శ్రీ కృష్ణ దేవ రాయలు (ఖండిక ); గాయత్రీ , పూణే
 చంపక మాల //
1.  మరియొక రాయలున్ గనము మంచి తనంబుకు మారు పేరు మా
తరతరముల్ తలంచెదము తానొనరించిన రాజ్యపాలనన్
స్థిరముగ గ్రంథముల్ చదివి తెల్గున కావ్యము పల్కి భక్తిగన్
బరమ పదంబు చేరె నతడు పావన మూర్తియె కృష్ణ రాయలున్ //
2.   సీసము //
 భారతీ గళమున బంగారు హారాన రాయలు పొదిగిన రత్న మైన
యాముక్త మాల్యాద యద్భుత కావ్యంబు
ప్రౌఢకవితకిది పట్టు గొమ్మ 
చతుర భాషణములు సరస సమాసముల్
కడు రమ్యమైనట్టి కవన జలధి 
పరమ పూజిత మైన భక్తిరసలహరి 
పులకరించిన "గోద" వలపు  పాట//
తేటగీతి //
లలిత పదబంధమై మది రంజిలంగ
హొయలు కురిపించు కథనము నియతి తోడ
తెలుగు భాషామ తల్లికి తిలక మద్ది 
కృష్ణ రాయలు పలికిన విష్ణు చరిత//
శ్రీకృష్ణదేవరాయలు (ఖండిక )
3.    చంపక మాల //( మాలిక )
బలమగు శౌర్యసంపదలు భానుని కైవడి వెల్గు జిమ్మగన్
దెలుగున కావ్య తేజమట దిక్కుల నంటెను జోత్స్న పోలికన్ 
విలువగు రత్నముల్ విపణి వీధుల రాశులు బోసిరత్తరిన్
దెలిసి విదేశిముఖ్యులట తీరిరి బారుగ నుప్పతిల్లుచున్
బలుపలు రీతులన్ బొగడి  పశ్చిమ వాసులు విస్తుబోయి రా
కలిమిని గూర్చి వ్రాసిరట గ్రంథము లెన్నియొ పొంగి పోవుచున్
దెలితెలి కీర్తి కాంత యట దేవ సమానుడు కృష్ణ రాయనిన్
వలచి వరించి వచ్చె కన వైభవ మంతయు నద్భుతంబగున్ //
శ్రీ కృష్ణ దేవ రాయలు (ఖండిక )

4.   చంపక మాల //(పంచ పాది )
ఘనమగు నాంధ్ర భాష యను గంగను మున్కలు వేసి పొంగుచున్
ప్రణతిని విష్ణు గాథలను పండితులందరు మెచ్చు రీతిగన్
మునుకొని చెప్పె కావ్యమును ముక్తిని పొందగ కృష్ణరాయలున్ 
మనసున దల్చి కావ్యరసమాధురి నంతయు నద్భుతంబుగన్
గనుకొని వందనంబిడెద గౌరవ మొప్పగ నాంధ్రభోజుకున్ //
5.మత్తేభవిక్రీడితము //
పరమాత్ముండగు శౌరికిన్ దన మనోభావంబులన్ బ్రీతితో
నెఱుగంజేసె సుధార్ణవంబగు కథన్ కృష్ణాంకితంబై భువిన్
సరసంబైన కవిత్వమై లలితమై సాహిత్య సంపూజ్యమై
తరముల్ నిల్చెడి కావ్యమున్ దెలుగునన్ దా పల్కె నా రాయలున్ //
6.  కందము //
శ్రీకృష్ణదేవరాయలు
మా కవికులదీపుడయ్యె మాన్యత మీరన్
లోకంబున కీర్తిమిగిలె
భూకాంత మురిసి వెలిగెను భూవరు గాంచన్//
7. కందము //
వంపులు తిరిగెడు తుంగను 
సొంపగు శిల్పకళ నాహ!చూచిన ఘనమౌ
హంపిని యేలిన రాజుల
సంపద గత వైభవంపు ఛాయలు కదిలెన్ //
 8.చంపక మాల //
తరతమ బేధముల్ గనని ధర్మ పరుండగు కృష్ణ రాయనిన్
గురుతుగ చెప్పి కొంద్రు తన గొప్పతనంబును పెద్ద నార్యులున్
వరముల నిచ్చు వేల్పు వలె భారత దేశము నందు వెల్గె నా
చరితము దల్చు కొంచు మనసారగ మ్రొక్కెద సార్వభౌమునిన్ //
 9.తేటగీతి //
అష్ట దిగ్గజముల ఠీవి యద్భుతంబు
కావ్య రచనలు చేయుచు కదను దొక్కి 
వింత సోయగముల నద్ది పేరు నిలిపి
తెలుగు కీర్తిని వెలిగించె దిశల యందు //

కామెంట్‌లు