నా ప్రేమసందేశం;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
నా సందేశాన్ని
ఓ మేఘమొచ్చి 
తీసుకొనివెళ్ళి 
నాచెలికి చేర్చింది

నా ప్రేమలేఖను
ఓ పావురమొచ్చి
పట్టుకొనివెళ్ళి
నాప్రేయసికి అందించింది

నా కబురును
ఓ కాగితమొచ్చి
తనపైవ్రాయించుకొని
నాకాంతకళ్ళముందు పెట్టింది

నా వార్తను
ఓ వెలుగొచ్చి
పుచ్చుకొని
నా వనితకిచ్చింది

నా మాటలను
ఓ గాలితెమ్మెరొచ్చి
మోసుకొనివెళ్ళి
నాప్రియురాలుకు అందించింది

నా విరహవేదనను
ఓ చరవాణివచ్చి
నమోదుచేసుకొని
నానెచ్చెలి ముందుంచింది

నా ప్రేమను
ఓ పువ్వువచ్చి
తెలుసుకొని
నాతరుణికి తెలిపింది

నా మనసును
ఓ కవితవచ్చి
కమ్మగావ్రాయించి
నాచెలియకిచ్చి పఠింపజేసింది

నా నీలవేణి
సంతసించి
ఎగిరొచ్చి
నా ఒడిలోవాలిపోయింది


కామెంట్‌లు