సంబరం; -ఎస్‌. హనుమంతరావు--8897815656

 పొద్దుటే ఏ.టి.ఎం. క్యూలో అంత చిన్న పాప బుద్ధిగా నిలబడటం చూసి, క్యూ లో నిలబడ్డ వాళ్లందరికీ ముచ్చటేసింది.
‘‘నీ పేరేంటి?... నువ్వూ డబ్బుల కోసమేనా?’’ అడిగాడు ఒకతను.
ఆ ప్రశ్నకు సిగ్గుపడుతూ పక్కనే వున్న నాన్న చేయి పట్టుకుంది పాప.
‘‘పేరు చెప్పు’’ నాన్న అన్నాడు.
‘‘ఉపాసన’’ అంది నెమ్మదిగా.
వీళ్ల వంతు వచ్చేసరికి, గ్లాసు డోర్‌ తోసుకుని లోనకెళ్లారు.
పర్సు లోంచి కార్డు తీసి మెషీన్‌లోకి పెట్టాడు నాన్న. పిన్‌ కొట్టబోయేసరికి... ‘‘న్నేన్నొక్కుతాను’’ అంటూ మారాం చేయడం మొదలెట్టింది పాప.
‘‘చూశావా?... మన వెనుక ఎంత మంది వున్నారో... నీకు సరిగా కొట్టడం రాదు కదా... దానివల్ల ఆలస్యం అవుతుంది. క్యూ లో వున్న వాళ్లకి ఇబ్బంది కదా... ఖాళీగా ఉన్నప్పుడు, ఇంకెప్పుడైనా పిన్‌ నొక్కుదువుగాని... సరేనా?’’ అన్నాడు నాన్న.
పాప ఇంకా గునుస్తూ వుండగానే డబ్బులొచ్చేశాయి. ఇద్దరూ బయటకొచ్చారు. మొహం అదో మాదిరిగా పెట్టింది పాప.
పాప మూడ్‌ని మార్చాలనుకున్న నాన్న ‘‘సరే!... ఇప్పుడు మనం సూపర్‌ మార్కెట్‌కి వెళదాం’’ అంటూ అటువైపు దారి తీశాడు.
షాపు ఖాళీగా వుంది. ఏవో సరుకులు కొన్నాక, క్యాష్‌ కౌంటర్‌ దగ్గర కొచ్చారు. కౌంటర్లో కార్డ్‌ ఇచ్చి ‘‘ఇప్పుడు నువ్వు పిన్‌ కొడుదువుగాని’’ అన్నాడు. ఆ మాటకు ఉపాసన మొహం మతాబులా వెలిగిపోయింది. తండ్రి నెంబర్‌ చెప్పగా నెమ్మదిగా పిన్‌ కొట్టింది. ‘పే’ రిసీట్‌, బిల్‌తో పాటు ఇస్తూ ‘‘యు ఆర్‌ గ్రేట్‌’’ అంది కౌంటర్‌లో అమ్మాయి. పాపకి షేక్‌హాండ్‌ కూడా ఇచ్చింది. పాప బిడియంగా నవ్వుతూ ‘‘థాంక్యూ’’ అంది.
కౌంటర్‌ను దాటుకుని నడుస్తుండగా ‘‘మరి డబ్బులు రాలేదేం డాడీ’’ అంది. ‘‘ఎందుకు రాలేదు. వచ్చాయి. వచ్చి, షాపు వాళ్ల ఎకౌంట్‌లోకి వెళ్లాయి... కనిపించలేదంతే... డబ్బులు ఇవ్వకుండా షాపు వాళ్లు సరుకులు ఇస్తారా ఏంటి?’’ అన్నాడు తండ్రి.
‘అవును కదా...’ అన్నట్టు చూసింది పాప.
బయటికి వస్తుంటే మేనేజర్‌ దగ్గర కొచ్చి ‘‘ఈరోజు మా షాపు టెన్త్‌ ఏనివర్సరీ సర్‌!... చిన్న సెలబ్రేషన్‌’’ అంటూ పాపకి చాక్‌లెట్‌ బార్‌ చేతిలో పెట్టాడు.
‘‘థాంక్యూ’’ అంది ఉపాసన.
నాన్న వైపు తిరిగి ‘‘మరి చెల్లికి?’’ అంది. ఆ మాట విన్న మేనేజర్‌ నవ్వుతూ ‘‘ఇది మీ చెల్లికి’’ అంటూ మరోటి ఇచ్చాడు.
పాపకి ఏనుగెక్కినంత సంబరంగా వుంది. చాలాసార్లు నాన్నతో ఏటీఎంకి వెళ్లింది గాని, ఈనాటికి తన కోరిక తీరింది మరి. దారి పొడవునా ఎగురుకుంటూ నడిచింది. ఇంటికి వచ్చీ రాగానే తను చేసిన ‘ఘనకార్యం’ తల్లికి చెప్పేసింది ఆనందంగా. ‘‘ఓప్ా! వండర్‌ఫుల్‌!’’ తల్లి మెచ్చుకుంది చెయ్యి కలిపి. ఆ మెచ్చుకోలుకి ఉబ్బితబ్బిబ్బవుతూ, చాక్‌లెట్‌ని చెల్లి చేతిలో పెట్టి ‘‘థాంక్యూ అను’’ అని అంది. చిన్నపాపకు ఏమీ అర్ధం కాకపోయినా, చాక్‌లెట్‌ సంగతి బాగా  అర్ధమైంది... లేస్తూనే చాక్‌లెట్‌... స్వీట్‌ మార్నింగ్‌ మరి...
‘‘ఉపాసనకి ఆధార్‌ కార్డ్‌ వచ్చేసింది కదా... పాప పేర కిడ్డీ బ్యాంక్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేద్దాం’’ అన్నాడు నాన్న.
‘‘అలాగే’’ అంది అమ్మ.
ఈ లోగా చాక్‌లెట్‌ తినేసి ‘‘మరి నేను?’’ అంటూ ముందుకొచ్చింది చిన్న పాప.
‘‘నిన్ను రేపు... సరేనా?’’ రేపు బయటికి తీసుకెళతానని అర్ధం వచ్చేటట్టు అన్నాడు.
‘‘ఓకే’’ అంది చిన్న పాప సంతోషంగా.
చిన్న చిన్న విషయాలైనా, ఏదైనా సాధించినప్పుడు మనసు ఆనందడోలికలో తేలిపోతుంది, పిల్లలకైనా, పెద్దలకైనా.
‘‘టీ చేసుకుని తీసుకొస్తాను’’ అని వంటింట్లోకి వెళ్లింది అమ్మ.
పిల్లలిద్దరూ తాము ఆడుకునే స్టీల్‌ కిచెన్‌ సెట్‌లోని రెండు కప్పు సాసర్లని తీసుకుని, చెరొకటి పట్టుకుని నాన్నకి, అమ్మకి ‘‘టీ’’ తాగమని ఇచ్చారు. వాళ్లు టీ తాగుతున్నట్టు నటించి ‘‘సూపర్‌’’ అని మెచ్చుకున్నారు. పిల్లల మొహాలు వెలిగిపోయాయి.
కామెంట్‌లు
డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్ చెప్పారు…
బాగుంది
అభినందనలు మీకు.
----డా కె.ఎల్.వి.ప్రసాద్
హన్మకొండ జిల్లా
D B VEnkataratnam చెప్పారు…
చాలా చాలా బాగుంది👌