నుదుటితేజం;-మంజుల సూర్య, హైద్రాబాద్
రెప్పల రక్షణలో
కనుబొమ్మల కొండల మధ్య
మహారాణిలా ఆసీనురాలై
కురుల వింజామరల మధ్య సేదతీరుతూ
కనుపాపల చంద్రుల వెన్నెల చల్లదనాన్ని 
చవిచూస్తూ
శ్వాసల ఊగిసలాటలలో 
ఊయలలూగుతూ
స్వరతంత్రుల సంగీతఝరికి తలూపుతూ
పెదవుల చిరునగవును సిగపూలై ముడుచుకుని
ఫాలభాగాన్నంత ఆక్రమించి
చెక్కిలి మైదానంపై కెంపుల గుర్రాలను పరుగులెత్తిస్తూ
ప్రకృతి లాంటి పడతిని పాలిస్తూ
అరుణారుణ రవిబింబంలా 
ఉజ్వలంగా జాజ్వల్యంగా
విద్యుల్లతలా వెలుగులీనుతూ
వేకువను పంచుతూ ఒదిగిపోయిన
నీవొక దృశ్యరూప కేంద్రం
ఆకర్షక ప్రకాశ జ్ఞాననేత్రం
అందమంతాఎరుపురంగులో తళుకులీనుతున్నట్లు 
ఆగ్రహమంతా సమాయాత్తపరిచిన
ఆయుధాలుగా యుధ్ధానికి సన్నధ్ద మయినట్లు
రుద్రుడిలా మూడోకన్ను తెరిచినట్లు
సనాతన ధర్మానికి ప్రతినిధివైనట్లు
సంస్కృతికి ప్రతిబింబమైనట్లు
పదును రెండువైపులా ఉన్నట్లు
మురిపిస్తున్నావ్ కత్తిని ఝళిపిస్తున్నావ్
ఆధునికత ముసుగేసుకున్న
నాగరిక సమాజానికి 
నుదుటిపై బొట్టువైనట్లు...

కామెంట్‌లు