*భర్తృహరి సుభాషితములు - పద్యం (౦౪౭ - 047)*
 *దుర్జన పద్ధతి*
కందం:
*మనుజులలో నెవ్వఁడు దగఁ*
*దనవాఁడనువాఁడు దుష్ణధరణీశునకున్*
*దనకయి వ్రేలిమి వ్రేల్చెడు*
*జనునితనువుఁ గాల్చు వాయుసఖుఁడడయుండై*
*తా:*
అగ్నిహోత్రుడు తనకు ఎంతో ఇష్టమైన నెయ్యి, సమిధలు ఇచ్చే మనిషిని కూడా ఏ మాత్రము సంకోచము లేక, ఒక్క క్షణం కూడా ఆలోచించ కుండా కాల్చివేస్తాడు. అలాగే, మిక్కిలి కోపిష్టి, దుర్మార్గుడు అయిన రాజు కు గానీ, అధకారికి గానీ వారి మనసు దగ్గరగా వుండగలిగిన వారు ఎవరూ వుండరు. ఎందుకంటే, తమకు ఎంత దగ్గర వాళ్ళైనా, చిన్న పొరపాటు, తప్పు చేస్తే వెంటనే దండించేస్తారు....... అని *"ఏనుగు లక్ష్మణకవి"* చెపుతున్నారు.
*భావం:*
*పైన కవి చెప్పిన లక్షణాలు కలవారు మహాభారతం లో కీచకుడు, జరాసంధుడు, రామాయణం లో రావణబ్రహ్మ, భాగవతం లో కంస మామ. అందుకే పెద్దలు చెప్తారు, ఈ పురాణాలను చిన్నవారికి వివరించి చెప్పగలిగితే, మన పిల్లలకు జీవితం గురించి విడిగా అవగాహన కల్పించవలసిన అవసరం వుండదు అని.  ఈ భారత, భాగవత, రామాయణాలలోని ప్రతీ పాత్ర మనిషి జన్మ ఎత్తిన వారు ఎలా వుండాలి, ఎలా వుండ కూడదు అని ఆచరించి చూపించాయి మనకు. అందువల్ల, సమాజంలో ని దుర్మార్గలకు దూరంగా వుంటూ, ఈ పురాణాల మీద ధ్యాస వుంచి మంచి మార్గంలో నడిచే బుద్ధి ని మనకు ఇవ్వమని ఆ వేదపురుషుని వేడుకుందాము..... .*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు