డోలు, తాళ వాయిద్యం!;-- యామిజాల జగదీశ్
 సంగీత వాయిద్య పరికరాలలో డోలు ఒకటి.  నాదస్వర కచ్చేరీలలో ప్రముఖ తాళ వాయిద్యం డోలు. డోలు ధ్వని వినిపించకపోతే నాదస్వర కచ్చేరీ రక్తికట్టదు. డోలు శబ్దం గంభీరంగా ఉంటుంది. చెట్టు కాండంలో కొంత భాగాన్ని తీసుకొని మధ్యభాగాన్ని తొలిచి రొండు వైపులా జంతు చర్మాన్ని బిగిస్తారు. దానిపై ఒక వైపు కొయ్యతోనూ మరొకవైపు చేతి వేళ్ళతోను వాయించడం ద్వారా ధ్వనిపుడుతుంది.
దక్షిణభారతంలో డోలు తాళ వాయిద్యమైతే
ఉత్తర భారతంలో డోలక్ అనే వాయిద్యపరికరాన్ని ఎక్కువగా వాడుతారు. ఇది డోలుకన్నా కొంత తేలికగానూ, చిన్నదిగాను ఉంటుంది. 
తమిళనాడులో డోలు అనగానే అందరికీ గుర్తుకొచ్చే పేరు వళయపట్టి ఎ.ఆర్. సుబ్రమణ్యం పిళ్ళయ్. 
పుదుక్కోట్టయ్ జిల్లాలోని వళయపట్టి ఆయన స్వస్థలం. తన తండ్రి ఆర్ముగం దగ్గర నాదస్వరం నేర్చుకున్న ఈయన తర్వాతికాలంలో డోలుపట్ల ఆసక్తి చూపారు. మన్నార్గుడి రాజగోపాల్ పిళ్ళయ్ వద్ద డోలుపై శిక్షణ పొందారు. ఆరోజుల్లో నాచ్చియార్ కోయిల్ రాఘవ పిళ్ళయ్, నీడామంగళం షణ్ముగవడివేల్, యాయ్ పాణం దక్షిణామూర్తి, వళంగైమాన్ షణ్ముగసుందరం పిళ్ళయ్ వంటివారు డోలు వాయించడంలో సిద్ధహస్తులు. వారు వాయించే తీరు వినీ వినీ తనకంటూ ఓ ప్రత్యేక బాణీని సృష్టించుకున్నారు సుబ్రమణ్యం! 
ప్రముఖ నాదస్వర కళాకారులు తిరువీయిమియళై సోదరులం, చెంబనార్ కోయిల్ సోదరులు, కారైక్కురిచ్చి అరుణాచలం, నామగిరిపేట్టయ్ కృష్ణన్ వంటివారి కచ్చేరీలలో సుబ్రమణ్యం డోలు తప్పనిసరిగా ప్రతిధ్వనించేది. 
క్లారినెట్ విద్వాంసుడు ఎ.కె.సి. నటరాజన్ తో కలిసి పాలుపంచుకున్న సంగీత కచ్చేరీని మరచిపోలేనన్న సుబ్రమణ్యం వేలాది కార్యక్రమాలలో తన డోలు వాయిద్యంతో హర్షధ్వానాలందుకున్నారు.
ఇదిలా ఉండగా ఇప్పుడు పుదుక్కోట్టయ్ (తమిళనాడు) పరిసర ప్రాంతాలలో జరిగే సంగీత కార్యక్రమాలలో డోలు వాయిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న అమ్మాయి నిషాంతిని. ఈ పదేళ్ళ చిన్నారి పది కిలోల బరువున్న డోలుని ఒడిలో పెట్టుకుని తాళం గతి తప్పక వాయిస్తోంది. ఆమె తండ్రి నారాయణన్.
వారాప్పూరు అనే పల్లెకు చెందిన ఈ బాలిక అయిదో తరగతి చదువుతోంది.
అమ్మాయి మేనమామ నాగరాజన్. ఆయన డోలు వాయిద్యంలో దిట్ట. ఆయన దగ్గర నేర్చుకోవడానికి ఎందరో వస్తుంటారు. వారికి నేర్పిస్తుండటాన్ని  తదేకంగా చూస్తూ తాళాన్ని గమనిస్తూ డోలు వాయించడం నేర్చుకుంది నిషాంతిని.
కొంతకాలం భరతనాట్యంకూడా నేర్చుకున్న ఆ బాలికకు రాగం, తాళం, స్వరాలపై మంచి పట్టుంది. ఆమె ఇల్లు ఎప్పుడూ డోలు శబ్దంతో ప్రతిధ్వనిస్తుంటుంది. వినిపిస్తూ ఉంటుంది. 
డోలుపై ఓనమాలు దిద్దుకుంటున్న ప్రారంభంలో ఆమె పది వేళ్ళూ వాచిపోయేవి. దాంతో నొప్పి తట్టుకోలేక బాధపడేది. అయినప్పటికీ నేర్చుకోవాలన్న పట్టుదలతో ఆ బాధను దిగమింగేది. తొలి రోజుల్లో ఆమె డోలుని ఎత్తలేకపోయేది. అప్పుడు ఆమె గురువు (మేనమామ నాగరాజన్) లేదా నాన్నో (నారాయణన్) డోలు తీసి ఈ అమ్మాయి ఒడిలో పెట్టేవారు. 
అదే పనిగా వాయిస్తుండటంతో వేళ్ళు ఉబ్బి చేతులు నొప్పెట్టేది. అయినా వేళ్ళకు "గూడు" తగిలించుకుని తట్టేటప్పుడు ఓ లయ పుడుతుంది. ఆ లయ చెవులకు వినిపిస్తుంటే కలిగే ఆనందాన్ని మాటల్లో చెప్పలేనంటుంది నిషాంతిని.
కరోనా కాలంలో లాక్ డౌన్ తో ఎక్కడికీ వెళ్ళలేక ఇంటి పట్టునే ఉండటంతో ఎక్కువ సేపు డోలు మీద దృష్టి మళ్ళించి వాయిద్య కళాకారిణిగా మారి సంగీత కార్యక్రమాలలో, ఆలయాలలో డోలు వాయిస్తూ ఔరా అనిపించుకుంటోంది నిషాంతిని. 
తనకన్నా సీనియర్ డోలు వాయిద్య కళాకారులతో పోటీపడి వాయిస్తున్న ఈ అమ్మాయి ఏడాదిన్నర కాలంలోనే పుదుక్కోట్టయ్ పరిధిలో ఓ కళాకారిణిగా గుర్తింపు పొందడం విశేషం. ఓవైపు డోలు వాయిస్తున్నప్పటికీ మరోవైపు స్కూలుకెళ్ళి చదువుకుంటోంది. త్వరలోనే పెద్ద పెద్ద కచ్చేరీలలో వాయించాలన్నదే ఆమె ఆశ.
ఇప్పటికే నవరాత్రి సంబరాలప్పుడూ జాతర్లప్పుడూ వాయిస్తూ వస్తున్న నిషాంతిని తవిల్ (తమిళ పదం. తెలుగులో డోలు అంటారు) ఇసై ఇళందళిర్, తవిల్ ఇళం చక్ర వంటి బిరుదులతో సత్కారాలు పొందింది.
ఆమె ఆశయమల్లా డోలు విద్వాంసులు ఎ.కె. పళనివేల్, మన్నార్గుడి ఎం.ఆర్. వాసుదేవన్ లకు ధీటుగా వాయించాలనే.
కామెంట్‌లు