించడం లేదు." ఉపసేనాని వ్యవహారమంతా చూచి, ఫ్రెడరిక్ కు చాలా కోపం వచ్చింది. వెంటనే ఒకే కాగితం మీద ఏదోవ్రాసి అతని చేతికిస్తూ “యిదిగో ఈ రాజాజ్ఞను తీసుకొని స్పాండోకోట అధిపతి దగ్గరకు వెళ్లు. అక్కడ యితర ఖైదీలతో పాటు నీవూ వుండేటట్లు శిక్ష విధించాను.
అతడు, రాజాజ్ఞను తీసుకొంటు "ప్రభువుల చిత్తం, దయ చేసి మీరు యిస్తామన్న బహుమానం మాత్రం యింటికి పంపడం మరచిపోకండి" అని బయటకు పోబోయాడు.
పోతున్న ఉప సేనానిని పిలిచి ఫ్రెడరిక్ రాజు యిలా అన్నాడు. “ఇదుగో జాగత్తగా విను, స్పాండోకోట అధిపతికి ఈ రాజాజ్ఞ యిచ్చి భోజనం చేయకముందు మాత్రం దీనిని చదువ వద్దని నా ఆజ్ఞగా చెప్పు
పాపం, ఉపసేనాని చేసేదిలేక దిగులుతో, ఉత్తరం తీసుకుని తిన్నగా స్పాండోకోటకు దారితీసాడు. అధిపతిని కలిసి రాజాజ్ఞ అందజేశాడు. భోజనం చేసిన తరువాత విప్పి చదవమన్న రాజాజ్ఞ కూడా విన్నవించాడు.
ఇద్దరూ భోజనానికి కూర్చున్నారు. అధిపతికి భోజనం ఏమాత్రం సహించటం లేదు. ఆ పత్రంలో తన కొంపతీసే ఏ ఆజ్ఞ ఉందో అని. అతనికి తగని భయం వేసింది. ఎలాగో భోజనం ముగిసింది. వెంటనే రాజాజ్ఞ పత్రం విప్పి చదివాడు. సంతోషం పట్టలేక సేనానిని గట్టిగా కావలించుకున్నాడు. రకరకాలుగా అతడికి అభినందనలు తెలుపసాగాడు. ఇదంతా అయోమయంగా ఉంది ఉపసేనానికి. అసలు సంగతేమిటని అధిపతిని ప్రశ్నించాడు. అధిపతి రాజాజ్ఞను చదివి వినిపించాడు.
"ఈ పత్రవాహకుని నేటి నుండి స్పాండో కోటకు అధిపతిగా నియమిస్తున్నాం. అన్ని వ్యవహారాలు చక్కబరచి యితనికి కోట వ్యవహారాలు వప్పగించాలి. నిన్ను పోటర్సడన్ కోటకు అధిపతిగా బదిలీ చేస్తున్నాం. ఇది నీకు ఎక్కువ సంతోషం కలిగిస్తుందని తలుస్తాం. త్వరలోనే ఈ పత్ర వాహకునికి బార్యాపిల్లలను, యాభై బంగారు మొహార్లు యిచ్చి స్పాండో కోటకు పంపే ఏర్పాట్లు చేయిస్తాం"
ఇది వినేసరికి ఉపసేనాని ఆనందంతో ఎగిరి గంతేశాడు. స్వస్థలానికి బదిలీ చేసినందుకు అధిపతి ముఖం వికసించింది.
(ఆంధ్ర వార పత్రిక, 23.9.1959)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి