లోకం తీరు;-కంచనపల్లి వేంకట కృష్ణారావు 9348611445

   అదేం చిత్రమో కానీ ఇన్నిన్ని ప్రవచనాలు,ఇన్నిన్ని వ్యక్తిత్వ వికాస సదస్సులు,పుస్తకాలు ఉన్నా ఇంకా మనుషులు మారకపోవడం ఎంత చిత్రం!
      ఏ రెండు రాజకీయ పార్టీలకు పడదు.ఏ సంస్థలో పట్టినా తగవులు, ఒకరిమీద ఒకరు చాడీలు చెప్పుకోవడం,పలకరింపులు లేక పోవడం చూస్తుంటే మనం ఎటువైపు వెళుతున్నామో తెలియడంలేదు.
     ఇది కేవలం వ్యక్తుల మధ్య మాత్రమే కాదు, దేశాల అధినేతలు కూడా విశాల ఆలోచనలు  లేకుండా ఒకదేశం మీద మరొక దేశం మీద అభాండాలు వేయడం,యుద్ధాలు చేయడం చూస్తుంటే ప్రపంచమే విచిత్రంగా కనబడుతోంది!
         స్కూల్,కాలేజీల్లో కేవలం డబ్బు సంపాదించే మార్గాలు,చదువులే కాకుండా కాసింత మంచితనం,భవిష్యత్తులో నడవడి,వాక్సుద్ధి పదే పదే నేర్పించి వారి మనసుల్లో ఆ మంచితనం పాతుకునేట్టు చేయాలి.
       
     జంగారెడ్డి గూడెంలో నాటు సారాయి మరణాలు సంభవించాయి...దానిని కూడా రాజకీయ పార్టీలు రాజకీయంగా వాడుకుంటున్నారు తప్ప, ఒక్కరైనా అక్కడి వాళ్ళను తాగుతే వచ్చే ప్రమాదాలను గురించి వివరించి వారిలో చైతన్యం తీసుకరారు! ఇది ఎంత చిత్రమో ఆలోచించండి.
        ప్రతి ఎన్నికలకు ముందరా రాజకీయ పార్టీలు ఉచితంగా ఇదిస్తాం అదిస్తాం అంటారు.దానిని ప్రతి ఒక్కరూ నమ్మేస్తూ ఓట్లు వేస్తుంటారు.ఆఖరికి ఏంజరుగుతుందో అందరికీ తెలుసు.
        ఒకడు ఎక్కువ వడ్డీ ఇస్తున్నానంటే,మరొకడు డబ్బు తీసుకుని ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటే గుడ్డిగా నమ్మేయడమే!వీటన్నిటికీ మూలం అత్యాశ!
       ప్రతి గురువు,ప్రతి ఉపాధ్యాయుడు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విద్యార్థులను తయారు చేయాలి.
      మీడియా కూడా కులాలు,మతాలకు కొమ్ముకాస్తూ లేని పోని అడ్డుగోడలు సృష్టించకుండా ఉండాలి.అందరూ మరింత విశాలంగా ఆలోచిస్తే ఈ దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుంది....ఆలోచించండి....ఆలోచించండి.
            **************

కామెంట్‌లు