*భర్తృహరి సుభాషితములు - పద్యం (౦౫౪ - 054)*
 *సుజన పద్ధతి*
చంపకమాల:
*కరమున నిత్యదానము, ముఖంబున సూనృతవాణి, యౌఁదలం*
*గురుచరణాభివాదన, మకుంఠిత వీర్యము దోర్యుగంబునన్*
*వరహృదయంబునన్ విశద వర్తన, మంచిత విద్య వీనులన్*
*సురుచిరభూషణంబు లివి శూరులకున్ సిరి లేనియప్పుడున్!*
*తా:*
ఈ భూమి మీద మంచివారైన ధైర్య వంతులకు పరిస్థితుల వల్ల సంపదలు లేకపోయినా, ప్రతీ రోజూ తన చేతులతో దానము చేయడం, నోటి ద్వారా మంచి మాటలు మాత్రమే మాట్లాడటం, తలమీద చేతులు వుంచి చదువు చెప్పిన గురువులకు నమస్కారం చేయడం, తన భుజబలము చేత అవసరమైనప్పుడు శక్తి మేరకు పోరాడటం, మనసు లో మంచి అలోచన కలిగిన ప్రవర్తనను కలిగి వుండటం, మంచి శాస్త్రాలను తన చెవులతో ఎప్పుడూ వినడం, ఈ విషయాలు అన్నీ కూడా ప్రకృతి సిద్ధంగా అబ్బే ఆభరణాలు......... అని *"ఏనుగు లక్ష్మణకవి"* చెపుతున్నారు.
*భావం:*
•మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ జీవితాన్ని గడప గలిగితే అంత కంటే మంచి సంపదలు ఏ వ్యక్తకీ వుండదు. పెద్దలను గౌరవించడం, పద్ధతి గా వుండటం గురించి మనకు బాలభారతంలో భీష్మ పితామహుడు కారవ పాడవులకు నేర్పిన విధానం, లవకుశులకు వాల్మీకి మహర్షి నేర్పిన విధానం మనకు రామాయణ, భారతాలలో తెలుస్తాయి. ఇదే కాదు భారతంలో కృష్ణుని పట్ల విదుర మహాశయుడు, సంజయుడు, భీష్మపితామహుల ప్రవర్తన తో కూడా మనం తెలుసుకోవచ్చు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని వ్యామోహాలు చుట్టుముట్టినా, మన పద్దతులు, ఆచార వ్యవహారాలు పాటించడం మానేయకుండా వుండడమే మనకు ఎన్నో ఆభరణాలు వున్నట్టు. ఇటువంటి మంచి పరిస్థితి మనకందరకు పరమాత్మ కలిగించాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తూ...... .*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు