*భర్తృహరి సుభాషితములు - పద్యం (౦౫౨ - 052)*
 *సుజన పద్ధతి*
మత్తేభం:
*సుకృతి శ్రేష్టుల గోష్ఠియుం, బరగుణస్తోమంబునం బ్రీతి, దే*
*శికసంసేవయు, విద్యయందు రుచి, స్వస్త్రీకేళి, లోకాపవా*
*దకధాభీతియు, శంభుభక్తి, దమనోద్యచ్ఛక్తియున్, సాధుదూ*
*షక సాంగత్యవిముక్తియుం, గలమనీషావంతులం గొల్చెదన్.*
*తా:*
మంచి పనులు చేయడంలో నెర్పరి తనము కలిగిన వారితో మాటలు కలిపి మాట్లాడే వారితో, ఇతరులలో వున్న మంచి గుణాలను పొగడ గలిగే వారి తో, చదువు చెప్పిన గురువులకు సేవ చేసే అలవాటు వున్న వారి తో, చదువు కోవడం లో ఇష్టం కనబరిచే వారితో, తనతో సహజీవనం చేయడానికి వచ్చిన స్త్రీ తో చక్కగా సంసారం చేసుకునే వారి తో, సమాజంలో తన గురించి చెడుగా చెప్పుకుంటారేమో అని భయపడే వారితో, పరమేశ్వరుని యందు భక్తి కలిగి వున్న వారితో, అవమానమునకు గురి అవుతానేమో అని భావనను వదిలిన వారితో, మంచి వారిని, సాధువులను గురించి తప్పు గా మాట్లాడే వారి స్నేహం వదిలి పెట్టే వారితో, ఇటువంటి మంచి లక్షణాలు అన్నీ వున్న వారికి నేను నమస్కరించి గౌరవిస్తాను......... అని *"ఏనుగు లక్ష్మణకవి"* చెపుతున్నారు.
*భావం:*
*మనచుట్టూ వున్న సమాజంలో ఎటువంటి మనుషులతో స్నేహం చేయాలి, ఎలాంటి లక్షణాలు వున్న వ్యక్తులు సమాజంలో గౌరవించబడతారు అనే విషయాలు పైన పద్యంలో కవి వివరించారు. ఈ నాటి మన సమాజంలో పైన చెప్పిన పరిస్థితులకు విరుద్ధంగా ఇప్పటి పరిస్థితులు వుండటం మనం చూస్తూనే వున్నాం. అటువంటి విపరీత వాతావరణంలో మన మెవ్వరంఉ చిక్కు పడకుండా వుండేటట్లు పరమేశ్వరుడు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ... .*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు