పండ్ల విందు (బాల సాహిత్యం )కథానిక ;-ఎం. వి. ఉమాదేవి
 అనగనగా చిలకలవనం అనే అడవిలో పక్షులు, జంతువులు కలిసి ఎంతో అన్యోన్యంగా జీవిస్తూ ఉండేవి. ఎవరికి వాళ్ళు గా పొదల్లో, గుహల్లో కాపురాలు ఉన్నా, అప్పుడప్పుడు కలిసి ఒకే చోట, ఏ మర్రి చెట్టు కిందో, సరస్సు ఒడ్డున ఇసుక తిన్నె మీదో సమావేశం అయి కష్టం ఇష్టం  మాట్లాడుకొని  పోతుoడేవి. 
   ఒకరోజు సింహం రాజు గారి గారాల కొడుకు రాజసింహా పుట్టినరోజు అనీ, అందరు ఆరోజే సాయంత్రం సరస్సు ఒడ్డున హాజరు కావాలని కోతుల  నాయకుడు పవన్ వచ్చి అందరికి చెప్పాడు.. ఇక అందరు అదే పనిలో బహుమతి ఏం తీసుకొని పోవాలా అనీ ఆలోచనలో పడ్డారు. 
    పవన్ ఏమో మనకు డబ్బులపని ఏముంది.? ఏది దొరికితే అదే ఇద్దాం అనగా...ఆ మాట  అందరికి నచ్చింది. ఎలుగు బంటి జాంబూకి పక్కన ఉండే అడవి కూడా తెలుసు. అక్కడ పల్లెలు ఉండటంతో తోటలూ, వరి చేలు ఉంటాయి. అది  చల్లగా నలుగురు పిల్లలతో వెళ్లి, కాయలు పండ్లు ఎడా పెడా తెంపి తెచ్చేసింది. ఇక తేనె పట్లు ఓ రెండు కూడా !
   సాయంత్రం అన్నీ సరస్సు దగ్గరికి పోయే సరికి రాజ సింహా  పుట్టినరోజు సందర్బంగా ప్రత్యేక అలంకరణలో ఉన్నాడు. అందరు ఒక్కొక్కరే వెళ్లి శుభాకాంక్షలు చెప్పి బహుమతి ఇచ్చారు. జాంబూ తన వంతు రాగానే పాత గోనె సంచి రైతులు పొలాల్లో పడేసి ఉంటే దాన్లో తెచ్చిన తాజా పండ్లు సింహం ముందు కుప్పపోసింది. 
   ఎరుపు పసుపు ఆకుపచ్చ రంగుల్లో రక రకాల పండ్లు చూసి కుందేలు,ఏనుగు వంటివి లొట్ట లేసి... అవన్నీ రాజు కే కదా అని నీరసం గా ఉన్నాయి. 
      అంతలో పులి, తోడేలు కొన్ని  మాంస ఖండాలు తెచ్చి పడేశాయి. గాలి గుప్పుమని కొట్టి  దుర్వాసన వ్యాపించి రాజసింహా తో సహా ఆందరూ  ముక్కు మూసుకొని ఛీ ఛీ  అన్నారు. 
   " ఎవరు ఇవి తెచ్చినవారు? ' అని మంత్రి అయిన ఖడ్గమృగం కోపం గా అడిగింది  
" మేమే మహా మంత్రి ! ఇవాళ ఏమి దొరకలేదు. మొన్నో గుర్రం బాట లో చనిపోయుంటె ఇలా చేసి తెచ్చాం !"అన్నాయ్ పులి, తోడేలు. 
    " మా రాజసింహా తాజా మాంసమే కష్టపడి వేటాడి తినగలుగుతున్నాడు. ఇలాంటి పనులు ఎప్పుడు చేయొద్దు ! ఈ పండ్లు, కాయలు నవ నవ లాడుతున్నాయి. మాకానుక గా ఇవన్నీ అందరికి పంచండి !"అన్నాడు సింహరాజు. దాంతో ఆహారం దొరకని జంతువులు ఆనందం తో కేరింతలు కొట్టి తలో నాలుగు తీసుకున్నాయి.ఆకుల దొన్నెల్లో తలా కొంచెం తేనె చప్పరించి నాట్యాలు చేశాయి.  అలా పుట్టినరోజు పండుగ చక్కగా జరిగింది.!

కామెంట్‌లు