*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ప్రథమ (సృష్టి) ఖండము - (౭౪ - 74)*
 *మాయా నిర్మిత నగరము - శీలనిధి కుమార్తె - విష్ణుమూర్తి రూపము - భగవంతుని వరించుట - శివగణములకు శాపము*
*శీలనిధి మహారాజు ఏర్పాటు చేసిన స్వయంవరంలో సుక్షత్రియుడుగా ప్రత్యక్షమైన శ్రీమన్నారాయణుడు, శ్రీమతి ని కైపట్టి, తన విష్ణులోకానికి పయనం అవుతాడు. లిప్తపాటు సమయంలో జరిగిన ఈ పరిణామం ఆహూతులైన రాజకుమారులను నారదమునిని కూడా సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. తేరుకుని, రాకుమారులు అందరూ సభామందిరంలో పెళ్ళి కుమార్తె అయిన శ్రీమతి లేదు అని తెలుసుకుని, తమకు దక్కలేదు అనే బాధతో వారి వారి స్వస్థలాలకు బయలుదేరుతారు.*
*శివ మాయా మోహంలో వున్న నారదముని కి శ్రీమతి తనను ఎందుకు వివాహమాడలేదో, తన మెడలో వరమాల ఎందుకు వేయలేదో అర్ధం కాలేదు. ఈ తిరస్కారం వల్ల మహా వేదన అనుభవిస్తున్నాడు. ఈ పరిస్థితి చూచిన బ్రాహ్మణ రూపంలో వున్న శివ పార్షదులు ఇద్దరూ, స్వామీ! ఒకసారి మీ ముఖంను అద్దం లో చూచుకోండి. కోతి ముఖముతో వున్న మిమ్మల్ని ఏ స్త్రీ మాత్రం వరిస్తుంది, అని ఒక అద్దం నారదమునికి ఇస్తారు. ఈ మాటలు నారదముని కి కోపాన్ని, అసహనాన్ని తెప్పిస్తాయి. ఆగ్రహం పట్టలేక ఆ పరమపండితులైన శివపార్షదులకు "మీరు బ్రాహ్మణ వంశంలో పుట్టినా కూడా రాక్షస లక్షణాలతో రాక్షసులై జీవిస్తారు" అని శాపం ఇస్తాడు. అయినా, ఒకసారి చూచుకుందాము అని అద్దం లోకి చూసి తనను తానే గుర్తించ లేకపోతాడు.*
*నారదముని శాపానికి గురైన సర్వ శాస్త్ర పారంగతులైన శివ పార్షదులు, "ఏది జరిగినా శివుని ఆజ్ఞ వల్లనే" అని ఎల్లప్పుడూ నమ్మి వున్నారు. అందువల్ల, ఈ నారదముని శాపం కూడా ఇప్పుడు శివుని ఆజ్ఞగానే అనుకుని మిన్నక వుండి పోతారు. తమ అధిపతి అయిన శివుని దగ్గరకు, "వ్యుప్తకేశాయ నమః" అనుకుంటూ కైలాసానికి చేరతారు.*
                                       
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు