*భర్తృహరి సుభాషితములు - పద్యం (౦౫౦ - 050)*
 *దుర్జన పద్ధతి*
తేటగీతి:
*మొదలఁజూచినఁ గడు గొప్ప పిదపఁగురుచ*
*యాదిఁగొంచెము తర్వాత నధిక మగుచుఁ*
*దనరు, దినపూర్వపరభాగ జనితమైన*
*చాయపోలికఁగుజనసజ్జనులమైత్రి !*
*తా:*
చెడువారితో స్నేహము, ఉదయం పూట సూర్యని వెలుగులో ఏర్పడే నీడలాగా, ముందు చలా దగ్గరగా, పెద్దదిగా కనిపించి రోజు గడుస్తున్న కొద్దీ చిన్నదై పోతుంది. మంచివారితో స్నేహం సాయంకాలపు ఎండలో ఏర్పడే నీడలాగా, చిన్నదిగా మొదలై విడదీయలేనంత పెద్దగా అవుతుంది......... అని *"ఏనుగు లక్ష్మణకవి"* చెపుతున్నారు.
*భావం:*
*మనం మనకు భగవంతుడు ఇచ్చిన తెలివి తేటలతో, లోకజ్ఞానంతో మన సన్నిహితులను ఎంచుకునే అవకాశం పరమాత్ముడు మనకే ఇచ్చాడు. కొన్ని సందర్భాలలో మన తెలివి మరుగున పడిపోతే, మనల్ని తట్టి దారిలో పెట్టడానికి హంసను కూడా ఆపరాత్పరుడే సృష్టించాడు. క్షీర నీర న్యాయం మనం తెలుసుకునే టట్టుగా. కానీ, మనమేమో, మన చుట్టూ వున్న ప్రలోభాలకు లొంగిపోయి, విచక్షణను కోల్పోయి, చెడు సావాసలతో కాలక్షేపం చేయడానికి అలవాటు పడుతున్నాము. ఈ మన మానసిక పరిస్థితి కి అద్దం పడుతోంది ఇప్పటి మన ప్రస్తుత సమాజం. ఇటువంటి క్షణభంగురమైన ఆకర్షణలకు లొంగకుండా, మంచిచెడులను విశ్లేషించుకుంటూ, చక్కని రాజ మార్గంలో మన జీవన నావ సాగి, "దేహాంతే తవ సాన్నిధ్యం" అని గుర్తెరిగి జీవించే పరస్థితులను మనకు కలగజేయమని ఆ సర్వేశ్వరుని వేడుకుంటూ... .*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు