*పరోపకార పద్ధతి*
ఉత్పలమాల:
*జానుగ భూతికిం దొడవు సజ్జన భావము, శౌర్యలక్మికిన్*
*మౌనము, నీతి విద్యకు, శ మంబు సుబుద్ధికి, విత్తవృద్ధికిన్*
*దానము, దాల్మిశక్తికిని దర్మనిరూఢి కదంభవృత్తియుం*
*బూనికతోడ సర్వగుణ భూషణ మెన్నఁగ శీలమే సుమీ.*
*తా:*
సంపదలు వున్నా కూడా మంచి వాడుగా వుండాలి. ఎంత వీరుడైనా తక్కువగా మాట్లాడుతూ, మౌనాన్ని కూడా పాటించాలి. చదువులు నేర్చుకున్నవారు, నీతి మంతులుగా వుండగలగాలి. మంచి బుద్ధి తో వున్నవారు, ఓర్పు, సహనమూ కూడా కలిగి వుండాలి. ఎక్కువగా డబ్బు కలిగినవారు అవసరమైన వారికి దానము చేసే లక్షణం కలిగి వుండాలి. బలము వున్నవారు ధర్మాన్ని ఆచరించే వారు గా వుండాలి. పరిశీలించి చూస్తే, ఈ లక్షణాలు ఎన్ని వున్నా, మంచి గుణము కలిగివుడటం మాత్రమే అన్నిటి కన్నా గొప్పది.......... అని *"ఏనుగు లక్ష్మణకవి"* చెపుతున్నారు.
*భావం:*
*రాముడు సర్వ లక్షణ సమన్వితుడు అయినా వినయము అనే గుణము కలిగి వుండటము వల్ల మహిమాన్వితుడుగా కొలవబడ్డాడు. అర్జునుడు, అరివీర భయంకరుడు అయినా పెద్దలు, గురువుల యెడ గౌరవము, భక్తి కలిగి, భగవానుని యందు వినయము తో కూడిన అనురక్తి కలిగివున్నాడు కనుకనే అన్ని వేళలా విజయుడుగా నిలిచి సార్ధక నామధేయుడు అయ్యాడు. రావణుడు, కాదు, కాదు. రావణ బ్రహ్మ, పులస్త్య బ్రహ్మ మనవడు. వేదవేదాంగాలు చదివినవాడు. ఎన్నో విధాల గొప్పవాడు. కానీ, పరకాంతా వ్యామోహం అనే లక్షణం అతణ్ణి బలహీనుడిగా చేసి సర్వమూ కోల్పోజేసింది. అందువల్ల, మన మనుగుడకు మన నడవడిక మంచిగా వుండాలి అనేది నిశ్చితము, నిర్ద్వందము. మన ప్రవర్తన మంచిగా వున్నంత వరకూ మనకు పరాత్పరుని తోడు ఎల్లప్పుడూ వుంటుంది. మనం వక్రమార్గంలోకి వెళుతుంటే, చేయి పట్టుకుని సర్వేశ్వరుడే మంచి దారిలోకి తీసుకు వెళతాడు. అంతటి దయామయుడు, సర్వాంతర్యామి, మనల్ని అన్ని వేళలా, అన్ని పరిస్థితులలో ఒక కాపు కాసి వుండమని, వుండాలని ప్రార్థిస్తూ ....... .*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి