గౌహర్ జాన్ "రికార్డ్";-- యామిజాల జగదీశ్
 మన భారత దేశంలో మొట్టమొదటిసారిగా గ్రాంఫోన్ రికార్డుపై పాడిన గాయని గౌహర్ జాన్. 
ఆర్మీనియన్ దేశానికి చెందిన దంపతుల కుమార్తెగా 1873  జూన్ 26వ తేదీన ఉత్తరప్రదేశ్ లోని ఆజాంఘర్ జిల్లాలో జన్మించారు గౌహర్. ఆమె ముప్పయో ఏట పాడిన పాట గ్రాంఫోన్ రికార్డు  (78 rpm)
 లువడి చరిత్ర పుటలకెక్కింది. గాయని, నర్తకి అయిన గౌహర్ పాటలను గ్రాంఫోన్ కంపెనీ ఆఫ్ ఇండియా వారు ఎక్కువగా రికార్డు చేసి అమ్మేవారు.
గౌహర్ తాతయ్య బ్రిటన్ కు చెందిన వారు. ఆమె బామ్మ హిందువు. ఆమె తండ్రి విలియం హేవార్డ్. తల్లి విక్టోరియా హెమ్మింగ్స్. తల్లిదండ్రులు ఆర్మీనియన్ క్రైస్తవులు.
తల్లి విలియం శిక్షణ పొందిన నర్తకి. గాయని. కానీ దురదృష్టవశాత్తు ఆమె తల్లిదండ్రులు 1879లో విడిపోయారు. అప్పుడు గౌహర్ వయస్సు ఆరేళ్ళు. మొదట్లో ఆమె పేరు ఏంజిలినా. ఆమె తల్లి కలకత్తాలో మాలక్ జాన్ అనే అతనిని పెళ్ళి చేసుకున్నారు. ఆ తర్వాత విక్టోరియా ఇస్లాం మతం స్వీకరించారు. తల్లి పేరు బడీ మాలికా జాన్ గానూ, ఏంజిలినా పేరు గౌహర్ జాన్ గా పేర్లు మార్చుకున్నారు.
గాయనిగా తర్ఫీదు పొందిన గౌహర్ ఆనాటి రాజుల దర్బారులలో పాటలు పాడుతుండేవారు. మైసూరు మహారాజా ఆస్థానంలో ఏడాదిన్నర కాలం ఉండి పాటలు పాడి ప్రసిద్ధి పొందారు. 1902లో సన్మానం కింద ఆమె పొందినది మూడు వేల రూపాయలు.
ఎంతో విలాసవంతమైన జీవితం గడిపిన ఈమెకు పిల్లులంటే మహాఇష్టం. తన ఇంట ఓ పిల్లి పుట్టినప్పుడు ఆరోజుల్లో ఆమె ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి విందు ఏర్పాటు చేసారు.
గ్రాంఫోన్ రికార్డుల నిపుణుడు ఫ్రెడరిక్ విలియం గైస్బర్గ్ అనే ఆంగ్లేయుడు 1902 నవంబర్ పదకొండవ తేదీన కలకత్తాలోని ఒక హోటల్లో గౌహర్ జాన పాడగా రికార్డు చేసారు. ఈ రికార్డింగుకి ఆమె ఖరీదైన దుస్తులు ధరించి కొందరు కళాకారులతో తరలివచ్చిన తీరుని అప్పట్లో అన్ని పత్రికలూ ప్రముఖంగా ప్రచురించాయి. ఎంత బిగ్గరగా పాడగలరో అంత బిగ్గరగా పాడమని చెప్పి గైస్బర్గ్ ఆమె పాటను రికార్డు చేసారు. పాడటం పూర్తయ్యాక ఆమె పట్టరాని ఆనందంతో బిగ్గరగా అరుస్తూ  – “My name is Gauhar Jaan!” అని చెప్పుకున్నారు. ఈ రికార్డింగుతో ఆమె పేరు దేశమంతా తెలియవచ్చింది. 
ఆరోజుల్లో మహిళలు వేదికమీదకొచ్చి పాడేవారు కాదు. అయితే పలువురు మహిళల గొంతు విన్న గైస్బర్గ్ చివరకు గౌహర్ గొంతు నచ్చి ఆమెకు అరుదైన అవకాశం ఇచ్చారు.
నర్తకీమణిగా గాయనిగా విశేష ఆదరణ పొందిన గౌహర్ జాన్ జీవితం ఎగూడుదిగుళ్ళతో సాగింది. అనేక జబ్బులతో అవస్థపడిన గౌహర్ 1930 జనవరి 17వ తేదీన తన యాభై ఏడో ఏట తుదిశ్వాస విడిచారు. మైసూరులోని కె.ఆర్. ఆస్పత్రిలో ఆమె మరణించినప్పుడు  కన్నీళ్ళు పెట్టుకోవడానికి పక్కన ఏ ఒక్కరూ లేకపోవడం విచారకరం. 
గ్రాంఫోన్ రికార్డు అనగానే అప్పట్లో అందరికీ ముందుగా గుర్తుకొచ్చే పేరు గౌహర్ జాన్. 
ఆమె పేరిట ఆరు వందల రికార్డులు వెలువడటం ఓ సంచలనం. పది భాషలలో పాటలు పాడి అందరి మన్ననలు అందుకున్నారు.





కామెంట్‌లు