శాస్త్రీయ సంగీతాన్నేలిన జీ.ఎన్.బీ;-- యామిజాల జగదీశ్
 కర్ణాటక శాస్త్రీయ సంగీత చరిత్రలో "జీ.ఎన్.బీ" అనే మూడక్షరాలకూ ఓ ప్రత్యేక స్థానముంది. గాత్ర విద్వాంసుడిగా కృతికర్తగా నటుడిగా తన ప్రతిభాపాటవాలతో కీర్తిప్రతిష్ఠలు గడించిన జీ.ఎన్.బీ. పూర్తి పేరు గూడలూరు నారాయణస్వామి బాలసుబ్రమణ్యం. 
తమిళనాడులోని కుంభకోణం సమీపంలో ఉన్న గూడలూరు అనే కుగ్రామంలో 1910 జనవరి ఆరో తేదీన జీ.వీ. నారాయణ స్వామి అయ్యర్ దంపతులకు జన్మించారు జి.ఎన్.బి. అనంతరం చెన్నైలో స్థిరపడ్డారు. ఆయన తండ్రి తిరువల్లక్కేణి హిందూ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు. ఆయన ఓ సాంస్కృతిక సభను కూడా నడిపేవారు. దీంతో నాటి సంగీతకళాకారులతో జీ.ఎన్.బీకి మంచి పరిచయముండేది.
చిన్నతనంలో వినికిడి జ్ఞానంతోనే పలు కీర్తనలు పాడిన జీ.ఎన్.బీ ని న్యాయవాదిగా చూడాలని తండ్రి ఆశ. అయితే సన్నిహితుల సూచనలతో ఆయన తమ కుమారుడిని మదురై సుబ్రమణి అయ్యర్ వద్ద సంగీతం నేర్చుకోవడానికి ఏర్పాటు చేశారు. 
చెన్నై క్రిస్టియన్ కాలేజీలో ఇంగగ్లీషులో బి.ఎ. (హానర్స్)  ప్యాసైన జీ.ఎన్.బీ అన్నామలై విశ్వవిద్యాలయంలో టి.ఎస్. సబేశ అయ్యర్ ఆధ్వర్యంలో కొంతకాలం సంగీతం అభ్యసించారు. అనంతరం ఈయన
మద్రాసు విశ్వవిద్యాలయంలో ప్రారంభించిన తొలి ఏడాదే సంగీతంలో డిప్లొమా కోర్సుల చేరి సర్టిఫికెట్ పొందారు. అప్పుడు టైగర్ వరదాచారి ప్రిన్సిపాలుగా ఉండేవారు.
సంగీత జ్ఞానం ఉన్న జీ.ఎన్.బీకి వృత్తి, ప్రవృత్తి సంగీతమే కావడం యాథృచ్చికమే.
మైలాపూరులోని కపాలీశ్వర ఆలయంలో 1928లో ఓమారు ముసిరి సుబ్రమణ్య అయ్యర్ సంగీత కచేరీ చేయవలసి ఉంది. కానీ అనుకోని కారణాలతో ఆయన రాలేదు. అప్పుడు జీ.ఎన్.బీ ని పిలిచి కచేరీ చేయించారు. ఆయన అసాధారణ గాత్రం, స్వరజ్ఞానం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
చెన్నై మ్యూజిక్ అకాడమీలో ఆయన మొదటి కచేరీ జరిగింది. అనంతరం అనేక చోట్ల కచేరీలు చేసిన జీ.ఎన్.బీ సినిమాలలో నటించారు. ఆయన పాడిన పాటల క్యాసెట్లు వెలువడ్డాయి.
ఏదో పాడటమంటూ పాడకుండా కృతుల పట్ల రాగం పట్ల పల్లవి పట్ల పరిశోధధలు చేసాక కచేరీలు చేసేవారు.
ఆయన పాడటంలో ఏదో ఒక కొత్తదనాన్ని ప్రదర్శించేవారు. రాగాలాపనలో కొత్తదనముండేది.
ఎం.ఎల్. వసంతకుమారి, రొధా జయలక్ష్మి, త్రిచూర్ రామచంద్రన్ తదితర సంగీతకళాకారులందరూ ఆయన దగ్గర శిష్యరికం చేసినవారే. వారిన ఓ మిత్రుడిలా చూసుకునేవారు.వారి పురోగతికోసం వెన్నంటే ఉండేవారు. 
ఆయన చెన్నై ఆలిండియా రేడియో నిలయంలో కర్ణాటక సంగీత విభాగానికి డెప్యూటీ చీఫ్  ప్రొడ్యూసర్ గా దీర్ఘకాలం  కొనసాగారు.
ఆ రోజుల.లో గ్రాంఫోన్ రికార్డుకోసం పాడేందుకు కొందరు కళాకారులు ఆలోచించేవారు. అయితే ఈయన హర్చిన్స్ గ్రాంఫోన్ ప్లేట్ విద్వాంసుడిగా ఓ ముద్ర వేసుకున్నారు. ఆయన పాడిన వాసుదేవయని....అనే పాట గ్రాంఫోన్ రికార్డుగా వెలువడి భారీ స్థాయిలో అమ్ముడుపోయింది.
ఆయన పలు కీర్తనలు రాశారు. అలాగే పలు కొత్త రాగాలు కనిపెట్టారు. 
తమిళ, తెలుగు, సంస్కృతం భాషలలో రెండు వందల యాభై కృతులు రాశారు. ఈ కృతులను రెండు సంపుటాలుగా ముద్రించారు.
జీ.ఎన్.బీ బాణీ అనే స్థాయిలో ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చిన ఈయన సినిమాలలో గాయకుడిగా పేరు గడించారు 
శకుంతలై, సతీ అనసూయ, ఉదయనన్, రుక్మాంగదుడు, బామా విజయం తదితర చిత్రాలలో నటించిన జీ.ఎన్.బీ హృదయం విశాలమైనది. ఎందరికో తన వంతు సహాయసహకారాలందించిన జీ.ఎన్.బీ 1965 మే ఒకటో తేదీన తన యాభై అయిదో ఏట కాలధర్మం చెందారు. 
1940లో విడుదలైన శకుంతలై సినిమాలో ఈయన దుష్యంతుడి పాత్రలో నటించగా భారతరత్న ఎం.ఎస్. సుబ్బులక్ష్మి శకుంతల పాత్ర పోషించారు.
ఆయన జీవితచరిత్రపై లలితా రామ్ ఓ పుస్తకం రాశారు. అనేక కోణాలలో ఆయనను పాఠకులకు పరిచయం చేసారు లలితా రామ్. కర్ణాటక సంగీతం తెలియనివారికి కూడా ఈ పుస్తకం చదంవుతుంటే అంతో ఇంతో సంగీత జ్ఞానం అబ్బుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. కీర్తనలు వినాలనే ఆసక్తిని పుట్టించే పుస్తకమిది. ఆయన ఉపయోగించే పరిమళద్రవ్యం, కారు, ఇష్టపడి తినే వంటకాలు, ఆయన కోసం ఆగిన రైలు ఇలా ఎన్నో ఎన్నెన్నో విషయాలతో కూడిన పుస్తకమిది.


కామెంట్‌లు