అమ్మాయి పెళ్లి;- ఎం. వి. సత్యప్రసాద్ , 9398155633
 హారికా అక్కడ కాఫీ పెట్టాను తాగావా వంటింట్లోంచి కేక వేసింది మాధవి.  మాధవి హారిక తల్లి. ఇల్లే కైలాసం  వంటిల్లే వైకుంఠం ఆమెకు .  ఒకరకంగా చెప్పాలంటే ఆమె అలా ఉండబట్టే ఆ ఇల్లు , నివసించే ఇల్లు అని చెప్పే విధంగా ఉందని చెప్పాలి.  హారిక ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. పేరుకు ఆడ పిల్ల అన్న మాటే గాని , ఇంటిపనిలో ఏమాత్రం వాళ్ళ అమ్మకు సహాయం చెయ్యదు.  చిన్న కూతురు మల్లిక ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది . మల్లిక మటుకు అమ్మ కు కాస్త చెయ్యి అందిస్తుంది . చేదోడు వాదోడు గా ఉంటుంది. ఇక రంగారావు , హారిక తండ్రి ఆయనకు ఆఫీస్ తప్పించి ఇంటిగోడవె పట్టదు.  అన్నీ ఇంటిపనులు బయటిపనులు అన్నీ మాధవి చూసుకోవాల్సిందే.
హారికా కాఫీ తాగావా, గుర్తుచేసింది మాధవి.
తాగితే గ్లాసు ఇటు పట్రా.  కేకవేసింది మాధవి వంటింట్లోంచి.
హు ... అనుకుంటూ కాఫీ తాగిన గ్లాసు తీసుకెళ్లి వంటింట్లో సింకు దగ్గర పెట్టింది హారిక
ఏమిటే , అంత విసుగు గ్లాసు తెమ్మంటే,  అడిగింది మాధవి.
ఎం లేదులే అనేసి వెళ్ళిపోయింది హారిక .
హారిక పూర్తి టెన్షన్ లో ఉంది చదువుకుంటూ.  రెండు రోజుల్లో యేవో కంపెనీల వాళ్ళు వస్తారట క్యాంపస్ సెలెక్షన్స్ కి.  ఏమి అడుగుతారో , తాను ఎం చెపుతుందో అన్న టెన్షన్, భయం .  ఈ అవకాశం చెయ్యి జారిపోతే మళ్ళా ఉద్యోగం కోసం ఎన్నో పాట్లు పడాలి.
హారిక నాన్న గారు పోస్టల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు.  అన్నిపనులు నెత్తిన వేసుకుని చేస్తుంటాడు.  క్షణం తీరిక లేదు , దమ్మిడీ ఆదాయం లేదు అన్న సామెత ఈయన కు సరిగ్గా సరిపోతుంది.  కానీ తన పద్దతి లోనే వెడతాడు.  ఆయనకు వచ్చే జీతం తో మాధవి ఈ సంసారాన్ని జాగత్తగా నెట్టుకు వస్తోంది.
కాంపస్ సెలక్షన్ రోజు రానే వచ్చింది.  హారిక బాగా ప్రిపేర్ అయిందనే చెప్పాలి.  ఉన్నవాటిలో మంచి డ్రెస్ సెలెక్ట్ చేసుకుని కాలేజీ కి రెడీ అవుతోంది. ఇక మాధవి హడావిడి చెప్పక్కర లేదు.  అన్ని గుర్తుచేస్తూనే ఉంటుంది .  దేవుడికి దణ్ణం పెట్టుకుని వేళ్ళు. కేకవేసింది మాధవి,
అలాగే లేమ్మా అంది హారిక.
లంచ్ బాక్స్ మర్చిపోకు గుర్తుచేసింది మాధవి చెయ్యి తుడుచుకుంటూ.
నాన్న వెళ్ళొస్తా చెప్పింది నాన్నకు హారిక.
ఇక రంగారావు చెప్పటం మొదలు పెట్టాడు జాగత్తలు .
అబ్బా ...తెలుసులే నాన్న అంటూ దీర్ఘం తీసింది హారిక.
లేదమ్మా .. ఎంత ప్రిపేర్ అయినా అక్కడిదాకా వచ్చేసరికి కంగారు పడతారు.  ఆ కంగారు వద్దు,  నిదానంగా ప్రశాంతం గా ఉండు, అలాగే వాళ్లకు జవాబులు ఇవ్వు అన్నాడు రంగారావు.
థాంక్యూ నాన్న, వస్తానమ్మ అంది హారిక దేవుడికి దణ్ణం పెట్టడం అయ్యాక
 అల్ ది బెస్ట్ తల్లి ... చెప్పాడు రంగారావు. జాగ్రత్తమ్మా అంది మాధవి , అల్ ది బెస్ట్ అక్కా చెప్పింది మల్లిక .
అందరికీ బై చెప్పి బయలుదేరింది హారిక.
 
హారిక వెళ్ళిపోయాక , మాధవి భర్త రంగారావు తో ..మా పుట్టింటి వైపు ఒకళ్ళు హారికకు సంబంధాలు చెబుతున్నారండి అంది  కాఫీ గ్లాసు అందిస్తూ ఇప్పుడే దాని పెళ్ళికి తొందరేంటి అన్నాడు రంగారావు .
మీరట్టాగే అంటారు ఇప్పటినుండే సంబంధాలు చూడక పొతే ఎప్పటికి అయ్యెను అంది మాధవి .
కానీ దాన్ని చదువు పూర్తి చేసి ఏదో నాలుగు రాళ్లు స్వయం గా సంపాదించు కొనీ,  తర్వాత చూద్దాం అన్నాడు.  రంగారావు కాస్త స్వతంత్ర భావాలు కలవాడు. ఒకరకంగా చెప్పాలంటే మాధవి రంగారావు ల పెళ్లి కూడా పెద్దవాళ్ళు చేసినా ప్రేమవివాహం లాటిదే .  మాధవి ని ఏదో పెళ్ళిలో చూసి మాధవిని తప్ప ఎవరినీ చేసుకోను అని పట్టుబటికి చేసుకున్నాడు రంగారావు. మాధవి కూడా అప్పటికి బీకామ్ పాస్ అయింది, ఇక పైచదువులు చదివించకుండా , గవర్నమెంట్ ఉద్యోగస్తుడని ఇచ్చి పెళ్లి చేశారు.
కాఫీ తాగండి .. గుర్తు చేసింది మాధవి
ఏదో ఆలోచన లోకి వెళ్ళిపోయాడు రంగారావు.
సాయంతం గెంతులేస్తూ చెప్పింది హారిక , అమ్మానేను సెలెక్ట్ అయ్యాను అని ఎంతో సంతోషం గా ,  ఇన్ఫోసిస్ లో వచ్చింది  అంటూ . పోనీలెమ్మ చాలా సంతోషం దేవుడు దయ చూపాడు అంది మాధవి.  నాన్నగారికి కూడా ఫోన్ చేసి చెబుతాను అంటూ ఫోన్ తీసుకుని చెప్పింది.  నువ్వు కాకపొతే ఎవరు సెలెక్ట్ అవుతారు నాన్న అంటూ ఫోన్ లోనే చాలా సంతోష పడ్డాడు రంగారావు.
ఒకరోజు అప్పోయింట్మెంట్ లెటర్ వచ్చింది వెంటనే వచ్చి జాయిన్ అవ్వమని. కానీ హైదరాబాద్ లో పోస్టింగ్. వీళ్ళు ఉండేది అమలాపురం లో. అంత దూరం పంపించాలా, అంటూ నసపెడుతూనే ఉంది మాధవి. ఆడపిల్లని ఒక్కతిని అంత దూరం పంపించడం ఎందుకు అని ఆమె ఉద్దేశ్యం. రంగారావు అలాకాదులే భయపడవద్దు,  లేడీస్ ఉండటానికి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ ఉంటాయి , అందులో ఉండొచ్చు అని సర్దిచెప్పాడు.
వీళ్ళు కూడా ఎప్పుడూ అమ్మాయిని ఒక్కత్తినే ఎక్కడ కనీసం చుట్టాలింట్లో కూడా ఉంచలేదు.
రంగారావు రెండు రోజులు సెలవు పెట్టి హారిక తో హైదరాబాద్ కు వెళ్లి అక్కడ హాస్టల్ వసతి అన్నీ మాటాడి  అమ్మయికి హాస్టల్ సెట్ చేసి వచ్చాడు.
పిల్లను వదిలి అసలు ఉండలేదు మాధవి.  రోజు ఫోన్ చేసి మాటాడుతుంది. 
హారిక  ఒకసారి  ' ఏంటమ్మా రోజు ఎం కబుర్లు ఉంటాయి చెప్పడానికి ' అంటూ విసుక్కుంది.
ఏదోలేవే మా కంగారు మాది, ఒక్క దాన్నే పంపాము , ఎలా ఉన్నవో ఏంటో అంటూ ఫోన్ చేస్తాము అంది.  కాకపొతే ఆఫీస్ విషయాలు ఏమి అడగడు మాధవి.
హారిక తోపాటు పనిచేసే మరో అమ్మాయి నిర్మల ఫోన్ నెంబర్ కూడా అడిగి తీసుకుంది మాధవి . ఒక్కోసారి ఫోన్ మోగుతూనే ఉంటుంది , కానీ ఫోన్ తీయదు హారిక. అపుడు హారిక స్నేహితురాలు నిర్మల కు ఫోన్ చేసి మాటాడుతుంది మాధవి.  హారిక సంగతులు రంగారావు నేరుగా హారిక తో మాటాడకపోయినా మాధవి ని ప్రతిరోజు అడుగుతాడు. పిల్లలంటే మహాప్రేమ రంగారావు కు. ఆడపిల్లలు పెద్దవాళ్లయ్యాక తల్లి చూపిస్తుందేమో కానీ తండ్రి రంగారావు , ప్రేమను నేరుగా దగ్గరకు తీసుకుని చూపడు కానీ , ఆప్యాయత , అనురాగం పిల్లల మీద బాగా చూపిస్తాడు.
రోజులాగానే ఫోన్ చేసింది మాధవి హారిక కు.
ఎన్ని సార్లు రింగ్ అయినా ఫోన్ తీయటం లేదు హారిక.
వెంటనే నిమ్మల కు ఫోన్ చేసింది .
నేను అక్కడ ఇన్ఫోసిస్ లో పని చెయ్యట్లేదు అంటి , నేను హాస్టల్అ కాళీ చేశాను, ఇపుడు బెంగుళూరు లో పనిచేస్తున్నాను,  అంది.
ఓరి భగవంతుడా , అని చాలా మదన పడుతోంది మాధవి.
ఇంతలోనే ఫోన్ మోగింది , హారిక చేస్తోంది.
ఏవిటే ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ తీయవు అంటూ కేకలెయ్యడం మొదలుపెట్టింది.
అమ్మా .. కంగారు పడకు,  అరవకు . నేను హాస్టల్ ఖాళీ చేసాను అంది హారిక .
ఎందుకే బాగానే ఉందిగా అడిగింది మాధవి.
లేదమ్మా అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. అందుకే ఖాళీ చేసాను అంది హారిక.
మరెక్కడుంటావే , అడిగింది మాధవి విసుగ్గా.
లేదమ్మా నాతో పని చేసే మరొక అమ్మాయి నేను , ఇంకో ఇల్లు అద్దెకు తీసుకున్నాము .  మాతో పాటు  పనిచేసే మరో ఇద్దరు మగవాళ్లు కూడా మాతో పాటు ఉంటారు అంది హారిక.
చిర్రెత్తుకొచ్చింది మాధవికి.
పెళ్లికాని పిల్లవి , పరాయి మగాళ్ల తో ఒకే ఇంట్లో ఉండటం ఏమిటే,  ఎవరైనా వింటే యమన్నాఉందా .  పెళ్లి కావాల్సిన దానివి నీకు బుద్ధి ఉందా . ఆవేశం తో అరిచింది మాధవి .
అమ్మా ఏమి కాలేదు , ఏమీ కాదు నీకు అన్నీ వివరంగా చెబుతాను. ప్రస్తుతానికి పనిలో ఉన్నాను , మళ్ళీ  చేస్తాను అని ఫోన్ పెట్టేసింది హారిక.
ఏం పిల్లలో , ఏం ఉద్యోగాలో అనుకుంటూ పనిలో పడింది మాధవి .
ఏమోయ్,  ఓ కప్పు కాఫీ ఇవ్వు అడిగాడు రంగారావు ఆఫీస్ నుండి రాగానే భార్య వైపు చూస్తూ.
కాళ్ళు కడుక్కు రండి , ఇస్తాను . బయటనుండి వచ్చారు అసలే కరోనా అంటున్నారు అంది మాధవి .
 
హారిక కు ఫోన్ చేసానండి అంది కాఫీ కప్పు అందిస్తూ.
ఏంటిట సంగతులు అడిగాడు రంగారావు
తాను హాస్టల్ ఖాళీ చేసి ఎదో ఇల్లు తీసుకుందిట అంది మాధవి .
ఒక్కదానికి ఇల్లు ఎందుకట అన్నాడు రంగారావు
లేదండి దీనితోపాటు పనిచేసే వాళ్ళు కూడా ఉంటారట. వీళ్ళు ఇద్దరు ఆడవాళ్లు , మరో ఇద్దరు మగవాళ్లు ఉంటారట అంది మాధవి,
తలెత్తి చూసాడు రంగారావు మాధవి వైపు ప్రశ్నర్ధకంగా.
మగవాళ్ళతో కలిసి ఉండటమేంటి అడిగాడు రంగారావు
ఏమో నాకు తెలీదు , అదేమన్నా సరిగా చెప్పి ఛస్తే గదా వివరంగా అడగటానికి.  అదేదో మీరే కనుక్కోండి అంది మాధవి.
సరేలే నేను మాట్లాడుతానులే అన్నాడు రంగారావు .
 
హారిక ఇంటికి షిఫ్ట్ అయ్యాక , కొత్త ఇల్లు, ఇంట్లో మళ్ళీ కొత్త మనుషులు , అదీకూడా భ్రమ్మచారులు.  ఒకరకంగా సౌకర్యం, మనింట్లో ఉన్నట్లే  ఉంటుంది.  కాకపొతే ఎవరి రూముల్లో వాళ్లు ఉంటారు . తనతో పాటు తన డిపార్ట్మెంట్ లోనే పనిచేసే అమ్మాయి రమ్య ఉంటుంది.
 
జెంట్స్ రూమ్ లో రఘు గారు,  సునీల్ గారు ఉంటారు.  ప్రస్తుతానికి వాళ్లిద్దరూ నైట్ షిఫ్ట్ లో పనిచేస్తున్నారు. తానూ , రమ్య పగటిపూట పనిచేస్తాము. కాబట్టి వాళ్ళిద్దరితో ప్రాబ్లెమ్ లేదు.  వాళ్లిద్దరూ హారిక , రమ్య కన్నా సీనియర్స్.  వాళ్ళు వేరే డిపార్ట్మెంట్ లో పనిచేస్తారు.  నిజానికి వాళ్ళు మొదటినుంచి ఈ ఇంట్లో ఉంటున్నారు .
 
హారిక ఆలోచనలో పడింది. రఘు ఇంజినీరింగ్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసాడు . అతని ఆలోచనలు అన్ని కొత్తగా అనిపిస్తాయి. అర్ధం కావు. ఈ కలిసి జీవించడం పద్దతి కూడా అతనే చెప్పాడు.  నెలరోజులు గడిచాక గాని ఒక నిర్ణయం తీసుకోలేక పోయాము .  రమ్య ను కూడా థానే ఒప్పించాల్సి వచ్చింది. అందరం కలిసేది వీకెండ్ లోనే. శని ఆది వారాలు కలిసి ఉంటాము.  పాపం రఘు పొద్దున్నే నైట్ షిఫ్ట్ నుండి రాగానే  కాఫీ పెట్టేస్తాడు . మేము లేచే సరికి కాఫీ ఉంటుంది.  ఇప్పటికి మూడు నెలలు గడిచినా ఎప్పుడూ నాతోగానీ, రమ్యతో గానీ అసభ్యంగా ప్రవర్తించ  లేదు.  మాకూ మగతోడు ఉన్నారు లే  అనిపిస్తుంది.
అమ్మ వాళ్లకు సర్ది చెప్పడమే కష్టం . అయినా రోజులు గడిచే కొలదీ రఘు గారి మీద గౌరవం పెరుగుతోంది. ఎక్కడ తొణకడు, తానేమిటో బయటపడ్డాడు. ఛ.. తనేమిటి ఇలా ఆలోచిస్తోంది  అనుకుంటూ చిన్నగా నిద్రలోకి జారుకుంది హారిక.
 
ఇక రఘు పరిస్థితి ,  తన డిపార్ట్మెంట్ లో కొలీగ్ లు ,  ఎలా ఉంది సహజీవనం అంటూ ఒకటే ప్రశ్నలు.
ప్రతి ఒక్కరూ ఏదో రొమాన్స్ విషయం బయటకు వస్తుందన్న ఆశతో ప్రశ్నలు, సెటైర్లు వేస్తుంటారు.  కానీ రఘు అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు.
ఈమధ్య రఘు కూడా పరధ్యానం లోకి వెళ్ళిపోతున్నాడు.  ఆలోచనలు హారిక మీదకు వెడుతున్నాయి .  కానీ ఎక్కడ హారిక గమనిస్తుందో నని జాగ్రత్తపడతాడు. అందరూ కలిసేది శని ఆదివారాలు మటుకే. కానీ రఘు, సునీల్ ఇద్దరు లిమిట్స్ లో ఉండే మాటాడుతుంటారు . హారిక, రమ్య పరిస్థితి కూడా అలాగే ఉంది.
మరో మూడు నెలలు గడిచాయి . నలుగురికీ ఒకరి మీద ఒకరికి నమ్మకం పెరిగి కాస్త చనువుగా మాటాడుకోవడం మొదలయ్యింది. రఘు, హారిక లకు ఇద్దరికీ ఒకరి గురించి మరొకరు ఆలోచించడం మొదలుపెట్టారు.  హారిక తనకు తెలీకుండానే రఘు మీద మనసు పారేసుకుందేమో అనిపిస్తోంది తనకు . మరి రఘు పరిస్థితేంటో తెలీదు. అతను ఎక్కువగా మాట్లాడడు. అంతే మళ్ళీ మామూలే . ఎవరిపనులు వారివి.
హారిక కోసం అడిగాడు తన రూమ్మేట్ రమ్యను రఘు. లేదు రెండు రోజులు లీవ్ పెట్టి ఇప్పుడే వెళ్ళింది వాళ్ళఊరికి .. చెప్పింది రమ్య.
అలాగా అన్నాడు రఘు
ఏంటి విషయం ఏమయినా చెప్పాలా,  ఫోన్ చేయాండి అంది రమ్య.
వద్దులెండి అంత ఇంపార్టెంట్ ఏం కాదు అన్నాడు రఘు.
విషయం చెప్పకుండా అర్జెంటు గా బయలుదేరి రమ్మన్నది అమ్మ , నాన్న గారికి ఎలా ఉందొ ఏమో. అనుకుంటూ. ఏదయినా ఉంటె ఫోన్ లో చెప్పేది కదా ఇంట అర్జెంటు గా రమ్మనటం ఏమిటి అనుకుంటూ కూర్చుంది బస్సు  లో రమ్య అమలాపురం వెళ్ళడానికి.
ఉదయం 6 గం కు చేర్చాడు అమలాపురం.  ఇక్కడాపు బాబు అంటూ ఆటో అబ్బాయికి చెప్పి సుఇటుకేసి దింపుకొని డబ్బులిచ్చి పంపించి తానూ ఇంట్లోకి వచ్చింది. అప్పటికే అమ్మ లేచి కాఫీ పెడుతోంది అనుకుంటా కాఫీ స్మెల్ ఘుమ ఘుమలాడుతోంది
త్వరగా మొహం కడుక్కు రావే కాఫీ తాగుదువు గానీ  అంది మాధవి.
నాన్న ఇంకా నిద్ర లేవలేదనుకుంటా మాట వినబడటం లేదు.
మాటాడుతోందే కానీ అమ్మ చూపుల్లో కొరకొర, మాటల్లో చురుకులు తెలుస్తున్నాయి.
ఏంటమ్మా ఇంత అర్జెంటు గా రమ్మన్నావు అడిగింది హారిక కాఫీ గ్లాసు అందుకుంటూ.
మీ నాన్నను అడుగు అంది మాధవి.
 
సామాన్యం గా అందరూ ఫామిలీ విషయాలు ఎక్కువగా రాత్రి భోజనం చేసేటప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర మాటాడు కోవటం మొదటినించి అలవాటు.
ఎమ్మా ఎంతసేపయింది వచ్చి, నిద్ర లేచి రూమ్ లోంచి బయటకు వస్తూ అడిగాడు రంగారావు హారిక వైపు  చూస్తూ.
అరగంట అయింది నాన్నా, జవాబిచ్చింది హారిక.
 
బ్రష్ చేసుకున్నారా  , అడిగింది మాధవి రంగారావు ని .
ఆ అయింది అన్నాడు రంగారావు
కాఫీ గ్లాసు అందుకుని అడిగాడు రంగారావు మాధవిని , ఎమ్మా ఎలావుందీ హైద్రాబాద్ , ఇంకా ఇప్పుడుంటున్న ఇల్లు.  పిల్లలతో ఏది మాట్లాడిన చాలా సౌమ్యంగా మాట్లాడుతాడు రంగారావు .
బావుంది నాన్నా చెప్పింది హారిక.
అయినా ఎవరో ముక్కూ మొహం తెలియని మొగాళ్ళతో కలిసి ఒకే ఇంట్లో ఉండటం ఏమిటే, అదేంటో సహజీవనం అని మొదలుపెట్టారు అంది మాధవి.
ఏంలేదు నాన్నా , మేము ఉండేది 2 బెదురూమ్ ఫ్లాట్, ఒక రూమ్ లో నేను, నాతోకలిసి రమ్య , తాను నాతో పాటు పనిచేస్తోంది , మేమిద్దరం ఉంటాము. మరొక రూమ్ లో మా సీనియర్స్ ఇద్దరు జెంట్స్ ఉంటారు. అందరం కలిసి వాడుకునేది హాలు, వంటిల్లు అంతే. ఎవరూ హద్దులు దాటారు నాన్నా  అంది మాధవి. .
ఇంటిలోపల ఎలా ఉన్నారు అన్నది లోకం చూడదు కదమ్మా,  ఆడ , మగా కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు అంటుంది.  మనం అందరికేదగ్గర సూటి పోటీ మాటలు పడాలి అన్నాడు రంగారావు.
నువ్వు చెప్పింది నిజమే నాన్నా , ఒక మగా, ఒక ఆడ కలిసి ఉంటె తప్పుచేస్తామేమో అనే భయం ఉంటుంది . నాతోపాటు రమ్య కూడా ఉంటుంది, అదీకాక మేము కంట్రోల్ లో ఉంటాం నాన్నా.  ఈరోజుల్లో సాఫ్ట్ వేర్ రంగం లో పనిచేసే వాళ్ళు ఇలాకూడా ఉంటున్నారు, మగా వాళ్ళు ఉంటె సెక్యూరిటీ ఎంత లేదో, అంతే సెక్యూరిటీ కూడా ఉంది. భర్త ని కోల్పోయిన ఆడవాళ్లు, భార్యను కోల్పోయిన మగవాళ్ళు కలిసి ఉంటున్నారు. పెళ్ళిచేసుకుంటే ఆస్తులు పంచాల్సి వస్తుందని ఈపద్దతి ఫాలో ఆవుతున్నారు. ఇష్టం లేని నాడు ఎవరి దారి వారికి.  ఆడవాళ్లు పెళ్లి పేరుతో బానిసల్లాగా బతక అవసరం లేదు. పెళ్లి చేసుకోక పోయినా ఆత్మాభిమానం తో బ్రతకొచ్చు. ఈ మధ్య సుప్రీమ్ కోర్ట్ కూడా ఇలా కలిసి ఉండొచ్చు అని రూల్ పాస్ చేసింది. నేనేదో రూల్స్ మాట్లాడుతున్నాను అనుకోకండి నాన్నా , విషయం చెప్పాను , నన్ను నమ్మండి అంది హారిక.
నీమీద నమ్మకం లేక కాదమ్మా, రేపు ఇదే నీ వైవాహిక జీవితం లో కూడా నిన్ను, మమ్మల్ని కూడా  ఇబ్బంది పెట్టకుండా ఉండాలి.  మన ఇంట్లో ఇంకో పెళ్లి కూడా జరగాలి కాదమ్మా అన్నాడు రంగారావు.
అయినా అంత అవసరం ఏం వచ్చిందే , విడిగా నువ్వు, రమ్య  కలిసి ఒక ఇల్లు తీసుకోవచ్చు కదా. అంది మాధవి.
వెదికాము అమ్మా, ఇల్లు దొరకలేదు. ఒకపక్క హాస్టల్ అక్కడనుండి తీసేస్తున్నారు. బిల్డింగ్ ఓనర్ ఆ బిల్డింగ్ అమ్మేశాడు. ఖాళీ చెయ్యక తప్పలేదు. అప్పటికి రఘు, సునీల్ గారి ఇంట్లో ప్రస్తుతానికి సర్దుకుని , వేరే ఇల్లు చూద్దాం అని చేరాము చెప్పింది హారిక ప్రాధేయపడుతూ.
సర్లే , రేపు నిన్ను చూడటానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు, ఇవాళ రేపు అయినా సరిగా తిని, సవ్యంగా నిద్ర పో అంది మాధవి.
ఇదేంటమ్మా ఈ మాట నాకెందుకు చెప్పలేదు అడిగింది విసుగ్గా హారిక.
ఆ చెపితే నువ్వు వచ్చేదానివా,  ఏదో ఒకే సాకు చెప్పి దాటేస్తావు. నీ వెనకాల ఇంకో పిల్ల ఉంది తెలుసా , దాని పెళ్లి కూడా చెయ్యాలి.
నాన్నగారికి ఇంకా మూడేళ్లే ఉంది రిటైర్ అవటానికి అంది మాధవి .
హారిక కు ఈ పెళ్లి చూపులు మాట వినగానే కొంచెం చిరాకు అనిపించింది, ఇంకా పెళ్ళిచూపులకి మగపెళ్లి వాళ్ళు రావటం , పిల్లను చూడటం ఇవన్నీ ఫార్మాలిటీస్ ఏంటో అర్థం కావటం లేదు.  ఏ హోటల్ లోనో, లేక పార్టీ లోనో కలిసినప్పుడు చూసి మాటాడుకుంటే సరిపోయేది.  పెళ్లి చేసుకోకుండా ఉండనూలేము, అట్లాగని ఇలా తలవంచుకుని కూర్చోనూలేము. విసుగు అనిపించింది హరికకు.
ఇంతకీ వచ్చే ఆ పెళ్ళికొడుకు ఏంచేస్తాడమ్మా అడిగింది హారిక మాధవిని.
ఏమోనే అది మీ నాన్నగారికి తెలుసు, ఏదో సాఫ్ట్ వేర్ ఉద్యోగమే అనుకుంటాను అంది మాధవి.
ఎంత జీతం అడిగింది హారిక.
తెలీదే అంది మాధవి.
ఎక్కడ ఉద్యోగమో తెలీదు, ఎంత జీతమో తెలీదు .. ఏంటమ్మా మరి ఏమి కనుక్కుని ఏర్పాటుచేశారు ఈ పెళ్లి చూపులు అడిగింది హారిక.
అన్ని వివరాలు మీ నాన్న గారికి తెలుసులేవే చెప్పింది మాధవి.
ఇక మరుసటి రోజు , హారిక పెళ్లి చూపులు ఏమో గానీ హారిక చెల్లెలు మల్లిక మాత్రం చాల హడావిడి పడుతోంది.
మల్లికను చూసి , ఒసే పెళ్లి చూపులు నీకు కాదు , హారిక కు అంది మాధవి.
మల్లిక చిన్నబుచ్చుకుని తన గది లోకి వెళ్ళిపోయింది.
సాయంత్రం 4 గం నుంచే హడావిడి పడుతున్నారు అందరూ.  పొద్దుటినుండి ఇల్లంతా సర్ది , అన్ని వస్తువులు శుభ్రంగా ఉండేటట్లు చేసి,  ఎక్కడి గుడ్డలు అక్కడే పడేసి ఉంచకుండా నీట్ గా సర్దారు .  పెళ్లిచూపులు కూర్చునే హాలుని  మటుకు కాస్త ఎక్కువ శ్రద్ద తో శుభ్రం చేశారు. 
హారికను ప్రత్యేకం గా తయారు చెయ్యాలని ప్రయత్నించింది మాధవి.
వద్దమ్మా , వచ్చేవాడు నన్ను ప్రత్యేకం గా చూడక్కర లేదు. నేను రోజూ ఆఫీస్ కు వెళ్ళేటప్పుడు ఎలా తయారవుతానో అలాగే ఉంటాను , చాలు అంది హారిక.
ఏమోనే మొండిదానివి , చెబితే అర్థం కాదు నీకు . కనీసం నెమ్మదిగా అయినా మాట్లాడు వాళ్ళతో అంది మాధవి.
ఇక హారిక చెల్లెలు మల్లిక కాలు నిలవటం లేదు.  ఇంట్లోకి బయట వీధి గుమ్మం దగ్గరకు , ఒక్కో సారి రోడ్డు మీదకు కూడా వెళ్లి చూసి వస్తోంది పెళ్లి వాళ్ళు వస్తున్నారేమో నాని.
పది నిముషాల తర్వాత రంగారావు పెళ్ళివాళ్ళను వెంట పెట్టుకు వచ్చాడు. ఈలోగా వీళ్ళు వచ్చారన్న సంగతి మల్లిక అమ్మకు చేరవేసింది.
మల్లికా ! అందరికీ మంచినీళ్లు పట్రామ్మ చెప్పాడు రంగారావు వచ్చిన వాళ్లకు కూర్చోండి అని చెబుతూ . పెళ్లికొడుకుకు అతనికోసం ప్రత్యకం గా కేటాయించిన కుర్చీ ని చూపించాడు. వాళ్ళు ముగ్గురే వచ్చారు. పెళ్లి కొడుకు , అతని తల్లిదండ్రులు. పెళ్ళికొడుకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడట. కానీ అతను రాలేదు.
 
హారిక కు కొంచం టెన్షన్ గానే ఉంది. ఏం మాట్లాడాలి , ఏం మాట్లాడకూడదు అర్థం కావటం లేదు.  రోజూ ఎంతోమంది మగవాళ్ల  మధ్యలోనే ఆఫీస్ లో పని చేస్తాము.  అప్పుడు ఎటువంటి కంగారూ ఉండదు , మరి ఇదేంటి ఇపుడు ఇలా.  తానూ టెన్షన్ పడకుండా ఉండటానికి ప్రయత్నిస్తోంది.
పెళ్ళికొడుకు తల్లిదండ్రులతో  రంగారావు మాట్లాడుతున్నాడు.  పెళ్ళికొడుకు మటుకు  ఎంచేయాలో తోచక కూర్చున్న చోటునుండే ఇల్లంతా చూడటానికి ప్రయత్నిస్తున్నాడు.
ఈలోగా మాధవి హారికను తీసుకుని వీళ్ళున్నహాల్ లోకి వచ్చింది.  హారిక తల దించుకుని ఉంది. అతను కూడా తల ఎత్తి చూడలేదు. ఒకళ్ళనొకళ్ళు చూడటానికి ఇద్దరూ చాలా మొహమాటపడుతున్నారు .
అమ్మాయిని చూడు నాన్న అంది పెళ్ళికొడుకు తల్లి పెళ్ళికొడుకు తో.
మాధవి కూడా పెళ్ళికొడుకుని చూడమని చెప్పింది హారిక తో.
ఇద్దరూ ఒకేసారి ఒకరినొకరు చూడటం జరిగింది.  ఇద్దరికీ నోటమాట రాలేదు. ఇద్దరికీ ఒకటే ఆశ్చర్యం, కళ్ళలో ఆనందం. హారిక కు ఆనంద డోలికలలో ఊగులాడుతున్నట్లు ఉంది.  ఎం మాట్లాడాలో అర్థం కావటం లేదు . ఒక్కసారి యెగిరి గంతెద్దామా అన్నట్లు ఉంది.  పెళ్ళికొడుకు ఎవరోకాదు తాను మూగగా ప్రేమిస్తూ, తన ప్రేమను చెప్పలేక మనసులోనే ఉంచుకుని, ఎలా చెప్పాలో అర్థం కాక మొహమాటమో, భయమో, బిడియమా ఏమీ తెలియని పరిస్థితి లో ఉన్న తనకు , దేవుడు తన మొర విని పంపించాడా అన్నట్టు ఆ వచ్చింది తన మనసులోని ప్రేమికుడు , తన రూమ్ మెట్ రఘు. హారికకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఏం మాట్లాడితే రఘు ఏమనుకుంటాడో అని మౌనం గా ఉండిపోయింది.
మరి రఘు పరిస్థితి , తాను అసలు ఈలోకంలో లో వున్నాడా, ఇది నిజమేనా , తాను చూస్తున్నది హారిక నేనా అని ఆశ్చర్య పోయాడు. తాను మనసులోనే దాచుకుని పైకి చెప్పలేక , చెబితే తన క్యారెక్టర్ ని ఎక్కడ తప్పుగా అనుకుంటారో అని హారిక మీద ఉన్న ప్రేమను మనసులోనే ఉంచుకున్నాడు.  తనను చూడగానే ఆశ్చర్యం, ఆనందం, తాను దేర్యం చేసి చెప్పలేక మనసులోనే ఉంచుకుని తపన పడుతున్న తన ప్రేమను దేవుడు విని మొర ఆలకించాడా అన్నట్టు హారిక పెళ్లి కూతురు గా ఉండటం తన అదృష్టం అనుకున్నాడు.
రఘు ఆలోచనలో పడ్డాడు , తనకు హారిక నచ్చింది అని చెబితే , హారికకు తనంటే ఇష్టం ఉందొ లేదో. ఒకవేళ ఇష్టం లేకపోతె తాను OK చెప్పాక తాను NO చెపుతుందా .  ఒకవేళ , ఏసంగతీ మళ్ళీ చెప్తాము అని చెపితే నాకు ఇష్టం లేదని హారిక అనుకుంటుందేమో . ఇన్ని ఆలోచనలతో సతమతమై పోతున్నాడు రఘు.
హారిక కూడా దాదాపు అదేపరిస్థితి లో ఉంది. సామాన్యం గా పెళ్లికూతురు వైపు వాళ్ళు తమ అభిప్రాయం ముందు చెప్పరు.  ఒకవేళ రఘు కు తనను పెళ్లి చేసుకోవాలనే అభిప్రాయం లేదేమో. ఇంకెవరినైనా ప్రేమిస్తున్నాడేమో. వేరే వాళ్ళను ప్రేమిస్తే పెళ్లి చూపులకు ఎందుకు వస్తాడు. తల్లిదండ్రుల మాట కాదనలేక పెళ్లిచూపులు వరకే కదా , అని వచ్చాడా.   అబ్బా ...దేవుడా ఏంటి ఈ టెన్షన్ అనుకుంటోంది హారిక.
ఇంతలో , మీరిద్దరూ విడిగా మాట్లాడు కోవాలంటే మాట్లాడుకోండి అన్నాడు రంగారావు పెళ్ళికొడుకు, పెళ్లికూతురు ని ఉద్దేశించి. రెండుమూడు సెకనులు ఆగి కుర్చీలోంచి లేచాడు రఘు , ఈ వచ్చిన అవకాశాన్ని వదలకూడదు అనుకుంటూ.
మొహమాటం గానే ఇద్దరూ విడిగా మాట్లాడుకోవడానికి వెళ్లారు
గదిలోపల రఘు, హారిక ఒకరి నొకరు చూసుకుని ఇద్దరూ మొహమాట పదుడూ నిలబాడ్డారు. 
కూర్చోండి అంది హారిక .
మీ ఇల్లు అని తెలీదు అన్నాడు రఘు
మీరే పెళ్ళికొడుకు అని తెలీదు అంది హారిక.
మీకు అబ్యంతరం లేకపోతె మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే నా అంత అదృష్టవంతుడు ఉండదేమో. మరి మీ అభిప్రాయం అడిగాడు ఆగలేక రఘు.
మీకు ఓకే అయితే నాకూ ఓకే అంది హారిక తల ఎత్తి రఘు వైపు చూడాలనుకొని చూడలేక సిగ్గుతో.
ఒకరికి ఒకరు వారి మీద ఉన్న ప్రేమను, ఇష్టాన్ని చెప్పుకున్నారు. రెండు నిముషాలు కూడా కాలేదు. బయటకు వచ్చారు.
రఘు తన అభిప్రాయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పగానే , వాళ్ళు అక్కడే చెప్పేసారు , అమ్మాయి నచ్చింది అని. ఆ మాట చెప్పి వాళ్ళు బయలుదేరుతాము అంటుంటే రంగారావు ఒక్క నిముషం అని లోపలి వెళ్లి హారిక అభిప్రాయం, కనుక్కుని వచ్చి మాకు కూడా ఓకే అని అప్పుడే చెప్పేసాడు.
 ఇల్లంతా సంతోషం తో నిండిపోయింది. పెళ్లి వాళ్ళు కూడా బయలుదేరారు.
రంగారావు తిరిగి వచ్చాక , మాధవి , రంగారావు లకు నెమ్మదిగా చెప్పింది హారిక తాను కలిసి సహజీవనం అన్న పేరుతో ఉంటోంది మరెవరితోనే కాదు రఘు , వాళ్ళ ఫ్రెండ్ సునీల్ తో అని.
అందరూ సంతోషం గా హమ్మయ్య  అని ఊపిరి పీల్చుకున్నారు

కామెంట్‌లు
Shyamkumar chagal నిజామాబాద్ చెప్పారు…
అద్భుతం..great narration.
Karunasagar చెప్పారు…
Nice.. present situation alage vundhi.Luckyga same person avadamtho sukanthamyndhi...
సత్తి పద్మ చెప్పారు…
ఒక మధ్యతరగతి, సంప్రదాయంగా ఉండే కుటుంబంలో ఎలా ఉంటుందో అలా సంభాషణలు రాయడం, మనస్తత్వాలను చిత్రీకరించడం లో కృతకృత్యులయ్యారు. చాలా సహజంగా ఉంది. నేటి పరిస్థితులకు అనుకూలంగా జీవిస్తూనే, విలువలను కాపాడిన హారిక,రఘుల పాత్రలు హుందాగా మలిచారు.
చివరికి వారే వివాహం ద్వారా దగ్గరవ్వడం వల్ల ముగింపు బాగుంది.బాగా రాశారు సత్యప్రసాద్ గారు.
సత్తి పద్మ చెప్పారు…
ఒక మధ్యతరగతి సంప్రదాయంగా ఉండే కుటుంబంలో ఎలా ఉంటుందో అలా సంభాషణలు రాయడం, మనస్తత్వాలను చిత్రీకరించడం లో కృతకృత్యులయ్యారు. చాలా సహజంగా ఉంది. నేటి పరిస్థితులకు అనుకూలంగా జీవిస్తూనే, విలువలను కాపాడిన హారిక,రఘుల పాత్రలు హుందాగా మలిచారు. చివరికి వారే వివాహం ద్వారా దగ్గరవ్వడం వల్ల ముగింపు బాగుంది.బాగా రాశారు సత్యప్రసాద్ గారు.
సత్తి పద్మ చెప్పారు…
ఒక మధ్యతరగతి సంప్రదాయంగా ఉండే కుటుంబంలో ఎలా ఉంటుందో అలా సంభాషణలు రాయడం, మనస్తత్వాలను చిత్రీకరించడం లో కృతకృత్యులయ్యారు. చాలా సహజంగా ఉంది. నేటి పరిస్థితులకు అనుకూలంగా జీవిస్తూనే, విలువలను కాపాడిన హారిక,రఘుల పాత్రలు హుందాగా మలిచారు. చివరికి వారే వివాహం ద్వారా దగ్గరవ్వడం వల్ల ముగింపు బాగుంది.బాగా రాశారు సత్యప్రసాద్ గారు.
సత్తి పద్మ చెప్పారు…
ఒక మధ్యతరగతి సంప్రదాయంగా ఉండే కుటుంబంలో ఎలా ఉంటుందో అలా సంభాషణలు రాయడం, మనస్తత్వాలను చిత్రీకరించడం లో కృతకృత్యులయ్యారు. చాలా సహజంగా ఉంది. నేటి పరిస్థితులకు అనుకూలంగా జీవిస్తూనే, విలువలను కాపాడిన హారిక,రఘుల పాత్రలు హుందాగా మలిచారు. చివరికి వారే వివాహం ద్వారా దగ్గరవ్వడం వల్ల ముగింపు బాగుంది.బాగా రాశారు సత్యప్రసాద్ గారు.