గాలిపటం( బాల గేయం )-గుండాల నరేంద్రబాబు ఎం.ఏ (తెలుగు సాహిత్యం).,ఎం.ఏ (చరిత్ర).,ఎం.ఏ (సంస్కృతం).,బి.ఇడి.,
ఎవరు నేర్పారమ్మా 
కోయిలమ్మకూ 
కమ్మగా కుహూ అంటూ..
పాడాలనీ

ఎవరు నేర్పారమ్మా
 నెమలమ్మకూ
 అందంగా 
నాట్యమే చేయాలనీ

ఎవరు నేర్పారమ్మా 
మీనాలకు 
యేటికి ఎదురుగా
ఈదాలనీ

ఎవరు నేర్పారమ్మా
కాకమ్మకూ
కష్టాలలో 
కలిసి ఉండాలనీ

ఎవరు నేర్పారమ్మా
ఉడతమ్మకు
చిరు సాయమైనా
చేయాలనీ

ఎవరు నేర్పారమ్మా
తరువమ్మకూ
చల్లని తల్లిగా
ఉండాలనీ

ఎవరు నేర్పారమ్మా 
ఈ పక్షులకూ
పర్యావరణ పరిరక్షకులుగా
మారాలనీ

ఎవరు నేర్పారమ్మా
ఈ ధరణికి
సర్వజీవులకు
ఆధారమవ్వాలనీ

ఎవరు నేర్పారమ్మా
ఆ గాలిపటానికి
ఎదురు గాలికే 
ఎదురొడ్డి ఎగరాలనీ!

=======================
తెలుగు పరిశోధకులు  
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం,  తిరుపతి.
సెల్: 9493235992.


కామెంట్‌లు