గర్వం!రాజస్థానీ కథ ఆధారం!; -అచ్యుతుని రాజ్యశ్రీ

 గర్వం అహంకారం మనిషి పతనానికి తొలి మెట్లు.ఎవరిగర్వం వారినే అణుస్తుంది.దుర్యోధనుడి దురహంకారం మనం ఎరిగినదే!ఒకరిని సతాయిస్తుంటే  వారు క్షోభ పడితే మనకు మంచిది కాదు. సోనేపుర్లో ఉన్న శివా మహాసోంబేరి.అమ్మా నాన్న చెప్పిన మాట వినకుండా  సోంబేరిలా తిరిగేవాడు.పనికి ఒళ్లు వంచేవాడేకాదు.తిండి కి తిమ్మ రాజు  పనికి పోతరాజులా తయారై అచ్చోసిన ఆంబోతులా తిరిగేవాడు. కరోనా మహమ్మారి కి కన్నవారు హరీఅనటంతో వాడికి బుద్ధి వచ్చింది. ఎవరూ వాడిని పనికి పెట్టుకోలేదు. ఉన్న కాస్త బీడు భూమిని ఎవరికన్నా  అమ్మా లని చూశాడు. ఎవరూకొనలేదు.చేసేది ఏమీలేక పట్టణానికి బైలుదేరాడు. దారిలో ఓఒంటె దానితో పాటు దాని పిల్ల కనపడ్డాయి.శివా లో ఆలోచనలు పురివిప్పాయి. మనవాడిలో కొత్త ఆలోచనలు వచ్చాయి. "పట్టణంవెళ్లటం దండగ! ఈరెండు ఒంటెలను తీసుకుని వెళ్లి సరుకులువేయటానికి బాడుగకు ఇస్తాను.ఈబుల్లి ఒంటెపిల్లని సాకుతాను."అని తన పల్లెకు తిరిగి వెళ్లి పోయాడు. అతని బతుకు బాగానే గడిచి పోతోంది. అడవిలో వాటిని స్వేచ్ఛగా వదిలేవాడు.ఆతల్లి ఒంటె కాళ్ళు సరిగా పనిచేయకపోటంతో శివా  ఎదిగిన ఒంటెపిల్లపై  సరుకులు వేసి బస్తీకి తీసుకుని వెళ్లసాగాడు.ఇది బాగా తుంటరి !అస్సలు చెప్పిన మాట వినేదికాదు.తల్లి చెప్పినా పెడచెవిన పెట్టేది. ఒక రోజు కోపంతో శివా దాన్ని చావబాదాడు.ఆఊరివారంతా శివా ని తిట్టారు. "ఏంరా?మనిషివైన నీవే మీఅమ్మనాన్న మాటలు వినకుండా జులాయి గా తిరిగావు.ఇక నోరులేని జంతువుని బాదకు.నీకు కష్టం గా ఉంటే అమ్మేయి.ఆడబ్బుతో వ్యాపారం చేయి"సరే ఈమాటలు నచ్చిన శివా ఆ ఒంటెపిల్ల మెడలో ఓగంటకట్టాడు.దాన్ని మచ్చిక చేసి ఐనకాడికి అమ్మాలను కున్నాడు.పెద్ద ఒంటె నిస్సహాయంగా అలా పడుకునే ఉంటుంది. తన బిడ్డ అల్లరి చూసి  కంటివెంటనీరు కారుస్తుంది.దాన్ని చూస్తూ ఉంటే శివా కి తనతల్లి గుర్తుకు వచ్చేది. "శివా!నాన్న చెప్పినట్లుగా నడుచుకో.పెద్ద వాడివి అవుతున్నావు". అందుకే ఆముసలి ఒంటెని ప్రేమగా చూస్తూ  చిన్న ఒంటె వెంట పడేవాడు.ఆరోజు శివా  ఒంట్లో బాగా లేక పడుకున్నాడు.ఒంటెపిల్ల కట్టుతెంచుకుని పారిపోయింది.దాని పరుగులకు అంతా బెంబేలెత్తి తలుపులు మూసుకున్నారు.గర్వం గా అది తనలో తాను నవ్వు కుంటూ అడవంతా కలయతిరిగింది.ఓఏరుదగ్గర కడుపు నిండా నీరు తాగి గంటమోతకి చిందులేయసాగింది.ఎక్కడనించో అమాంతం చిరుతపులి ఛెంగున ఎగిరి  దాన్ని పట్టుకొని చంపేసింది.రెండోరోజు  ఆదారివెంట వస్తున్న పల్లెవారు చూసి శివా కి  చెప్పారు. కన్నీరు కారుస్తున్న తల్లి ఒంటె నుచూస్తూ బాధ పడటం తప్ప  ఏమిచెయ్యాలో తెలీని శివాకి  తన గతజీవితం అమ్మా నాన్న ల మాటలు గుర్తుకొచ్చి నిట్టూర్పు విడిచాడు. అందుకే  గర్వం  అహంకారం తో పెద్దలమాటను పెడచెవిన పెడితే జరిగే ఫలితం తెలుసు కున్నారు ఆపల్లె పిల్లలు!శివా ని ఉదాహరణగాచూపి పెద్దలు నేర్పిన పాఠం అది🌷
కామెంట్‌లు