"కారం దోశ";-ఎం బిందుమాధవి
 నాగరికతకి దూరంగా చదువు సంధ్యలు లేక, వైద్యం గురించి తెలియక, కొండ కోనల్లో, గూడేల్లో బతికే వారికి, అప్పుడప్పుడు సామాజిక స్పృహ కలిగిన పెద్దలు సహాయపడటం చూస్తూ, వింటూ ఉంటాం.
అలాంటి ఒక గూడెం ప్రజలని "పిచ్చయ్య" అనే మధ్య తరగతి ఆయుర్వేద వైద్యుడు కలవటం జరుగుతుంది. వారి స్థితి చూసి జాలిపడి...వారికి వైద్యంతో పాటు అక్షరం ముక్క నేర్పి వారి స్థితిని బాగు చెయ్యాలని పూనుకుంటాడు. తన జీవితకాలంలో చాలా మందికి ఆ గూడెం నించి విముక్తి కలిగిస్తాడు.
ఆయన మీద నమ్మకంతో ఆయనకి దగ్గరైన ఆ అమాయకపు గూడెం ప్రజలని, ఆయన మరణించాక... ఆ పిచ్చయ్య మేనల్లుడు ఎర్ర చందనం స్మగ్లింగ్, కల్తీ సారా తయారీలు లాంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకి వాడుకుంటాడు.
అలా బయటపడలేక, అక్కడే మగ్గిపోతున్న వారిని బెదిరించి...అటవీ సంపద దోచుకోవటానికి ప్రయత్నిస్తూ..ఆ క్రమంలో పోలీసుల దగ్గర ఆ గూడెం ప్రజల మీద కేసులు పెట్టిస్తూ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఉంటాడు.
పిచ్చయ్య గారిని ఆదర్శంగా తీసుకున్న సత్యనారాయణ గారు... పూనిక ఉంటే చాలు ఆర్ధిక స్థోమత అక్కరలేదు అనుకుని, తనకి తెలిసిన దోశల వ్యాపారం ద్వారా సంపాదించి తన వంతు సామాజిక బాధ్యతగా పిచ్చయ్యగారి వారసత్వాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంటాడు.
ఒక మంచి సామాజిక సమస్యని తీసుకుని, నలుగురికీ అందించే ఉద్దేశ్యంతో వీణా వేదిక వారు సమర్పించిన చిత్రం ఇది. ఆరు సంవత్సరాల క్రితం వచ్చింది. షుమారు 2.9 మిలియన్ ప్రేక్షకులు వీక్షించారు. ఈ చిత్రానికి కధ, మాటలు, పాటలు, దర్శకత్వం "త్రివిక్రం గాజులపల్లి" అందించారు.
కోవిడ్ నేపధ్యంలో..లాక్ డౌన్ సందర్భంలో మాత్రమే ఇలాంటి చిత్రాలు ఓటిటి లో చూడటానికి సిద్ధపడతాము!
ముఖ్య తారాగణం: శివకుమార్, సూర్య శ్రీనివాస్, వంకాయల సత్యనారాయణ, అనిల్ మాకి రెడ్డి, చందన్రాజ్, మొ.
********
గూడెం ప్రజలకి, పోలీసులకి మధ్యన ఘర్షణ అనే వార్తతో సినిమా ప్రారంభమవుతుంది.
సత్యనారాయణ అనే ఓ పెద్దాయన మెస్ నడుపుతూ ఉంటాడు. ఆ మెస్... అంటే "పిచ్చయ్య మెస్" లో కారం దోశ బాగా పాప్యులర్. రోజూ ఎన్ని దోశలు అమ్మారో లెక్క రాసుకుంటూ ఉంటాడు ఆ పెద్ద మనిషి. ఆ చుట్టు పక్కల ఉండే అందరికీ ఆ మెస్ ఆకలి తీర్చే అన్నపూర్ణ.
దగ్గరలో ముగ్గురు కుర్రాళ్ళు ఒక ఇంట్లో అద్దెకుంటూ ఉంటారు. అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఈ తరానికి ప్రతినిధులు. ఒకతను సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ ఉంటాడు. పెళ్ళి కావాలని కోరుకుంటాడు. కాలేదని చింతిస్తూ ఉంటాడు. ఒక పెళ్ళిళ్ళ బ్యూరోలో రిజిస్టర్ కూడా చేసుకుంటాడు..కానీ అతని అవసరాలకి తగ్గ సంబంధం దొరకదు.
ఉద్యోగాలు లేని ఇద్దరు మిత్రులని తన రూం లో ఉంచుకుని వాళ్ళని ఉద్యోగాలు చెయ్యమని, దొరికిన దానితో తృప్తి పడాలని చెబుతూ ఉంటాడు.
మిత్రుల్లో ఒకరైన మన నాయకుడు....పేరు వేమన, తన విద్యార్హతలేమిటో, తనకున్న నైపుణ్యాలేమిటో అంచనా వేసుకోలేక నేల విడిచి సాము చేసే ఈ కాలపు కొంతమంది సగటు యువకులకి ప్రతినిధి. అతనికి నచ్చిన ఉద్యోగం రాలేదని, వచ్చిన దానితో తృప్తి పడలేక... "ఎప్పటికైనా బిజినెస్ చేసి రెండు చేతులా సంపాదిస్తాను...అందరిలాగా ఏదో ఒక ఉద్యోగం చేస్తూ గొర్రెతోక జీతంతో బతకటం ఇష్టం లేదని" బలాదూర్ తిరుగుతూ ఉంటాడు.
ఇది చాలనట్టు, వీరి ఊరినించి వెంకట రమణ అనే మరొక నిరుద్యోగ మిత్రుడు వచ్చి వీరితో కలుస్తాడు. అతను వీరు ఉద్యోగాలు చేస్తున్నారనుకుని, సాఫ్ట్ వేర్ కోర్సులు నేర్చుకుని, వీరి సహాయంతో ఉద్యోగం సంపాదించుకోవచ్చనుకుంటాడు. కానీ అతని ముందు తాము ఇంట్లోనే ఉంటే, వీరు నిరుద్యోగులనే విషయం బయటపడుతుందని వీళ్ళిద్దరూ జాగ్రత్తపడతారు.
ఆశలు ఆకాశంలో, వాస్తవాలు నేలబారుగా ఉన్న తన మిత్రులకి ఆ మెస్ ఓనర్ సత్యనారాయణ గారి చేత కౌన్సిలింగ్ ఇప్పించాలనుకుంటాడు, ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అతని సలహాలు ఈ మిత్రులిద్దరికీ నచ్చవు. పైగా పనికిమాలిన ఈ దోశలు అమ్ముకుని బతికే ముసలాయనతో తమ గురించి అతను మాట్లాడటం వాళ్ళు ఇష్టపడరు.
డబ్బు సంపాదించటానికి తనకి తెలిసిన ఒకరిద్దరిని సంప్రదించి అది అంత తేలిక కాదని తెలుసుకుంటాడు.
********
దోశ బాగా రావాలంటే పిండి పులవాలని చెబుతూ..అలా పిండి పులవాలంటే కాస్త సెగ తగలాలని పెద్దాయన తన అనుభవాన్నంతా రంగరించి చెబుతాడు. కడుపులో చల్ల కదలకుండా అవసరాలు అన్నీ తీరుతుంటే ఎవరికీ జీవితం మీద సీరియస్ నెస్ ఉండదని...ఒక దెబ్బ తగిలితేనే వారిలో మార్పు వస్తుందని చెబుతాడు.
"ప్రేమతో పోశా కారం దోశ, మీ సంతోషమే నా శ్వాస" అనే పాటలో బతుకు పట్ల ఆయన విశ్వాసం, వాటితోనే అనుకున్నది సాధించ గలననే ఆ పెద్దాయన నమ్మకం బాగా ధ్వనించింది.
పెద్దాయన దగ్గరి చుట్టం ఒకతని ద్వారా మన నాయకుడు వేమన ఒక లారీ రవాణా కంపెనీలో చేరతాడు. అక్కడ ఓనర్ నే ఆఫీస్ అసిస్టెంట్ అనుకుని లోకువగా మాట్లాడతాడు. పని నేర్చుకోమంటే, ఆఫీస్ టేబుల్ మీద కాళ్ళు పెట్టుకుని కూర్చుని సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తూ ఆ ఓనర్ ని ఫ్యాన్ వెయ్యమని, ఓనర్ వస్తే తనొచ్చానని చెప్పమని ఆఫీస్ అవర్స్ లోనే బయటికెళ్ళిపోతాడు.
అతని నిర్లక్ష్య ధోరణికి పాఠం నేర్పాలని, ఓనర్ తన ఇంటి నించి ఫోన్ చేసి, అప్పటివరకు ఆఫీస్ నడిపిన వ్యక్తి సెలవు మీద వెళ్ళాడని, వేమనని ఆఫీస్ వ్యవహారాలు మొత్తం చూసుకోమని చెబుతాడు. మన కేర్లెస్ నాయకుడు, అప్పటి వరకు ఏ పని చెయ్యకుండా కాలక్షేపం చేసిన విషయం వదిలేసి, ఇద్దరి పనికి రెండు జీతాలివ్వాలని ఒక హక్కుగా అడుగుతాడు.
డ్రైవర్స్ టైం కి రాలేదని, లారీలు ఇదివరకటి లాగా తమకి వీలుగా నడవట్లేదని... లారీలు బుక్ చేసుకున్నవాళ్ళు, వేళ్టికి లారీ రాకపోతే తమ వస్తువులు పాడయిపోతాయని, బాధ్యత లేకుండా ఇలా చేస్తే తాము వేరే లారీ కంపెనీ చూసుకుంటామని గట్టిగా చెబుతారు.
నిజంగా పని చెయ్యక తప్పని పరిస్థితి వచ్చేసరికి మన వేమన ధోరణిలో కొంత మార్పు రావటం మొదలవుతుంది.
ఊరి నించి వీరి దగ్గరే ఉంటున్న వెంకట రమణ బాధ పడలేక ఇంకొక మిత్రుడు కూడా బయటికెళ్ళి ఉద్యోగం వెతుక్కోవాలనుకుంటాడు.
*********
ఇంతలో పెద్దాయన బృందం లో ఒకతను గూడెంలో జనం కొంతమంది తప్పించుకోవాలనుకుంటున్నారు కాబట్టి పహరా కాస్తున్న పోలీసుల దృష్టి మళ్ళించమని కోరతాడు. తన నెట్ వర్క్ ద్వారా ఆ పని పూర్తి చేస్తాడు. కానీ అందులో కొందరు తప్పించుకోలేక మిగిలిపోతారు. తప్పించుకున్న వారి జీవితాల విలువ మిగిలిపోయిన వారి ప్రాణాలకి సమానమని గుర్తుంచుకోమని చెబుతాడు, పెద్దాయన.
ఇక్కడ నిర్లక్ష్యంగా తనకి ఉన్న ఉద్యోగాన్ని కాలతన్నుకోవాలనుకున్న మన వేమన తప్పని పరిస్థితుల్లో డబ్బు అవసరమై, లారీ ఓనర్ని ఎడ్వాన్స్ అడుగుతాడు. కొన్ని షరతుల మీద ఓనర్ డబ్బిస్తాడు. అలా అతనిలో నెమ్మదిగా డబ్బు అవసరాలు, సంపాదించటం చేతకాక పోయినా తప్పని అవసరాలు, జీవితాన్ని సీరియస్ గా తీసుకోవలసిన అవసరాన్ని నేర్పుతాయి. లారీ కంపెనీ మేనేజర్ ని కలిసిన తరువాత, అతని మాటల వల్ల తన ఆలోచనావిధానంలో ఉన్న లోపాన్ని తెలుసుకుంటాడు.
ఇంకో మిత్రుడు సంపాదనకోసం, డ్రగ్స్ రవాణా చేసే పనిలో కుదురుతాడు. అది గమనించిన వేమన అతన్ని ఆ పని నించి మానిపిస్తాడు.
ఇంతలో వేమన తండ్రి ఊరి నించి వస్తాడు. కొడుకు బాగా చదువుకుని, ప్రయోజకుడై ఉద్యోగం చేస్తున్నాడనుకుని, ఇక పెళ్ళి చేసుకోమని చెప్పి వెళతాడు. తను తండ్రిని మోసం చేస్తున్నానని పశ్చాత్తాప పడతాడు.
దోశలు వేసి దేశాన్ని ఉద్ధరిస్తాడా అని సత్యనారాయణ గారి గురించి హేళనగా మాట్లాడిన నాయకుడు వేమనతో, అతను సంపాదించలేక కలత చెందినపుడు... నాయకులంటే గాంధి నెహ్రూలే కానక్కరలేదు, సమాజం గురించి స్పృహ ఉన్న వారందరిని ఒక చోటికి పోగు చేసి తన పరిధిలో చెయ్యగలిగినంత చేసిన పిచ్చయ్య లాంటి వారిని ఆదర్శంగా తీసుకోవచ్చు అని చెబుతాడు, సత్యనారాయణ గారు.
తను సహాయం చేస్తున్న ఆ గూడేన్ని ప్రభుత్వం ఒక సమస్యాత్మక ప్రదేశంగా భావిస్తున్నదని, తను మళ్ళీ పిచ్చయ్య లాగా నలుగురిని కూడగట్టి ఆ గూడెం ప్రజలకి సహాయం చెయ్యాలని సంకల్పించానని చెబుతాడు. ఏదైనా మంచి పని చెయ్యాలంటే డబ్బు సంపాదించాలి. ఆ డబ్బు సంపాదించుకోవటానికి, నలుగురిని కూడగట్టుకోవటానికి తనకి బాగా తెలిసిన దోశల వ్యాపారాన్ని ఆధారంగా చేసుకున్నానని పెద్దాయన చెబుతాడు.
సత్యనారాయణ గారి మనవడు వేమన తండ్రి చేతి మీద ఉన్న పచ్చబొట్టు గురించి అడుగుతాడు. అది ఆ గూడెంలో అందరికంటే వెనకపడిన వారికి గుర్తు అని చెప్పి, ఎక్కడ చూశావు అని అడుగుతాడు ఆ పెద్దాయన!
వేమన తండ్రి చేతి మీద ఉన్నదని చెప్పినప్పుడు, వేమన అది నా తాత చేతి మీద కూడా ఉన్నదని, కానీ తను దాని గురించి తనెప్పుడూ ఆలోచించలేదని చెబుతాడు. పెద్దాయన మాటలని బట్టి తన కుటుంబం ఆయన ద్వారా ఉద్ధరించబడినట్లు తన మూలాలు తెలుసుకున్న వేమన...సంపాదన చిన్నగా మొదలయినా అడుగు గట్టిగా వేస్తే అనుకున్న గమ్యం చేరచ్చని తెలుసుకుంటాడు.
తన ఆలోచనలు అప్పటివరకు తనని పోషించిన సాఫ్ట్ వేర్ మిత్రుడికి చెప్పి ఒక "ఏం చెయ్యాలి" అనే ఒక వెబ్సైట్ తయారు చేయిస్తాడు. చదువులు అయిపోయాక, తమ నైపుణ్యాలు ఎక్కడ ఉపయోగపడతాయి? ఆర్ధిక స్థోమత గొప్పగా లేని వారు స్వయం ఉపాధి ఎలా పొందచ్చు? అనే వివరాలతో వెబ్ సైట్ నాలుగైదు భాషల్లో డిజైన్ చేసి, ఇంజనీరింగ్ కాలేజిల్లో స్టూడెంట్స్ తో చర్చించి తనలాగే ఏం చెయ్యాలో తెలియక అయోమయంగా ఉన్న వారికి మనం ఎలా మార్గదర్శకులం అవ్వచ్చు అని నలుగురికి చెబుతాడు.
చిత్రం యూ ట్యూబ్ లో అందుబాటులో ఉన్నది.
ప్రభుత్వోద్యోగాలు దొరకక, సిఫారసులు లేక, ఆర్ధిక స్థోమతు లేక ఎలా బతకాలో తెలియక అసహనంతో బతుకుతున్న యువతకి మంచి సందేశాన్నిస్తున్న చిత్రం ఇది.


కామెంట్‌లు