చాతుర్యం! అచ్యుతుని రాజ్యశ్రీ

 కేవలం తెలివితేటలు ఉంటే సరిపోదు. సమయసందర్భోచితంగా వాటిని ఉపయోగించి మనల్ని ఉక్కిరిబిక్కిరి చేసేవారిపనిపట్టాలి.మనసత్తా చాటాలి.శశివర్మ రాజు ఆస్థానంలోకి పొరుగురాజ్యంకి చెందిన మేధావి వచ్చాడు. అతన్ని అంతా మేధావి అని పిలవడం తో కాస్త గర్వం టెక్కు కూడా పెరిగింది. "ప్రభూ!నేను  దాదాపు  అన్ని రాజ్యాలు సందర్శించి మహామహా తెలివితేటలు గలవారి పనిపట్టాను.మీరాజ్యంలో నేను ఇచ్చే సమస్యలకు ఉదాహరణ సహితంగా నిరూపించినవారికి నాచేతి కంకణం మెడలో హారం బహూకరిస్తాను" అన్నాడు. రాజు  అలాగే అన్నాడు. "ప్రభూ! మీనగరంబైట ఉన్న  పెద్దశిలతో మండపం తయారు చేసి ఓమూడురోజులలోపు నాకు చూపాలి." సభ అంతా చీమచిటుకు మంటే వినపడేంతనిశబ్దం లో మునిగిపోయింది. సభలోఉన్న శివస్వామి "రెండు రోజుల సమయం చాలు"అని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.ఓపాతికమంది బలాఢ్యులు ఒక్క రోజు లో ఆశిలకు నాలుగు మూలలా నాలుగు లోతైన గుంటలు తవ్వారు. రెండోరోజు ఓయాభైమంది కూలీలు చకచకా ఆగుంతలలో స్తంభాలు  కట్టారు. ఇంకేముంది?ఆశిల ఎత్తుగా ఉన్న  మండపంలా మారిపోయింది.
దాన్ని చూసి మేధావి ఆశ్చర్యపోయాడు. "ప్రభూ!నాఇంకో ప్రశ్న ఇది.ఒక మేకను ఇస్తాను.దాని బరువు ఎక్కువ తక్కువ కాకూడదు. ఓపదిరోజులు దీని బరువు చూస్తాను.ఇవ్వాళ ఉన్న బరువే పదిరోజుల తర్వాత హెచ్చుతగ్గులు లేకుండా ఉండాలి".శివస్వామి దీనికి గూడా సై అన్నాడు.ఆమేకని చెట్టుకి కట్టేసి  దాని ఎదురుగా బోనులో తోడేలుని ఉంచాడు.మేకకి తిండి బాగా పుష్కలంగా దొరుకుతోంది.అది ఆకలితో ఆవురావురని తింటోంది.కానీ ఎదురుగా బోనులో తోడేలుకనపడటంతో భయంతో అది పొట్టనిండా తినలేకపోతోంది.అందుకే దాని బరువు పెరగలేదు  తరగలేదు.మనకి పరీక్షలు భయం టెన్షన్ ఉన్నా తిండి నిద్రమానలేము కదా! మేధావి ఈపరీక్షలో నెగ్గిన శివస్వామి వైపు ఆదరంగా చూశాడు."ఇదిగో శివా!కోడిపుంజుని నీకు ఇప్పిస్తా.ఇంకో పుంజు ఎదురుగా లేకుండా  ఇది కయ్యానికి కాలుదువ్వాలి.మరి అది ఇప్పుడే ఈసభలోనే చూపితీరాలి"అని సవాలు విసిరాడు. ఒక భటుడు మంచి పందెం కోడిపుంజు ని సభలోకి తెచ్చాడు.శివస్వామి దాని ఎదురుగా పెద్ద నిలువుటద్దం పెట్టించాడు.ఇంకేముంది!అది  ఇంకోపుంజు అనుకుని ఎగిరెగిరి తనప్రతిబింబాన్ని అద్దంలో చూస్తూ ముక్కు తో పొడవసాగింది.సభంతా జయజయధ్వానాలతో మార్మోగిపోయింది. మేధావి తన కంకణం మెడలో హారం  శివస్వామి కి అలంకరించి  ఆశీర్వదించాడు🌹
కామెంట్‌లు