సంతాల్ చిత్రకళ;-కంచనపల్లి వేంకట కృష్ణారావు--9348611445
   మనదేశంలో రకరకాల జానపద కళలు ఉన్నాయి.అటువంటిదే పశ్చిమ బెంగాల్ గిరిజన తెగల్లో పుట్టిన 'సంతాల్ చిత్ర కళ'. ఈకళను బీహార్, ఒరిస్సాల్లో కూడా చూడవచ్చు. ఈ కొండజాతులు వారి తీరిక వేళల్లో అధ్బుత చిత్రాలు సృష్టించారు.
        వీరు సంతాలీ భాష మాట్లాడుతారు. ఈభాషకు లిపి లేదు.పండిట్ రఘునాథ్ ముర్ము ఈ భాషకు లిపి సృష్టంచారు దీనినే ol chiki లిపి అంటారు.
      ఈ చిత్ర కళలో వారు మనుషుల్ని,పక్షుల్ని, చేపల్ని,జంతువులని పార్శ్వ(side)ముఖంగా చిత్రీకరిస్తారు! వీటికి రంగులను వారే తయారు చేసుకుంటారు. కొన్ని రకాల ఆకులు, పువ్వులు, ఎర్రరంగు రాయినుండి తయారు చేసిన ఎర్రరంగు, దీపపు మసినుండి చేసిన నల్ల రంగులతో చిత్రీకరిస్తారు ఈ రంగులను కలిపి కొన్ని రకాల కొత్త రంగుల్ని సృష్టిస్తారు! ఒకే చిత్రంలో బోలెడు మంది మనుషులు, వాద్యాలు,పక్షులు, చేపలు వంటివి సృష్టించడం వీరి ప్రత్యేకత. ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఈ చిత్రాలను వారు అనేక ఊళ్ళకు తీసుక వెళ్ళి ప్రదర్శించి ఆ చిత్రాలకు తగిన పాటలు పాడుతూ డబ్బు సేకరిస్తారు.అక్కడి ప్రజలు వీరిని ఆదరిస్తారు.
      ఈ మధ్య వీరు 'ఆక్రిలిక్' వంటి రంగులను ఉపయోగించి చిత్రాలు సృష్టిస్తున్నారు. వీరి చిత్రాలు క్లుప్తతో, గాఢ రంగుల కలయికతో ఎంతో అందంగా ఉంటాయి.
      ఈ సంతాల్ జాతి వారు 'మరంగ్ బురు, బోంగా' (సూర్య అంశ) దేవతలను కొలుస్తారు. వీరు చాలా ధైర్యవంతులు, అప్పట్లో  వీరు బ్రిటిష్ సైన్యంలో సైనికులుగా పని చేశారు.వాద్య పరికరాలు,కళాత్మక బుట్టలు,చాపలు తయారు చేస్తారు. వారి తెగకు సంబంధించిన నృత్యం, సంగీతం ఆనందంగా అనుభవిస్తారు!
      ప్రముఖ చిత్ర కారుడు జామినీ రాయ్(1887-1972) మీద సంతాల్ చిత్రకళ ప్రభావం చూడవచ్చు. జార్ఖండ్ లో  ఈ జాతివారు ఎక్కువగా నివశిస్తున్నట్టు 2001 జనాభా లెక్కల లెక్కింపు తెలుపుతోంది.
      ఆ కొండజాతి వారి హృదయాల్లోంచి పుట్టిన ఈ చిత్రకళకు ఎంతో ఆదరణ ఉంది,కొన్ని ప్రదర్శన శాలలు ఈ చిత్రాలను భద్రపరిచాయి.
      ఈ చిత్రాలు సేకరించి మన డ్రాయింగ్ రూముల్లో పెట్టుకుంటే ఆ అందమే వేరు!
                 **********కామెంట్‌లు