ప్రేమసందేశం;-మాధవి అలువాల;-కలం స్నేహం
మన్మోహనా...
 ఒకసారి నీ మనసు తలుపులు తెరచిచూడు...నీవలపువాకిటనేను నిలుచుని గడపిన నిర్లిప్తమైన పగళ్ళు. నిద్రలేని రాత్రులు.. ఎన్నని చెప్పను... హృదయ కాగితంపై ప్రణయపాళీలో ప్రేమామృత సిరా నింపి రాస్తున్న గిలిగింతల జావళి నీకోసం...

 ప్రాణమంత నీ వద్దే వదిలేసి ఉత్తి తోలుబొమ్మనైపోయాను కదా... పిల్లగాలుల అలికిడి వింటే నీచరణ చరణాలు వినిపించే ఆలాపనలే...  

 ఆరుబయట ముసురుకున్న సంజె కన్నె జాబిల్లివేళనుఆహ్వానిస్తుంటే.. ఊసుపోని నేను ఊహల పందిరిమంచం అల్లేస్తూ సిగ్గులదిండులో ఎర్రబడిన మొహం దాచుకుని మధురాధర సంతకాల   స్వీకరణకై దండోరా వేస్తూ...

 పూచే వసంతాల సన్నిధిలో జయంతునికై  ఎదురు చూస్తూ పాడే కోయిలనై పోయా....
 నీ కొంటెనవ్వుల కార్ముకపు కొనల పై  చుబుకాన్నుంచి నా చెక్కిలిపై నీ చిటిక వేసే ఘడియకై నా తపోదీక్ష

 నాపెదాల క్షేత్రంపై తీపి పదాల పంటలు పండించే సేద్యగాడా....
 నీ కోసమే నా ప్రతీక్ష ...
జీవనసంద్రాన గుండెగూటిపడవలో  పయనించే నీకై ఉచ్ఛ్వాస నిశ్వాసల తెరచాపనై నినుసంతోష తీరాలకు చేర్చనా....
 నీ సుఖమే కాదు బాధను కూడా పంచుకునే నీలోని సగాన్ని కానా...

 మధురిమల సందేశాన్ని నాకోసం పంపుతావని... ఆశిస్తూ అలసి సొలసి వాలిన కనురెప్పలతో
నీ బదులుకై నిరీక్షించే నీ మధు....


కామెంట్‌లు