విచిత్ర వీరుడు .పురాణ బేతాళ కథ..; - డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై

 విక్రమార్కుడు చెట్టువద్దకుచేరి శవాన్ని ఆవహించి ఉన్నబేతాళుని బంధించి భుజంపైనచేర్చుకుని నడవసాగాడు.
అప్పుడు శవంలోని బేతాళుడు ' మహరాజా నీ పట్టుదలమెచ్చదగినదే నాకు విచిత్ర వీర్యుని గురించి తెలియజేయి. తెలిసి చెప్పకపోయావో మరణిస్తావు' అన్నాడు.
' బేతాళా విచిత్ర వీర్యుడు భారతీయ మత గ్రంథాలలో ఒక రాజు. మహాభారతం ప్రకారం అతను శంతన మహారాజు, సత్యవతిలకు చిన్నకుమారునిగా జన్మించాడు. అతనికుమారులు దృతరాష్ట్రుడు, పాండురాజు . అతని మనుమలు కౌరవులు, పాండవులు. అతని భార్యలు అంబిక, అంబాలిక లు.
విచిత్రవీర్యునికి చిత్రాంగదుడు అనే అన్నయ్య ఉన్నాడు. వీరు శంతన మహారాజు రెండవ భార్య సత్యవతి కుమారులైనందున, శంతన మహారాజు మొదటి భార్య కుమారుడైన భీష్మునికి సోదరులవుతారు. శంతన మహారాజు మరణం తరువాత రాజ్యాన్ని పాలించడానికి భీష్ముడు చిత్రాంగదుడిని కురు రాజ్య సింహాసనంపై ఉంచాడు. అతను ఒక శక్తివంతమైన యోధుడు అయినప్పటికీ గంధర్వుల రాజుతో జరిగిన యుద్ధంలో మరణించాడు. ఆ తరువాత భీష్ముడు బాలునిగా ఉన్న విచిత్ర వీర్యునికి రాజ్య పట్టాభిషేకం చేసాడు.
యుక్త వయసుకు వచ్చిన తరువాత భీష్ముడు అతనికి కాశీ రాజు అందమైన కుమార్తెలైన అంబిక, అంబాలికలనిచ్చి వివాహం చేసాడు. విచిత్రవీర్యుడు తన భార్యలనెంతో ప్రేమించి, ఆరాధించేవాడు. కానీ ఏడు సంవత్సరాల తరువాత అతను అనారోగ్యంతో బాధపడ్డాడు. అతని స్నేహితులు, వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అతనికి నయం కాలేదు. అతని సోదరుడు చిత్రాంగదుని మాదిరిగా అతను సంతానం లేకుండా మరణించాడు. భరతవంశం వారసులను కోల్పోయిన తరుణంలో సత్యవతి భరతవంశ పునరుద్ధరణ కొరకు తన పుత్రుడైన వ్యాసుని మనన మంత్రం చే తన వద్దకు రప్పించింది. భరతవంశాన్ని నిలపమని వ్యాసునికి ఆదేశించింది. తల్లి ఆదేశాన్ననుసరించి వ్యాసుడు అంబికకు దృతరాష్ట్రుని, అంబాలికకు పాండురాజుని, దాశీకు విదురుని ప్రసాదించి తిరిగి తపోవనానికి వెళతాడు 'అన్నాడు విక్రమార్కుడు.
అతనికి మౌనభగంకావడంతో, శవంతోసహా మాయమైన బేతాళుడు తిరిగి చెట్టువద్దకు చేరాడు.పట్టువదలనివిక్రమార్కుడు బేతాళునికై వెనుతిరిగాడు.
కామెంట్‌లు