*భర్తృహరి సుభాషితములు - పద్యం (౦౭౪ - 074)*
 *పరోపకార పద్ధతి*
శార్దూలము:
*నీతిప్రౌఢవిహారు లైననిపుణుల్ నిందింపనీ మెచ్చనీ,*
*ఖ్యాతిం జెందినసంపదల్ నిలువనీ గాఢంబుగా సాగనీ,*
*ఘాతం బప్పుడ పొందనీ నియతిమైఁగానీ యుగాంతంబునన్,*
*నీతిశ్లాఘ్యపదంబు దప్పరు గదా నిత్యంబు ధీరోత్తముల్.*
*తా:*
నీతిని నమ్ముకుని బ్రతుకు గడపాలి అనుకునేవారు, పొగిడినా పట్టించుకోరు. తిట్టినా పట్టించుకోరు. డబ్బులు వచ్చినా, చావు వచ్చినా కూడా పట్టించుకోరు. యుగాంతము వస్తుంది అని తెలిసినా పట్టించుకోరు. ధైర్యంగా నీతిని నమ్ముకుని, ఆ నీతి మార్గంలో నడవాలి అనుకునేవారు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఆ నీతి మార్గాన్ని వదిలిపెట్టరు........... అని *"ఏనుగు లక్ష్మణకవి"* చెపుతున్నారు.
*భావం:*
*నీతి మియమాలు ధర్మాలు పాటించి నిలువెత్తు ధర్మానికి ఆదర్శమూర్తిగా నిలిచిన రామచంద్రమూర్తి కంటే మనకు ఆదర్శంగా ఎవరు వుండగలుగుతారు. తనకు చెందవలసిన రాజ్యాధికారాన్ని భరతకునకు ఇమ్మంటే తృణప్రాయంగా ఇచ్చి వేసాడు, రామభద్రుడు. రాచమర్యాదలూ, రాజ్య భోగాలు వదలి అడవిలో అర్ణ్యవాసం చేయాలి అని తండ్రి మాటగా పిన్నమ్మ చెప్పినా, అడవిబాట పట్టిన వాడు రామచంద్రుడు. అడవిలో తన సతీమణిని ఎత్తుకు పోయిన రావణునితో ధర్మ యుద్ధం చేసిన ధర్మ మూర్తి, వైరి విరోధి రాముడు. ఇంతటి నీతిమంతుడు, ధర్మమార్గమున నడచిన ఆదర్శ మూర్తి రామభద్రుని ఆశీస్సులు మెండుగా మనకు వుండాలి అని, ఆ నీతి మార్గంలో మనము కూడా ప్రయాణించి మంచి వారుగా గుర్తింపబడేలా అనుగ్రహించాలని ఆ సీతారాముని ప్రార్థిస్తూ..... .*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు