శివమహా పురాణం భాగం : 9..; - డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
 మహాకాళేశ్వరం – ఉజ్జయిని
అవంతికాయాం విహితావతారం, ముక్తి ప్రదానాయచ సజ్జనానాం!
అకాల మృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాల మహాసురేశం!! (ద్వాదశ జ్యోతిర్లింగస్తోత్రం – 3)
ఈ శ్లోకం ద్వారా ఉజ్జయినిలో ఉన్న మహా కాళుడికి నమస్కారం చేస్తున్నాము. సజ్జనులకు ముక్తినిచ్చువాడు. అయితే సజ్జనుడు అనగా ఎవరు? పరమేశ్వరార్చన చేసేవాడికి సదాచారము తెలిసి ఉండాలి. శౌచము తెలిసి ఉండాలి. ఈ సదాచారం పథ్యం లాంటిది భగవద్భక్తి ఔషధం లాంటిది. ఈ ఔషధం వేసుకుని పథ్యం పాటిస్తే భవరోగమనే రోగం తగ్గుతుంది. కానీ లౌకికంగా బయటవచ్చే వ్యాధికి, భగవత్సంబంధంలో వచ్చే భవరోగమునకు ఒక తేడా ఉంది. ఒకనికి ఆచారం, శౌచం తెలియదు. తెలిసి మానిన వాడు కాదు. కానీ ఆయన గుండెల నిండా భక్తి ఉంది. కానీ శౌచం లేకపోయినా వాని భక్తి వృధా పోదు. సదాచారం తెలిసీ దానిని విడిచిపెట్టి భక్తిని పాటిస్తే అది మాత్రం అతని అక్కరకు రాదు. ఆచారం తెలిస్తే పాటించాలి. తెలిసి ఉన్నది అనుష్ఠాన పర్యంతం రావాలి. ఏమీ తెలియనప్పుడు ఆచారమయినా అది తెలియక పొరపాటు చేసినా ఈశ్వరుడు దానిని పక్కన పెట్టి ఏలుకుంటాడు. మాహాకాళ దర్శనమునందు ‘సజ్జనానాం’ అనేమాట ఎందుకు వాడారో గుర్తెరిగి ప్రవర్తించాలి. అందుకే మహాకాళుడన్నమాట. కామమును పోగొట్టు వాడు, కాలారి, కామారి అనే రెండు మాటలను పరమశివునికి వాడతారు. కాలారిగా అనుగ్రహం కావాలన్నా, కామారిగా అనుగ్రహం కావాలన్నా మీకున్న స్థాయిలో అనుష్ఠానమునకు తెచ్చుకుని మాత్రమే ఈశ్వరుని యందు ప్రవర్తించాలి. పూర్వకాలంలో ఉజ్జయినికి అవంతి అని పేరు. అవంతి అనగా స్త్రీ అని, అక్క అని రెండు అర్థములు. అవంతి సాక్షాత్తు జగదంబ అయిన అమ్మవారి స్వరూపము. మనకి మోక్షపురులు ఏడు ఉన్నాయి. వీటిలో జగద్విఖ్యాతి గాంచిన పట్టణం అవంతి – ఉజ్జయిని. ఈ ఉజ్జయిని ఒకపక్క మహా కాళుడి చేత ఎంత ప్రసిద్ధి పొందిందో మహాకాళి చేత కూడా అంత ప్రసిద్ధి పొందింది. ఇక్కడ ఉన్న రెండు స్వరూపములు కూడా కాల స్వరూపములై ఉన్నాయి. ఇవి లయకారకములై ఉంటాయి. ఉజ్జయిని ఒకానొకప్పుడు అంతర్జాతీయ ఖ్యాతిని చూరగొన్న పట్టణం. భోజరాజు, మహాకవి కాళిదాసు ఇద్దరూ నడయాడిన ప్రాంతం ఉజ్జయిని. పూర్వకాలంలో ఈ ఉజ్జయిని పట్టణంనందు వేదప్రియుడు అనబడే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ వేదప్రియుడు త్రికాలములయందు సంధ్యావందనం చేస్తూ శివార్చనా శీలుడై శాత్కాలముల యందు శివపూజ చేసి వేదము ఏమి చెప్పిందో దానియందు అపారమయిన ధృతి కలిగిన బ్రాహ్మణుడు. వేదప్రియుడికి నలుగురు కుమారులు. నలుగురు సుగుణోపేతులే. తండ్రిగారు ఎంత ధర్మానుష్టాన పరుడో కొడుకులు కూడా అంతటి ధర్మానుష్టాన పరులు. దొరికిన దానితో తృప్తిగా జీవించేవారు. ఆయన పెద్ద కొడుక్కి దేవప్రియుడు, రెండవ వానికి ప్రియ మేథుడు, మూడ వానికి సుకృతుడు, నాల్గవ వానికి సువ్రతుడు అని పేర్లు పెట్టుకున్నాడు. ఆ నలుగురు పిల్లలు వృద్ధిలోకి వచ్చారు.
ఆ పక్కనే ఉన్న పర్వత శిఖరములలో ఒక రాక్షసుడు బయలుదేరాడు. ఏదయినా కష్టం వచ్చినప్పుడే పరీక్షకు నిలబడినప్పుడే వాటి వాటి వ్యక్తిత్వములు ప్రకాశించి నిలబడతాయి. కాబట్టి ఈశ్వరుడు ఆ కుటుంబమును ప్రకాశింపచేయాలనుకున్నాడు. భగవంతుడు భక్తుల యెడ అంత ఉదారుడై ఉంటాడు. దూషణుడు అనే రాక్షసుడు లోకం అంతటా బాధలు పెడుతూ అందరినీ ఇబ్బంది పెడుతూ చిట్టచివరకు ఎక్కడా ఎవరూ ఈశ్వరార్చన చేయలేని స్థితిని కల్పించాడు. ఒక్క ఉజ్జయినిలో మాత్రం ఈ నలుగురు పిల్లలు శివార్చన చేస్తున్నారు అని తెలుసుకుని వాళ్ళ దగ్గరకు వచ్చి మీరు నన్ను మాత్రమే అర్చించాలి, మీరు శివపూజను విదిచిపెడతారా లేక లింగమును ధ్వంసం చేయనా? అని అడిగాడు వాళ్ళు కనీసం బెదరకుండా శంకరుని రక్షణ యందు మనం ఉండగా మనకు భయం ఏమిటి అని వాళ్ళు అనుకున్నారు. దూషణుడు ఈ నలుగురు బ్రాహ్మణుల మీద కత్తి ఎత్తి కంఠం మీద వేయబోతున్నాడు. అయినా వాళ్ళు కదలకుండా హర ఓం హర అంటూ అలానే ఆరాధన చేస్తూ కూర్చున్నారు. ఏ రూపంలో వస్తున్న మృత్యువునైనా ఈశ్వరుడు తప్పించగలడు. ఇక్కడ ఉన్న చిన్న పార్థివ లింగం నుండి మహాకాళ స్వరూపంతో పరమేశ్వరుడు బయటకు వచ్చాడు. ఇప్పుడు చూడబడే రూపం సామాన్యమయిన రూపం కాదు. స్వామి మహాకాళ రూపంలో వచ్చి ఒక్కసారి హుంకరించాడు. ఆ హుంకారమునకు దూషణుడి సైన్యములు బూడిద రాశులై పడిపోయాయి. ఆ రూపము అత్యంత వేడితో వచ్చింది కానీ ఆ వేడి అక్కడే కూర్చున్న బ్రాహ్మణ కుమారులను చెనకలేదు.బ్రాహ్మణ కుమారులు ఆ రూపమును చూసి ఆశ్చర్యం పొంది చచ్చిపోయే వారిని చంపకుండా మిగిల్చిన రూపంగా భావించి స్తోత్రం చేశారు. ఈశ్వరానుగ్రహం ఉన్నవాడికి అపమృత్యువు లేదు.
ప్రదోష వేళలో శివమహాపురాణాంతర్గతంగా ఇటువంటి క్షేత్రములకు సంబంధించిన మాటలు చదవడం చేత మీరు శాబ్దికంగా ఉజ్జయినిలో మహాకాళ దర్శనం చేసినట్లే. ఆ ఫలితం ఉత్తరక్షణం మీ ఖాతాలో పడిపోతుంది. పిమ్మట ఆ స్వూపాన్ని చూసి దేవతలు పొంగిపోయారు. వాళ్ళందరూ వచ్చి స్తోత్రం చేశారు. ‘ఈశ్వరా, మీరు ఇక్కడ లింగరూపంలో వెలవండి. కేవలం ఈ బ్రాహ్మణ కుమారులే కాక మిమ్మల్ని నమ్మిన వారెందరో ఉంటారు. సజ్జనులు, నీమీద పూనిక ఉన్నవాళ్ళు, నీవు ఉన్నావని నమ్మినవాళ్ళు ఎవరు ఇక్కడకు వస్తున్నారో వారు కాలమునందు పడిపోకుండా చూడవలసిన బాధ్యతా అటువంటి అనుగ్రహ ప్రసరణ కొడకు నీవు ఇక్కడ స్వయంభూ లింగముగా ఉండాలి అని అడిగారు. అప్పుడు స్వామీ తప్పకుండా ఉంటాను అని ప్రసన్న మూర్తియై వెంటనే మహా కాళ లింగముగా ఆవిర్భవించాడు.
ఉజ్జయినిలో శివలింగములు మూడు అంతస్తులుగా ఉంటాయి. క్రిందను ఉండేది మహాకాళ లింగము, మధ్యలో ఓంకార లింగము, ఆపైన నాగేంద్ర స్వరూపమయిన లింగము ఉంటాయి. క్రింద ఉండే మహాకాళ లింగమును భక్తులు వెళ్లి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఉజ్జయినిలో ఈ శివలింగం దగ్గరే ఒక ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. చంద్రసేనుడు అనే ఒక మహారాజు ఉజ్జయినీ రాజ్యమును పరిపాలిస్తున్నాడు. గొప్ప శివభక్తుడు. ప్రతిరోజూ శివార్చన చేసేవాడు. ఈ శివార్చనకు మెచ్చి పరమశివునికి అత్యంత సన్నిహితుడయిన మణిభద్రుడు చంద్రసేనుడికి ఒక మణిని బహూకరించాడు. ఈ మణిని నీవు కంఠంలో పెట్టుకుంటే ఇది రాగి, ఇనుము, ఇత్తడి దేనిని తగిలినా అవి బంగారంగా మారిపోతాయి. దేశంలో క్షామం ఉండదు. అతివృష్టి ఉండదు. నీ దేశంలో అందరూ సుభిక్షంగా ఉంటారు అని చెప్పాడు. చంద్రసేనుడు ఆ మణిని కట్టుకుని తిరుగుతూ ఉండేవాడు. మిగిలిన రాజులందరూ ఆ రాజు ఎందుకు అలా సుఖపడుతున్నాడో తెలుసుకుని ఆయన వద్దవున్న మణిని ఎత్తుకు వచ్చెయ్యాలని భావించారు. అందరూ కలిసి చంద్రసేనుడి మీదికి యుద్ధానికి బయలుదేరారు. లోపల వున్న వేగుల వలన విషయంతెలుసుకున్న రాజు యుద్ధం చేస్తే గెలవడం చాలా కష్టం అని గ్రహించి యుద్ధానికి వెళ్ళడం అంటే నాకు సంతోషమే. కానీ లోకంలో ఉన్న రాజులందరూ కట్ట కట్టుకుని వస్తే నేను ఏకాకిని’ అన్నాడు. ఆయనయందు ధర్మలోపం లేదు. యుద్ధం చేయడానికి వచ్చిన రాజులలో ధర్మలోపం ఉంది. కాబట్టి తానిప్పుడు ఏం చేయాలా అని ఆలోచించి ఎవరు నాకీ మణిని ఇవ్వడానికి కారకుడో వాడి పాదములే నేను గట్టిగా పట్టుకుంటాను అని భావించి వెంటనే దేవాలయమునకు వెళ్లి పూనికతో శివారాధన చేయడం ప్రారంభించాడు. ఆ సమయంలో ఆయన భక్తి పరిఢవిల్లి ఉంది.
ఆ సమయంలో ఒక గోపాల బాలుడు దేవాలయంలో దర్శనం చేసుకోవడానికి వచ్చాడు. ఆ పిల్లవాడు తల్లితో కలిసి లోపలి వచ్చి నమస్కారం చేసి బయటకు వెళ్ళిపోయారు. ఇద్దరూ దర్శనం చేసినా గోపకాంత మనసు చిన్నపిల్లవాడి మనస్సంతగా భగవంతుని యందు కేంద్రీకరించబడలేదు. రాజు చేస్తున్న పూజను చూసిన పిల్లవాడు తానుకూడా అలాగే పూజచేయాలి అనుకున్నాడు. కానీ వాడికి పూజ చేయడం రాదు. వాడు తల్లితో ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ వాని దృష్టి అంతా రాజు చేస్తున్న లింగార్చన మీద ఉంది. ఇప్పుడతడు అర్చన చేయడానికి శివలింగం కోసం వెతకగా ఒక గుండ్రాయి కనిపించింది. వాడు దానిని రాయిగా కాక శివలింగంగా చూశాడు. పూజచేయడం రాదు కాబట్టి చుట్టుపక్కల చెట్ల నుంచి కొన్ని ఆకులు తెచ్చి పూజచేయడం ప్రారంభించాడు. రాజు చేస్తున్న పూజయందు సదాచారం ఉంది. కానీ ఈ పిల్లవాడు చేసున్న పూజయందు సదాచారం లేదు. కానీ భక్తి ఉంది. వాడికి అభిషేకం, పురుషసూక్తం తెలియదు. నైవేద్యం లేదు. కానీ వాడు ఒక్కొక్క ఆకు తీసి శివ అంటూ వేస్తున్నాడు. వాడు మనస్సులో అలాగే మహాకాళ లింగానికి పూజ చేస్తున్నాడు. పిల్లవానికి అన్నం పెడదామని గొల్లవనిత వచ్చి పిలిచినా వాడికి ఇవేమీ వినపడలేదు. నటిస్తున్నాడు అని ఆవిడకి కోపం వచ్చింది. గుండ్రాయిని తీసి విసిరి అవతల పారేసింది. ఆకులన్నిటిని కాలితో తోసేసింది. ఇంట్లోకి రా అన్నం పెడతాను అని లోపలికి వెళ్ళిపోయింది.
పిల్లవాడు కళ్ళు తెరిచాడు. ఎదురుగుండా ఉన్న శివలింగం కనపడలేదు. వెంటనే ఆర్తితో ఏడ్చాడు. ఇప్పుడు వారు రమ్మని తన స్వామిని పిలుస్తున్నాడు. స్వామీ కనపడలేదన్న బెంగతో మూర్ఛపడిపోయాడు. తనకోసం ఇంత పరితపించిపోయిన పిల్లవానిని శంకరుడు చూశాడు. అక్కడ బంగారు కాంతులతో గోపురంతో ఒక పెద్ద దేవాలయం, పెద్ద శివలింగం ఏర్పడ్డాయి. పిల్లవాడు బంగారు పువ్వులు తాపడం చేయబడిన పీటమీద పట్టు పంచెతో కూర్చుని పూజ చేస్తున్నాడు. వానికి సమస్తమయిన శివజ్ఞానము భాసించింది. తల్లికి ఆ ఘోష వినపడి బయటకు వచ్చి చూసి తెల్లబోయింది. నా వంశమే తరించిపోయిందిరా తండ్రీ ఈ పూజ చేశావని నాకు తెలియదు అని వెళ్లి బిడ్డడిని కౌగాలించుకుంది. ఆనందపడిపోయింది. ఈ సమయంలో స్వామి హనుమ అక్కడ ఆవిర్భవించి ఒకమాట చెప్పారు “ఎవడు నొసట భస్మరేఖలను పెట్టుకుంటాడో, లలాటమునందు బొట్టు పెట్టుకుంటాడో మెడలో రుద్రాక్షమాల దాల్చి ఉంటాడో నాలుక చివర శివనామము పలుకుతున్నాడో వానికి మోక్షము కరతలామలకము. ఈ పిల్లవాడికి ఏమీ తెలియక పోవచ్చు. కానీ పరమేశ్వరుడిని నమ్మాడు. దీనివలన ఈతడు పొందబోయే భాగ్యం ఏమిటంటే గొప్పగొప్ప వాళ్ళందరూ ఈ గొల్లవంశంలో పుడతారు. యితడు గొప్ప ఐశ్వర్యమును అనుభవిస్తాడు. వీని పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎనిమిది తరములు గడిచిన తర్వాత సాక్షాత్తు పరబ్రహ్మమే గోపాలబాలుడై ఈ భూమి మీద నడయాడతాడు. అపుడు ఈ బాలుడు నందునిగా శ్రీకృష్ణ పరమాత్మకు తండ్రి అనిపించుకుంటాడు. మీ వంశం అటువంటి వంశం కాబోతోంది’ అని హనుమ ఆనాడు శివభక్తి విశేషమును ఆవిష్కరించి వెళ్ళాడు.
ఈవార్త ఊరంతా పాకింది. ఈవార్త బయట విడిది చేసిన శత్రు సైన్యములకు తెలిసింది. ఇది నిజంగా అలా ఏర్పడినది అయితే మాలో కొంతమంది ప్రతినిధులం స్నేహంగా లోపలికి వస్తాం మాకు చూపించండి అని రాజుకు కబురు పంపారు. అపుడు రాజు వారిని లోపలికి తీసుకువెళ్ళి దేవాలయదర్శనం చేయించాడు. ఇంత భక్తి పరిపుష్టి కలిగిన గోపాల బాలుడు ఈ రాజ్యంలో ఉంటే మన బతుకులు ఏమవుతాయో, మన వంశములు ఏమవుతాయో అని చంద్రసేనుడికి నమస్కారం చేసి వెళ్ళిపోదాము అని యుద్ధం చెయ్యకుండా వెనుతిరిగి వెళ్ళిపోయారు. చంద్రసేనుడు హాయిగా రాజ్యం చేశాడు. ఈవిధంగా ఆ ఉజ్జయిని యందు మహాద్భుతమయిన మహాకాళేశ్వరుని దేవాలయం ఆవిర్భవించింది.
ఉజ్జయిని యందు సంవత్సరమునకు ఒకసారి వర్షాకాలమునకు ముందర ‘పర్జన్యానుష్టానము’ అని చేస్తారు. వర్షములు బాగా పడాలని, పంటలు బాగా పండాలని మహాకాళేశ్వరాలయంలో కూర్చుని అనుష్ఠానం చేస్తారు. ఇది పూర్తి అవగానే ఆకాశంలో నల్లటి మబ్బులు పట్టి వర్షం కురుస్తుంది. ఇప్పటికీ ఉజ్జయినిలో ఈ తంతు కొనసాగుతోంది. అంత గొప్ప ఆలయం ఆ ఆలయం.
ఈ ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు వెలిసిన ప్రాంతం క్రిందనే శంఖ యంత్రం అనే యంత్రం ఉన్నది అని పెద్దలు నమ్ముతారు. శంఖం విజయమునకు గుర్తు. అందుకే కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం ముందు ధృతరాష్ట్రుడు సంజయుడిని కౌరవులు ఏమి చేస్తున్నారని అడుగుతాడు. అపుడు సంజయుడు పాండవులు శంఖములు ఊదుతున్నారు అని చెప్పాడు. ఎవరు శంఖమును ఊదాడో వానికి విజయం కలుగుతుంది. మహాకాళేశ్వరుని క్రింద శంఖయంత్రం ఉంది. అందుకని ఆయన దగ్గరకు వెళ్ళి దర్శనం చేసుకున్నవాడు ఎటువంటి విజయమునయినా పొందుతాడు. అపమృత్యుదోషం పోతుంది. ఎటువంటి కోర్కెలు అయినా తీరతాయి. అక్కడి అమ్మవారికి అవంతిక అని పేరు. ఇక్కడ ఉండే కాళికాదేవి ఒక కోటలో ఉంటుంది. ఆవిడ రాత్రివేళ పట్టణం అంతా సంచరించి తెల్లవారే సరికి దేవాలయంలోకి వెళ్ళిపోతుంటే కాళిదాస మహాకవి వెళ్లి తలుపులు వేసుకుని లోపల కూర్చున్నాడు. తెల్లవారి పోతోంది. లోపల కూర్చున్న ఆయన తనకు జ్ఞానం ఇవ్వమని అమ్మవారిని ప్రార్థించాడు. అపుడు అమ్మవారు కాళిదాసును తలుపు సందులోంచి నాలుకను బయట పెట్టమని చెప్పి ఆయన అలా పెట్టగానే నాలుక మీద బీజాక్షరములను రాసింది. అప్పుడు మహానుభావుడు తలుపులు తీసి అమ్మవారి మీద శ్యామలాదండకం చేశారు. ఈ విధంగా కాళిదాస మహాకవికి జ్ఞానమబ్బిన క్షేత్రము ఉజ్జయిని క్షేత్రం.
ఇప్పటికీ ఎన్ని వేల సంవత్సరముల నుంచో ఉజ్జయినిలో ఉన్న అంతరాలయమునందు రెండు జ్యోతులు వెలుగుతుంటాయి. ఈ రెండు జ్యోతులను అఖండ దీపములు అని పిలుస్తారు. ఈశ్వరుడిని మీరు దానిలో చూడవచ్చు.
ఉజ్జయిని దేవాలయంలో భస్మమందిరం అని ఉంది. అక్కడ ఆవుపేడతో విభూతిని తయారుచేస్తారు. భస్మ మందిరంలోనికి ఆవులను తీసుకువచ్చి ఆవులు వేసిన పేడను ఎంత వరకు కాలిస్తే అది చక్కటి విభూతిగా మారుతుందో అటువంటి విభూతిగా మార్చి ఆ విభూతితో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఈ విభూతి అభిషేకం రెండు రకములుగా ఉంటుంది. తెల్లని పల్చటి బట్టలో మెత్తటి విభూతిని పోసేసి మూట కట్టి ఆ మూటను పట్టుకుని కొడతారు. అలా కొట్టినప్పుడు ఒక్క శివలింగం ఉన్నచోటే కాదు అంతరాలయం అంతా భస్మంతో నిండిపోతుంది. అలా నిండిపోతున్నప్పుడు శంఖముకు, భేరీలు, పెద్ద పెద్ద మృదంగములు ఇవన్నీ మ్రోగిస్తారు. అపుడు అక్కడ మీరు ఒక అలౌకికమయిన స్థితికి వెళ్ళిపోయినా అనుభూతిని పొందుతారు. రెండవ రకం అభిషేకంలో అభిషేకం చేసుకోవాలి అనుకున్న పురుషులను సాంప్రదాయక వస్త్రాలతో తెల్లవారు జామున దేవాలయంలోపలికి పంపిస్తారు. అప్పుడు శ్మశానంలో కాలిన శవభస్మమును అర్చకులు పట్టుకు వచ్చి చుట్టూ కూర్చును ఆ శవ భస్మంతో అభిషేకం చేస్తారు. అప్పుడు నిజంగా మనం కైలాసపర్వతం మీద కూర్చున్నట్లే ఉంటుంది.
అసురసంధ్య వేళలో మహాకాళేశ్వరుడికి చిత్రవిచిత్రమయిన నీరాజనములను ఎత్తుతారు. దానికోసం ప్రత్యేక మహంతులు వస్తారు. ఈ దీపారాధనతో కూడిన జ్వాలని నీరాజనంగా చూపించేముందు ఇక్కడ ఒక నియమం ఉంది. మహా కాళేశ్వరుడికి సమీపంలోనే మరొక శివలింగం ఉంది. ఆ శివలింగం పేరు కోటేశ్వర మహాకాళుడు. ఆయనకు ముందు పూజ చేస్తే తప్ప అసలు మహా కాళుడికి పూజచేయడం నిషిద్ధం. కాబట్టి ముందు కోటేశ్వర మహా కాళుడికి నీరాజనములను ఎత్తుతారు. తరువాత కాళేశ్వరుడికి ఇస్తారు. అందుకని ఉజ్జయినిలో కోటేశ్వర మహాకాళ దర్శనం కూడా చేయవలసి ఉంటుంది.
ఏడాదికొక్కసారి స్వామివారు సవారీ వెడతారు. ఆయన కారుణ్యమునకు పరాకాష్ఠ ఈ సవారీ ఉత్సవం. దీనిని ఊరేగింపు/ఊరెరిగింపు అంటాం. అపుడు ఉజ్జయిని జిల్లా కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్, ఎన్నికయిన మంత్రి ఎవరయినా లేదా పరిపాలన చేసే మంత్రి ఈ ముగ్గురు ప్రతి ఏటా స్వామివారి సవారీ ఉత్సవమునకు వచ్చి తప్పనిసరిగా సవారీని మోయాలి. కొన్ని వేల సంవత్సరములనుంచి ఇదే ఆనవాయితీ.
ఉజ్జయినిలో శివరాత్రినాడు స్వామి పెళ్ళికొడుకు అవుతాడు. అపుడు ఆయన పుష్ప కిరీటం పెట్టుకుని పెళ్ళికొడుకు అవుతాడు మహాశివరాత్రి వెళ్ళిపోయిన మరునాడు ఈ అలంకారం అంతా తీసేసి మరల భస్మాభిషేకమును అందుకుంటారు. అటువంటి సవారీ జరుగుతుంది. అక్కడే బలరామ కృష్ణులు ఇద్దరూ సాందీపని మహాముని ఆశ్రమంలో విద్యాభ్యాసం చేశారు. ఈవిధంగా ఉజ్జయిని అన్నిరకములుగా ప్రకాశిస్తున్నది. అటువంటి దివ్యక్షేత్రమును జీవితంలో ఒక్కసారయినా దర్శనం చేసి, అక్కడ కొన్నిరోజులు గడిపి, జన్మసార్థకం చేసుకోవాలి.

కామెంట్‌లు