విముక్తి సమానత్వం కోసం
అణచివేతలను వ్యతిరేకిస్తూ ఎప్పుడూ ఉద్యమిస్తూనే ఉండాలి
ఈ ఆధునిక కలియుగంలో
ఆగని అత్యాచారాలు పర్వాలు
పసిమొగ్గల్ని మొగ్గలోనే తుంచేసే కామాంధుల ఆగడాలు
పారాణి ఆరని నవవధువులు చావులు
వరకట్నపు చితిమంటల్లో పడ్డ శలభాలుగా మసైపోతున్న అబలల జీవితాలు
ఈ అన్యాయాలు
ఆగెదెప్పటికీ ..?
ప్రగతిశీల భావాలతో
కలిసి అడుగులేయని పాదాలు
ప్రశ్నించే గొంతులు మూగబోయి
చోద్యం చూస్తూంటే..
అన్యాయం (ఆ)న్యాయమై అమ్ముడవుతున్న సామాజిక మార్కెట్లో
న్యాయం కోసం వెతుకుతూ..
న్యాయ దేవత కండ్లకు గంతలు విప్పుదాం రండి
కీచక మృగాలు యధేచ్చగా సంచారం చేస్తున్న మానవా రణ్యంలో ఉన్న
ఓ సమాజమా మేలుకో..?
దృతరాష్ట్రుని వారసులైన పాలకుల్ని ప్రశ్నించు
అమలుకాని చట్టాలతో ఎంతకాలం నటిస్తారని..?
ప్రజారాజ్యం లో ఉన్నామని ఒక్కసారి గుర్తు చేస్తూ
శాసించే లక్ష్మణరేఖల మధ్య
గిరిగీసుకుని ఇంకా ఎన్నాళ్లు బ్రతుకుతాం..?
మనుధర్మ శాస్త్రం మగువలపాలిట శాపమయ్యింది
(అ)ధర్మ మైన ఈ భారతీయత మాకొద్దు
మనుగడ ప్రశ్నార్ధకమయి రేపటి అమ్మతనం ప్రశ్నిస్తుంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి